టీ20ల్లో కోహ్లి, రోహిత్‌ల శకం ముగిసినట్లే..!

Team Rebuilding For Next T20 WC, Need To Be Patient With Youngsters Says Dravid - Sakshi

పుణే: వచ్చే ఏడాది జరిగే టీ20 ప్రపంచకప్‌ కోసం జట్టును తీర్చిదిద్దే పనిలో ఉన్నామని, కుర్రాళ్ల ప్రదర్శన విషయంలో కాస్త సహనం ప్రదర్శించాలని భారత క్రికెట్‌ జట్టు హెడ్‌ కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ వ్యాఖ్యానించాడు. యువ ఆటగాళ్లకు మరింత అనుభవం కావాలని అతను అభిప్రాయం వ్యక్తం చేశాడు. గురువారం శ్రీలంక చేతిలో 16 పరుగుల తేడాతో భారత్‌ ఓడిన తర్వాత ద్రవిడ్‌ మీడియాతో మాట్లాడాడు.

‘భారత జట్టులోని కుర్రాళ్లలో మంచి ప్రతిభ ఉంది. అయితే ఇంకా నేర్చుకునే దశలో ఉన్నారు. అంతర్జాతీయ క్రికెట్‌లో ఆడుతూ ఉంటేనే నేర్చుకునేందుకు అవకాశం ఉంటుంది. అందుకే వారి విషయంలో మనం కాస్త ఓపిక ప్రదర్శించాలి. వచ్చే ఏడాది జరిగే టీ20 ప్రపంచకప్‌ కోసమే ఈ టీమ్‌ను సిద్ధం చేస్తున్నాం. వరల్డ్‌ కప్‌ సెమీ ఫైనల్‌ ఆడిన టీమ్‌తో పోలిస్తే జట్టులో చాలా మారింది. ముగ్గురు, నలుగురు మాత్రమే ప్రస్తుత తుది జట్టులో ఉన్నారు’ అని ద్రవిడ్‌ చెప్పాడు.

ఈ వ్యాఖ్యతో టీ20 క్రికెట్‌లో కోహ్లి, రోహిత్‌ శర్మవంటి సీనియర్ల ఆట ముగిసిందని ద్రవిడ్‌ పరోక్షంగా చెప్పినట్లయింది. ఈ ఏడాది జరిగే వన్డే వరల్డ్‌కప్‌పైనే అందరి దృష్టీ ఉంటుంది కాబట్టి కొత్త కుర్రాళ్లకు టి20ల్లో అవకాశం ఇచ్చేందుకు ఇదే సరైన సమయంగా ద్రవిడ్‌ భావిస్తున్నాడు. ‘వరల్డ్‌ టెస్టు చాంపియన్‌షిప్, వన్డే వరల్డ్‌ కప్‌ల గురించి అంతా ఆలోచిస్తున్నారు. అందుకే ఈ ఫార్మాట్‌లో కొత్తవారికి అవకాశాలు అవసరం. వారికి తగినన్ని మ్యాచ్‌లు ఇచ్చి అండగా నిలవడం అవసరం. కుర్రాళ్లు ఉన్న టీమ్‌లకు ఇలాంటి మ్యాచ్‌లలో ఓటములు సహజమని అర్థం చేసుకోవాలి’ అని ద్రవిడ్‌ స్పష్టం చేశాడు.  

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top