భువీని కాదని హర్షిత్‌కు చోటు.. గంభీర్‌పై ఆగ్రహజ్వాలలు | Team india Fans fire on Gautam gambhir for backing Harshit rana yet again, after sensational performance of Bhuvneshwar kumar in IPL 2026 | Sakshi
Sakshi News home page

భువీని కాదని హర్షిత్‌కు చోటు.. గంభీర్‌పై ఆగ్రహజ్వాలలు

Jun 6 2026 6:46 PM | Updated on Jun 6 2026 8:00 PM

Team india Fans fire on Gautam gambhir for backing Harshit rana yet again, after sensational performance of Bhuvneshwar kumar in IPL 2026

భారత సీనియర్‌ క్రికెట్‌ జట్టులో కెప్టెన్లకే గ్యారెంటీ లేని రోజుల్లో, ఓ ఆటగాడు కోచ్‌ అండదండలతో దాదాపు ప్రతి జట్టులో చోటు దక్కించుకుంటున్నాడు. ఆ ఆటగాడి పేరే హర్షిత్‌ రాణా. ఈ 24 ఏళ్ల కేకేఆర్‌ పేసర్‌కు గంభీర్‌తో సత్సంబంధాలు ఉన్నాయి. గంభీర్‌ కేకేఆర్‌ కోచ్‌గా పని చేసే సమయంలో హర్షిత్‌ను బాగా వెనకేసుకొచ్చాడు. టీమిండియా కోచ్‌గా ఎంపికయ్యాక భారీ లాబీయింగ్‌ జరిపి హర్షిత్‌కు ఏకంగా భారత జట్టులోనే చోటు ఇప్పించాడు.

అది కూడా ఏదో ఒక ఫార్మాట్‌కే అనుకుంటే పొరపాటే. మూడు ఫార్మాట్ల‌ జట్లలో ఎవరున్నా, లేకపోయినా హర్షిత్‌ పేరు ఉంటుంది. బుమ్రా అయినా ఏదో ఒక సిరీస్‌ జట్టులో ఉండడేమో కానీ, హర్షిత్‌ మాత్రం దాదాపు ప్రతి జట్టులో ప్రత్యక్షమవుతాడు. హర్షిత్‌కు ఇంతలా అవకాశాలు వస్తున్నాయంటే, అతడేదో భారీ టాలెంటెడ్‌ అనుకుంటే పొరబడినట్లే. ఇప్పటివరకు అతడు టీమిండియా తరఫున 2 టెస్ట్‌లు, 14 వన్డేలు, 9 టీ20లు ఆడినా చెప్పుకోదగ్గ ఒక్క ప్రదర్శన కూడా లేదు.

ఇలాంటి ఆటగాడికి భారత సెలెక్టర్లు ఏం చూసి ఇన్ని అవకాశాలు ఇస్తున్నారో ఎవరికీ అంతుచిక్కడంలేదు. ఏదో కోచ్‌ అండదండలతో నెట్టుకొస్తున్నాడు కానీ, హర్షిత్‌ దేశవాలీ జట్లకు కూడా చాలా ఎక్కువే. ఇది చాలామంది టీమిండియా అభిమానుల "అభిప్రాయం". తాజాగా గంభీర్‌-హర్షిత్‌ బంధం మరోసారి సోషల్‌మీడియాలో చర్చనీయాంశంగా మారింది.

ఐర్లాండ్‌, ఇంగ్లండ్‌ టీ20 సిరీస్‌లతో పాటు ఆసియా క్రీడలకు ఇవాళ ప్రకటించిన మూడు వేర్వేరు భారత జట్లలో హర్షిత్‌కు చోటు దక్కింది. ఇతగాడు గాయం కారణంగా ఐపీఎల్‌ 2026లో ఒక్క మ్యాచ్‌ ఆడకపోయినా సెలెక్టర్లు నేరుగా జాతీయ జట్టులో మరోసారి అవకాశం ఇచ్చారు. వాస్తవానికి టీమిండియాకు ఎంపిక కావడానికి ఐపీఎల్‌ ప్రదర్శనలు కొలమానం కానప్పటికీ.. దురదృష్టవశాత్తు ఇటీవలికాలంలో ఇదే తంతు కొనసాగుతుంది.

ఐపీఎల్‌ ప్రదర్శనలనే పరిగణలోకి ఓ ఆటగాడికి అవకాశం ఇవ్వాలనుకుంటే ఆర్సీబీ వెటరన్‌ పేసర్‌ భువనేశ్వర్‌ కుమార్‌కు మొదటి అవకాశం ఇవ్వాలి. ఎందుకంటే ఈ సీజన్‌లో భువీ చాలా అద్భుతంగా బౌలింగ్‌ చేశాడు. ఏకంగా టోర్నీ సెకెండ్‌ లీడింగ్‌ వికెట్‌ టేకర్‌గా నిలిచి ఆర్సీబీ వరుసగా రెండో ఎడిషన్‌లో ఛాంపియన్‌గా నిలవడంలో ప్రధానపాత్ర పోషించాడు.

భువీ లాంటి ఇన్‌ ఫామ్‌ బౌలర్‌ను కాదని గాయపడి 2-3 నెలుల ఆటకు దూరంగా ఉన్న హర్షిత్‌ లాంటి అన్‌ ఫిట్‌ బౌలర్‌కు ఏకంగా మూడు భారత జట్లలో అవకాశం ఇవ్వడాన్ని ప్రతి భారత క్రికెట్‌ అభిమాని తప్పుబడుతున్నాడు. హర్షిత్‌ ఎంపికలో ప్రతిసారి చక్రం తిప్పే కోచ్‌ గంభీర్‌పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నాడు. గంభీర్‌-చీఫ్‌ సెలెక్టర్‌ అజిత్‌ అగార్కర్‌ అర్హతలేని ఆటగాళ్లను ఎంపిక చేసే మాఫియా నడుపుతున్నారని ఫైరవుతున్నాడు.

కాగా, ఐర్లాండ్‌, ఇంగ్లండ్‌ టీ20 సిరీస్‌లతో పాటు ఆసియా క్రీడలకు ఇవాళ ప్రకటించిన మూడు వేర్వేరు భారత జట్లకు శ్రేయస్‌ అయ్యర్‌ కెప్టెన్‌గా నియమితుడయ్యాడు. భారత సెలెక్టర్లు సూర్యకుమార్‌ యాదవ్‌ను తప్పించి శ్రేయస్‌కు కొత్త టీ20 కెప్టెన్‌గా పట్టం కట్టారు. 

సూర్యకు జట్టులో స్థానం కూడా గల్లంతైంది. యువ సంచలనం వైభవ్‌ సూర్యవంశీకి తొలిసారి భారత సీనియర్‌ జట్టు నుంచి పిలుపందింది. మూడు వేర్వేరు జట్లలో చోటు దక్కించుకున్న అతి కొద్ది మంది ఆటగాళ్లలో హర్షిత్‌ రాణా ఒకరు. 

Advertisement
 
Advertisement
Advertisement