T20 WC: How Lalchand Rajput Engineered Zimbabwe Transformation 4-Years - Sakshi
Sakshi News home page

లాల్‌ మంత్రం పని చేసింది.. జింబాబ్వేను మార్చేసింది

Published Sat, Oct 29 2022 3:34 PM

T20 WC: How Lalchand Rajput Engineered Zimbabwe Transformation 4-Years - Sakshi

టి20 ప్రపంచకప్‌లో జింబాబ్వే పాకిస్తాన్‌కు షాక్‌ ఇచ్చి రెండు రోజులు కావొస్తుంది. అయినా ఇంకా ఆ జట్టు గురించి.. వాళ్లు చేసిన అద్భుతం గురించి మాట్లాడుకుంటూనే ఉన్నాం. టైటిల్‌ సాధిస్తుందో లేదో తెలియదు కానీ జింబాబ్వే ఆటతీరు మునుపటిలా లేదని మాత్రం కచ్చితంగా చెప్పొచ్చు. మరి ఇంతలా జింబాబ్వే ఆటలో మార్పు  రావడానికి కారణమైన వ్యక్తి ఎవరో తెలుసా. టీమిండియా మాజీ క్రికెటర్‌ లాల్‌చంద్‌ రాజ్‌పుత్‌.

2018 నుంచి 2022 వరకు లాల్‌ చంద్‌ రాజ్‌పుత్‌ జింబాబ్వే హెడ్‌కోచ్‌గా పని చేశాడు. ఈ నాలుగేళ్లలో జింబాబ్వే ఆటగాళ్లను సాన పట్టిన విధానం తాజాగా ప్రపంచకప్‌లో బయటపడింది. మరో విషయం ఏంటంటే 2007 అరంగేట్రం టి20 ప్రపంచకప్‌ గెలిచిన టీమిండియాకు లాల్‌చంద్‌ రాజ్‌పుత్‌ కోచ్‌గా వ్యవహరించడం విశేషం.

లాల్‌చంద్‌ రాజ్‌పుత్‌ పనికి ముచ్చటపడిన బోర్డు టెక్నికల్‌ డైరెక్టర్‌గా నియమించుకుంది. టి20 ప్రపంచకప్‌లో జింబాబ్వే క్వాలిఫయింగ్‌ మ్యాచ్‌లు ఆడేవరకు రాజ్‌పుత్‌ జట్టుతోనే ఉన్నాడు. ఈలోగా దీపావళి పండుగ.. కొన్ని వ్యక్తిగత కారణాల రిత్యా ఇండియాకు తిరిగి వచ్చిన రాజ్‌పుత్‌ ఆస్ట్రేలియాకు వెళ్లలేదు. ఈలోగా పొట్టి ప్రపంచకప్‌లో పాకిస్తాన్‌పై విజయం సాధించింది.  జింబాబ్వే ప్రదర్శనపై సంతృప్తి వ్యక్తం చేసిన లాల్‌చంద్‌ రాజ్‌పుత్‌ పీటీఐకి ఇంటర్య్వూలో పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.

''తేది కరెక్ట్‌గా గుర్తులేదు.. కానీ అది జూలై 2018 అని మాత్రం కచ్చితంగా చెప్పగలను. ఆరోజే జింబాబ్వే హెడ్‌కోచ్‌గా బాధ్యతలు చేపట్టాను. నేను పదవి చేపట్టిన సమయంలోనే పాకిస్తాన్‌తో ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ ఆడాల్సి ఉంది. అయితే మ్యాచ్‌కు ముందు రోజు జింబాబ్వే సీనియర్‌ క్రికెటర్లు అయిన సీన్‌ ఇర్విన్‌, క్రెయిగ్‌ విలియమ్స్‌, బ్రెండన్‌ టేలర్‌, సికందర్‌ రజాలు బోర్డుతో ఉన్న విభేదాల కారణంగా సిరీస్‌ నుంచి తప్పుకున్నారు. నేను ఎంత చెప్పి చూసినా నా మాట కూడా వినలేదు హెడ్‌కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన తొలి సిరీస్‌లోనే ఇలా సీనియర్‌ ఆటగాళ్లు దూరం కావడం నాకు బాధను కలిగించింది.

ఏం చేయలేని పరిస్థితి. అప్పటికే జింబాబ్వే క్రికెట్‌ బోర్డు ఎండీ గివ్‌మోర్‌ మాకోని సిరీస్‌ను రద్దు చేయడం కుదరదని తేల్చిచెప్పాడు. దీంతో అందుబాటులో ఉన్న జట్టుతోనే సిరీస్‌ ఆడి క్వీన్‌స్వీప్‌ అయ్యాం. ఇందులో రెండు మ్యాచ్‌ల్లో వంద లోపే ఆలౌట్‌ అయ్యాం. అలా జింబాబ్వే జట్టుతో నా తొలి అనుభవమే వింతగా జరిగింది. ఈ ప్రదర్శన జింబాబ్వేను 2019 వన్డే ప్రపంచకప్‌కు దూరం చేసింది. జింబాబ్వే జట్టును మార్చాల్సిన అవసరం చాలా ఉందని అప్పుడే నిశ్చయించుకున్నా. ఈ నాలుగేళ్లలో రెండు మేజర్‌ టోర్నీలకు కనీసం అర్హత సాధించలేకపోయాం.

ఒక ఇంజనీర్‌ బిల్డింగ్‌ను కట్టడానికి ఎంత కష్టపడతాడో.. ఈ నాలుగేళ్లలో ఆటగాళ్లతో సమన్వయం చేసుకుంటూ జట్టును మార్చిన తీరు నాకు సంతోషాన్ని ఇచ్చింది. 2022 టి20 ప్రపంచకప్‌లో జింబాబ్వే అర్హత సాధించడం నా కల. ఆ కలను ఇవాళ మా ఆటగాళ్లు నెరవేర్చారు. కుర్రాళ్లకు తాము రాణించగలమనే ఆత్మవిశ్వాసం బాగా పెరిగింది. ఎంగరా, రియాన్‌ బర్ల్‌, చటార, లూక్‌ జాంగ్వే లాంటి యువ క్రికెటర్లు జింబాబ్వే క్రికెట్‌ ఎదుగుదలకు కారణమవుతున్నారు.'' అని చెప్పుకొచ్చాడు.

ఈ ఏడాది జింబాబ్వే పూర్వవైభవం దిశగా అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది. సిరీస్‌లు గెలవకున్నా ఆటగాళ్లు మాత్రం తమ ఆటతీరుతో ఆకట్టుకున్నారు. అలా అని జింబాబ్వేను తేలికగా తీసిపారేయడానికి లేదు. రెండు దశాబ్దాల కింద ప్లవర్‌ సోదరులు, హిత్‌స్ట్రీక్‌, అలిస్టర్‌ క్యాంప్‌బెల్‌, నీల్‌ జాన్సన్‌, ముర్రే గుడ్‌విన్స్‌, పాల్‌ స్ట్రాంగ్స్‌, హెన్రీ ఒలాంగా లాంటి ఆటగాళ్లతో జింబాబ్వే జట్టు బలంగానే కనిపించేది.

గత 15 ఏళ్లలో వీరంతా తప్పుకోవడం.. క్రమంగా జింబాబ్వే ఆటను మసకబారేలా చేసింది. బోర్డుతో విబేధాలు ఆటగాళ్లకు మరిన్ని కష్టాలు తెచ్చిపెట్టాయి. వరుసగా సిరీస్‌లు ఆడినప్పటికి అన్నింటిలోనూ ఓడిపోతూ వచ్చింది. ఒకానక దశలో బంగ్లాదేశ్‌, అఫ్గానిస్తాన్‌, ఐర్లాండ్‌ల కంటే దారుణమైన ఆటతీరు కనబరిచింది. కానీ గతేడాది నుంచి జింబాబ్వే ఆటలో చాలా మార్పు వచ్చింది. సీనియర్లు, జూనియర్లు మంచి సయన్వయంతో కలిసి ఆడుతు జింబాబ్వే జట్టును శక్తివంతంగా తయారు చేస్తున్నారు. 

ఇక టి20 ప్రపంచకప్‌లో ఈసారి జింబాబ్వే టైటిల్‌ కొట్టకపోయినా సెమీస్‌కు చేరినా అది పెద్ద విజయం అనే చెప్పొచ్చు. ఒకవేళ ఏదైనా అద్భుతం జరిగి.. జింబాబ్వే ఇలాగే ఆడి ఫైనల్‌ చేరి టైటిల్‌ విజేతగా నిలిచినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఎందుకంటే ఏ జట్టును ఎప్పుడు తక్కువ అంచనా వేయకూడదు. 2012లో వెస్టిండీస్‌ కూడా ఇలాగే ఎవరు ఊహించని రీతిలో టైటిల్‌ను ఎగరేసుకుపోయి క్రీడా ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేసింది. ఏమో గుర్రం ఎగరావచ్చు..

చదవండి: క్రికెట్‌ ఆడితేనే డబ్బులు.. లేదంటే పస్తులు

పాక్‌ మూలాలున్న క్రికెటర్‌ ముచ్చెమటలు పట్టించాడు

Advertisement
Advertisement