Sikandar Raza: పాక్‌ మూలాలున్న క్రికెటర్‌ ముచ్చెమటలు పట్టించాడు

Sikandar Raza Bowling Becomes Turning Point ZIM Beat PAK By 1-Run - Sakshi

టి20 ప్రపంచకప్‌లో జింబాబ్వే పాకిస్తాన్‌కు షాకిచ్చిన సంగతి తెలిసిందే. గురువారం జరిగిన ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్‌ ఒక్క పరుగు తేడాతో పరాజయం పాలైంది. అయితే పాకిస్తాన్‌ ఓటమికి ప్రధాన కారణం జింబాబ్వే ఆల్‌రౌండర్‌  సికందర్‌ రజా అని మాత్రం కచ్చితంగా చెప్పొచ్చు. పాకిస్తాన్‌ మూలాలున్న సికందర్‌ రజా మ్యాచ్‌ను టర్న్‌ చేయడమే గాక ముచ్చెమటలు పట్టించాడు.

సికందర్‌ రజా బౌలింగ్‌ వచ్చే వరకు పాకిస్తాన్‌ 13 ఓవర్లలో మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి 80 పరుగులు చేసింది. అయితే పాకిస్తాన్‌ను ముంచింది మాత్రం రజా వేసిన 14వ ఓవర్‌. ఆ ఓవర్‌లో మూడో బంతిని షాదాబ్‌ ఖాన్‌ లాంగాన్‌ మీదుగా భారీ సిక్స్‌ బాదాడు. దీంతో పాకిస్తాన్‌ ట్రాక్‌లోకి వచ్చినట్లే కనిపించింది. కానీ ఇక్కడే ఊహించని ట్విస్ట్‌ జరిగింది. తర్వాతి బంతికి షాదాబ్‌ ఖాన్‌ను క్యాచ్‌ ఔట్‌గా పెవిలియన్‌ చేర్చి బ్రేక్‌ ఇచ్చాడు. ఆ తర్వాతి బంతికి హైదర్‌ అలీని గోల్డెన్‌ డకౌట్‌ చేశాడు.

హైదర్‌ అలీ రివ్యూకు వెళ్లిన ఫలితం లేకుండా పోయింది. ఇక 16వ ఓవర్‌ రెండో బంతికి పాకిస్తాన్‌ టాప్‌ స్కోరర్‌గా నిలిచిన షాన్‌ మసూద్‌ను తెలివైన బంతితో బోల్తా కొట్టించాడు. రజా వైడ్‌ వేయగా.. అవసరంగా ఫ్రంట్‌ఫుట్‌ వచ్చిన షాన్‌ మసూద్‌ మూల్యం చెల్లించుకున్నాడు. సెకన్ల వ్యవధిలో చక్‌బవా స్టంప్స్‌ను గిరాటేసాడు. దీంతో మసూద్‌ పెవిలియన్‌ చేరాడు. మ్యాచ్‌లో టర్నింగ్‌ పాయింట్‌ ఇదే. పాకిస్తాన్‌ ఓటమి దిశగా పయనించింది కూడా ఇక్కడి నుంచే. ఆఖర్లో మహ్మద్‌ నవాజ్‌ ఆశలు రేకెత్తించినప్పటికి జింబాబ్వే అద్భుత పోరాటంతో మ్యాచ్‌ను కైవసం చేసుకుంది. మ్యాచ్‌లో అసలైన హీరో మాత్రం సికిందర్‌ రజానే. అందుకే రజాకు ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు లభించింది.

చదవండి: పాక్‌కు జింబాబ్వే షాక్‌

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top