టీ20 ప్రపంచకప్-2026లో తమ మ్యాచ్‌ల వేదిక మార్పు విషయంలో బంగ్లాదేశ్ ఆఖరి ప్రయత్నం కూడా బెడిసికొట్టే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) ఇప్పటికే ఈ విషయంలో తమ వైఖరి ఏమిటో తెలిపింది. భారత్‌లో బంగ్లా ఆటగాళ్లు, సిబ్బందికి ఎలాంటి ముప్పు లేదని.. ఇక్కడే తమ మ్యాచ్‌లు ఆడాలని స్పష్టం చేసింది.
అయినప్పటికీ పంతం వీడని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) తమ ప్రయత్నాలు కొనసాగిస్తోంది. తమ విజ్ఞప్తిని అంతర్జాతీయ క్రికెట్ మండలి పట్టించుకోకపోవడంతో వివాద పరిష్కారాల కమిటీ (DRC)ను బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఆశ్రయించింది. తాము భారత్‌లో ఆడాల్సిందేనంటూ ఐసీసీ తీసుకున్న నిర్ణయాన్ని నిలిపివేయాలంటూ డీఆర్‌సీని బీసీబీ కోరింది.
అది కుదరని పని
అయితే ఐసీసీ ఆధ్వర్యంలోనే పని చేసే డీఆర్‌సీ వారి విజ్ఞప్తికి స్పందించే అవకాశం లేదు. ఐసీసీ నిబంధనల ప్రకారం బోర్డు డైరెక్టర్లు కలిసి తీసుకున్న నిర్ణయాన్ని సమీక్షించే అధికారం డీఆర్‌సీకి లేదు. ఇక్కడా తమకు సానుకూల స్పందన లభించకపోతే చివరగా కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఆఫ్ స్పోర్ట్స్ (సీఏఎస్)కు వెళ్లాలని కూడా బంగ్లాదేశ్ యోచిస్తోంది.
మరోవైపు.. తమ జట్టు భారత్‌లో మ్యాచ్ ఆడదంటూ తీసుకున్న నిర్ణయాన్ని ముందుగా ఐసీసీకీ చెప్పకుండా బీసీబీ చైర్మన్ అమీనుల్ ఇస్లామ్ మీడియా ముందు ప్రకటించడం కూడా ఐసీసీకి ఆగ్రహం కలిగించింది.
ప్రస్తుతానికి పరిస్థితి చూస్తే బంగ్లాదేశ్‌ను తప్పించడం దాదాపు ఖాయమైనట్లే కనిపిస్తోంది. అండర్–19 వరల్డ్ కప్ జరుగుతున్న నమీబియాలో ఉన్న ఐసీసీ చైర్మన్ జై షా బంగ్లాదేశ్‌ను వరల్డ్ కప్ నుంచి తప్పిస్తూ స్కాట్లాండ్‌కు అవకాశం ఇస్తున్నట్లుగా శనివారం అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.
చదవండి: ఇషాన్ ఏం తిన్నాడో ఏమో.. నాకైతే కోపమొచ్చింది: సూర్య కుమార్


