T20 WC Warm Up Matches: చెలరేగిన ఇంగ్లండ్‌ బ్యాటర్లు.. పాక్‌పై సునాయాస విజయం

T20 WC 2022: England Beat Pakistan By 6 Wickets In Warm Up Match - Sakshi

టీ20 వరల్డ్‌కప్‌ వార్మప్‌ మ్యాచ్‌లు సైతం రంజుగా సాగుతున్నాయి. భారత్‌-ఆస్ట్రేలియా మధ్య ఇవాళ (అక్టోబర్‌ 17) ఉదయం జరిగిన మ్యాచ్‌ ఆధ్యంతం ఉత్కంఠభరితంగా సాగగా (భారత్‌ విజేత).. ఇంగ్లండ్‌-పాకిస్తాన్‌ మధ్య జరిగిన రెండో మ్యాచ్‌ అభిమానులకు కావాల్సిన మజాను అందించింది. పాక్‌ నిర్ధేశించిన 161 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లీష్‌ బ్యాటర్లు ఆరంభంలోనే రెండు వికెట్లు కోల్పోయినా ఏమాత్రం తగ్గకుండా ప్రేక్షకులకు పవర్‌ హిట్టింగ్‌ మజాను అందించారు. 

ఓపెనర్లు ఫిలిప్‌ సాల్ట్‌ (1), అలెక్స్‌ హేల్స్‌ (9) తక్కువ స్కోర్లకే ఔటైనా, ఆతర్వాత వచ్చిన బెన్‌ స్టోక్స్‌ (18 బంతుల్లో 36; 2 ఫోర్లు, 3 సిక్సర్లు),  లియామ్‌ లివింగ్‌స్టోన్‌ (16 బంతుల్లో 28; ఫోర్‌, 2 సిక్సర్లు), హ్యారీ బ్రూక్‌ (24 బంతుల్లో 45 నాటౌట్‌; 2 ఫోర్లు, 4 సిక్సర్లు), సామ్‌ కర్రన్‌ (14 బంతుల్లో 33 నాటౌట్‌; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) తమదైన స్టయిల్‌లో ఆకాశమే హద్దుగా రెచ్చిపోయారు. బౌండరీలు, సిక్సర్లతో పాక్‌ బౌలర్లపై విరుచుకుపడ్డారు. ఫలితంగా ఇంగ్లండ్‌ 14.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేరుకుని (163/4) 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 

వర్షం అంతరాయం కలిగించడంతో 19 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడిన పాక్‌ తొలుత బ్యాటింగ్‌ చేసింది. ఓపెనర్లు షాన్‌ మసూద్‌ (22 బంతుల్లో 39; 7 ఫోర్లు), హైదర్‌ అలీ (16 బంతుల్లో 18; 3 ఫోర్లు) పాక్‌కు ఓ మోస్తరు ఆరంభాన్ని అందించగా.. ఆ తర్వాత వచ్చిన బ్యాటర్లెవ్వరూ చెప్పుకోదగ్గ స్కోర్‌ చేయలేకపోయారు. 

తాత్కాలిక కెప్టెన్‌ షాదాబ్‌ ఖాన్‌ (12), ఇఫ్తికార్‌ అహ్మద్‌ (22),  ఖుష్దిల్‌ (0), ఆసిఫ్‌ అలీ (14), నవాజ్ (10) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు‌. ఆఖర్లో మహ్మద్‌ వసీమ్‌ జూనియర్‌ (16 బంతుల్లో 26; 3 ఫోర్లు, సిక్స్‌) వేగంగా పరుగులు సాధించడంతో పాక్‌ ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. ఇంగ్లండ్‌ బౌలర్లలో విల్లే 2 వికెట్లు పడగొట్టగా.. బెన్‌ స్టోక్స్‌,  సామ్‌ కర్రన్‌, క్రిస్‌ జోర్డాన్‌, లివింగ్‌స్టోన్‌ తలో వికెట్‌ సాధించారు. 
 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top