ప్రేక్షకులు లేకపోతేనేమి.. మేం వస్తాం

Swarm Of Bees halt Play During West Indies Sri Lanka Third One Day Match At Antigua - Sakshi

ఆంటిగ్వా: విండీస్‌, శ్రీలంక జట్ల మధ్య సోమవారం జరిగిన మూడో వన్డేలో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. మ్యాచ్‌ మధ్యలో హఠాత్తుగా తేనెటీగలు రంగప్రవేశం చేయడంతో గ్రౌండ్‌లో ఉన్న వారంతా నేలపై బోర్లా పడుకున్నారు. ఈ సంఘటన శ్రీలంక ఇన్నింగ్స్​38వ ఓవర్లో చోటు చేసుకుంది. విండీస్​ బౌలర్​ అండర్సన్​ ఫిలిప్ ​బౌలింగ్ చేస్తుండగా, ఒక్కసారిగా తేనెటీగల గుంపు మైదానాన్ని చుట్టుముట్టింది.

ఇది గమనించిన ఆటగాళ్లు, అంపైర్లు వాటి నుంచి రక్షణ కోసం ఫీల్డ్‌పై పడుకున్నారు. కాసేపటికి తేనెటీగల గుంపు ఎవరికీ ఎలాంటి హాని చేయకుండా వెళ్లిపోవడంతో గ్రౌండ్‌లో ఉన్నవారంతా ఊపిరి పీల్చుకున్నారు. అనుకోని ఈ పరిణామానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.

కాగా, మ్యాచ్‌ మధ్యలో తేనెటీగలు అంతరాయం కలిగించడం ఇదే తొలిసారేమీ కాదు. 2019 ప్రపంచకప్​సందర్భంగా దక్షిణాఫ్రికా, శ్రీలంక జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లోనూ ఇలాంటి సంఘటనే చోటు చేసుకుంది. ఇదిలా ఉండగా శ్రీలంక, విండీస్‌ జట్ల మధ్య తాజాగా జరిగిన ఈ వన్డే మ్యాచ్‌లో ఆతిథ్య విండీస్‌ జట్టు 5 వికెట్ల తేడాతో లంకను చిత్తు చేసింది. ఫలితంగా మూడు వన్డేల సిరీస్‌ను 3-0తో కైవసం చేసుకుంది.
 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top