
వన్డే క్రికెట్‌లో ఇంగ్లండ్ జట్టు గత కొంతకాలంగా గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటోంది. ముఖ్యంగా ఐసీసీ టోర్నమెంట్లలో ఘోర పరాభవాలు చవిచూసింది. భారత్ వేదికగా వన్డే వరల్డ్‌కప్-2023 (ICC ODI World Cup)లో డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన బట్లర్ బృందం... కనీసం సెమీస్ చేరకుండానే నిష్క్రమించింది.
చరిత్రలోనూ ఎన్నడూ లేని విధంగా అఫ్గనిస్తాన్ జట్టు చేతిలోనూ ఓటమిపాలై విమర్శలు మూటగట్టుకుంది. ఇక ఇటీవల ముగిసిన ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 (ICC Champions Trophy) టోర్నీలోనూ ఇదే ఫలితాన్ని పునరావృతం చేసింది. గ్రూప్-బి మ్యాచ్‌లలో భాగంగా ఆస్ట్రేలియా, అఫ్గనిస్తాన్ సౌతాఫ్రికా చేతిల్లో హ్యాట్రిక్ ఓటములు చవిచూసి.. టోర్నీ నుంచి నిష్క్రమించింది.
అంతకు ముందు టీమిండియాతో వన్డే సిరీస్‌లోనూ ఇంగ్లండ్ 3-0తో క్లీన్‌స్వీప్‌నకు గురైంది. ఈ పరిణామాల నేపథ్యంలో జోస్ బట్లర్ (Jos Buttler) ఇంగ్లండ్ టీ20, వన్డే జట్ల సారథ్య బాధ్యతల నుంచి తప్పుకొన్నాడు. చాంపియన్స్ ట్రోఫీలో జట్టు దారుణ వైఫల్యానికి బాధ్యత వహిస్తూ కెప్టెన్సీకి రాజీనామా చేశాడు.
బట్లర్ వారసుడిగా స్టోక్స్?
ఈ నేపథ్యంలో బట్లర్ స్థానంలో యువ బ్యాటర్, వైస్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ నియామకం దాదాపు ఖరారైందనే వార్తలు రాగా.. ఇంగ్లండ్ జట్టు మేనేజింగ్ డైరెక్టర్ రాబర్ట్ కీ మాత్రం భిన్నంగా స్పందించాడు. బట్లర్ వారసుడిగా బెన్ స్టోక్స్ పగ్గాలు చేపట్టే అవకాశం ఉందని తెలిపాడు. ఈ అంశంపై ఇంగ్లండ్ దిగ్గజ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ తాజాగా స్పందించాడు.
బెన్ స్టోక్స్‌ను గనుక వన్డే జట్టు కెప్టెన్‌ను చేస్తే అంతకంటే అనాలోచిత నిర్ణయం మరొకటి ఉండదని బ్రాడ్ అభిప్రాయపడ్డాడు. ఒకవేళ అదే జరిగితే ఈ విషయం గురించి మాట్లాడటం కూడా వృథా ప్రయాసేనని పేర్కొన్నాడు. ఇప్పటికే స్టోక్స్‌పై పనిభారం ఎక్కువై.. గాయాల బారిన పడుతున్నాడని.. అలాంటిది అదనపు బాధ్యతలు అప్పగిస్తే అతడి పరిస్థితి ఏమిటని ప్రశ్నించాడు.
అంతకంటే చెత్త నిర్ణయం మరొకటి ఉండదు
ఈ మేరకు... ‘‘స్టోక్స్‌ను కెప్టెన్‌గా నియమిస్తే అంతకంటే నిరాశ కలిగించే విషయం మరొకటి ఉండదు. ఇంగ్లండ్ బోర్డు గనుక ఈ పని చేస్తే.. అప్పుడు స్పందించడానికి నా దగ్గర మాటలు ఉండవు. ముందుగా షెడ్యూల్‌ను దృష్టిలో పెట్టుకోవాలి.
టెస్టు క్రికెట్‌కు ప్రాధాన్యం ఇచ్చే క్రమంలో అతడు ఐపీఎల్‌ను వదిలేశాడు. కీలక సిరీస్‌లలో సత్తా చాటాలనే ఉద్దేశంతో ఫిట్‌గా ఉండేందుకు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. గడిచిన మూడేళ్లలో స్టోక్స్ ఎన్ని ఓవర్లు బౌల్ చేశాడో గుర్తుందా?
మోకాలి గాయం వల్ల అతడు సతమతమైపోతున్నాడు. ఇలాంటి సమయంలో యాభై ఓవర్ల ఫార్మాట్లో ఎనిమిది నుంచి తొమ్మిది ఓవర్ల వేయాలంటూ అతడిపై అదనపు భారం మోపడం ఏమాత్రం సరికాదు. గణాంకాలతో పనిలేదు.
121 వన్డే ఇంటర్నేషనల్స్ ఆడిన క్రికెటర్‌గా చెబుతున్నా.. టెస్టు మ్యాచ్ ఆడటం కంటే యాభై ఓవర్ల ఫార్మాట్‌లో మ్యాచ్ ఆడటం వల్లే ఆటగాళ్లు ఎక్కువగా అలసిపోతారు’’ అని స్టువర్ట్ బ్రాడ్ పేర్కొన్నాడు. స్టోక్స్‌పై అదనపు భారం మోపితే.. పరిస్థితులు మరింత దిగజారిపోతాయంటూ ఇంగ్లండ్ బోర్డును ఈ సందర్భంగా హెచ్చరించాడు.
గాయాలతో సావాసం
కాగా 33 ఏళ్ల సీమ్ బౌలింగ్ ఆల్‌రౌండర్ స్టోక్స్ ప్రస్తుతం టెస్టు జట్టు కెప్టెన్‌గా ఉన్నాడు. ఇక జూలై 2022లో వన్డే క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన అతడు.. వన్డే వరల్డ్‌కప్-2023కి ముందు తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు. అయితే, ఈ మెగా టోర్నీ తర్వాత మళ్లీ స్టోక్స్ ఇంగ్లండ్ తరఫున వైట్‌బాల్ క్రికెట్ ఆడనేలేదు.
గత రెండేళ్లుగా అతడు మోకాలి నొప్పితో ఇబ్బందులు పడుతున్నాడు. 2024 ది హండ్రెడ్ లీగ్ సమయంలో మరోసారి గాయపడ్డ స్టోక్స్.. శ్రీలంకతో టెస్టు సిరీస్‌కు దూరమయ్యాడు. అనంతరం న్యూజిలాండ్‌తో సిరీస్‌కూ గైర్హాజరైన స్టోక్స్.. సర్జరీ చేయించుకున్నాడు. ఈ నేపథ్యంలో స్టోక్స్‌ను పరిమిత ఓవర్ల క్రికెట్ కెప్టెన్‌గా తీసుకువస్తే అతడి కెరీర్‌కే ప్రమాదమని స్టువర్ట్ బ్రాడ్ అభిప్రాయపడ్డాడు.
చదవండి: CT 2025: కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్‌లకు దక్కని చోటు.. కెప్టెన్‌గా అతడు!
Comments
Please login to add a commentAdd a comment