
బాక్సింగ్‌స్టార్‌గా ఎదిగిన నగర బాలిక
17ఏళ్లకే అద్భుతమైన విజయాలు
సాక్షి, హైదరాబాద్: కిక్ బాక్సింగ్ క్రీడలో జాతీయ అంతర్జాతీయ వేదికలపై మెరిసింది. తెలంగాణ కిక్ బాక్సింగ్ పుస్తకంలో తన కంటూ ఒక పేజీ లిఖించింది నైషా బజాజ్. ‘ఫిట్‌నెస్ రంగంలో ఉన్న మా అమ్మకి మార్షల్ ఆర్ట్స్ హాబీ. ఆమెతో ఏడేళ్ల వయసులో సరదాగా కలిసి ప్రాక్టీస్ చేశా. అదే ఇప్పుడు నా లైఫ్‌గా మారింది’ అంటూ చెప్పింది పంజాగుట్టలో నివసించే టీనేజర్ నైషా.
విజయాలెన్నో..
నగరం నుంచి వేళ్ల మీద లెక్కబెట్టగలిగే సంఖ్యలో కూడా కనబడని మహిళల కిక్‌బాక్సింగ్‌లో 2014లో నైషా పూర్తి స్థాయిలో ప్రవేశించిందని చెప్పొచ్చు. అప్పటి నుంచి రాష్ట్రంలోని అగ్రశ్రేణి మహిళా యోధుల్లో ఒకరిగా రాణిస్తోంది. ఆమె సాధించిన విజయాల్లో ఇండియన్ ఇంటర్నేషనల్ కిక్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్స్ (2022, 2024, 2025), నేషనల్ కిక్‌బాక్సింగ్ ఛాంపియన్‌షిప్ (2024, గోవా), ఖేలో ఇండియా ఉమెన్స్ కిక్‌బాక్సింగ్ లీగ్ (2024, హైదరాబాద్) తెలంగాణ స్టేట్ ఛాంపియన్‌షిప్‌లలో బంగారు పతకాలు.. సాధించింది. గత అక్టోబర్‌లో ఫ్రాక్చర్‌కు శస్త్రచికిత్స చేయించుకుని వెనువెంటనే 2025 ప్రారంభంలోనే తిరిగి బంగారు పతకాలను సాధించడం ఆమె పోరాట పటిమకు నిదర్శనం.
కఠినమే కానీ..
అమ్మాయిలు క్రీడల్లో రాణించడం ఇప్పుడు సాధారణమే కావచ్చు కానీ.. కిక్ బాక్సింగ్ క్రీడలో మాత్రం ఇప్పటికీ విశేషమే. ‘చిన్న వయసులోనే నాలో ఉన్న ఆసక్తిని అమ్మ గమనించి మార్షల్ ఆర్ట్స్ వైపు ప్రోత్సహించింది’ అంటూ గుర్తు చేసుకుంది నైషా. తొలుత తైక్వాండోతో తన మార్షల్ ఆర్ట్స్ ప్రయాణాన్ని ప్రారంభించానని, ఆ తర్వాత కిక్ బాక్సింగ్‌లోకి మారానని వివరించింది. ఇది కఠినమైన క్రీడే అయినప్పటికీ.. ఇలాంటి యుద్ధకళల్లో మహిళలు రాణించాల్సిన సమయం వచి్చందంటోంది నైషా. బయటకు వెళ్లి ఎన్నో రంగాల్లో తమని తాము నిరూపించుకోవాలని తపిస్తున్న మహిళలు.. మార్షల్ ఆర్ట్స్ ద్వారా తమని తాము రక్షించుకోగలుగుతారని అంటోంది.