మా జట్టు ప్రదర్శన నన్ను నిరాశపరిచింది : ప్లెమింగ్‌

Stephen Fleming Disappointed After CSK Loss Match To KKR - Sakshi

అబుదాబి : ఐపీఎల్‌ 13వ సీజన్‌లో బుధవారం కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో సీఎస్‌కే ప్రదర్శన తనను చాలా నిరాశపరిచిందని ఆ జట్టు ప్రధాన కోచ్ స్టీఫెన్‌ ప్లెమింగ్‌ పేర్కొన్నాడు. మ్యాచ్‌ అనంతరం ప్లెమింగ్‌ సీఎస్‌కే బ్యాటింగ్‌ తీరుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. (చదవండి : శాంసన్‌ రాత మారేనా? మళ్లీ అదే డ్రామానా?)

'కేకేఆర్‌తో మ్యాచ్‌లో కేవలం 10 పరుగుల తేడాతో ఓడిపోవడం బాధగా అనిపించింది. వాట్సన్‌ మంచి ఆరంభాన్ని ఇచ్చినా దాన్ని నిలబెట్టుకోలేకపోయాం. మ్యాచ్‌లో మా ఇన్నింగ్‌ మొదలైన తర్వాత వాట్సన్‌, డుప్లెసిస్‌ ఇచ్చిన ఆరంభానికి తోడు.. రాయుడు మంచి టచ్‌లో కనిపించడంతో లక్ష్యాన్ని సులభంగా చేదిస్తుందనే అనుకున్నా. కానీ ఒక ఐదారు ఓవర్లు పాటు నిలకడగా ఆడి ఉంటే కచ్చితంగా గెలిచేవాళ్లం. ధోని నాలుగో స్థానంలో రావడంపై తప్పుబట్టలేం. ఎందుకంటే వాట్సన్‌ క్రీజులో ఉండడంతో ధోని అతనికి సహకారమందించాలని ప్రయత్నించాడు. కానీ దురదృష్టం మమ్మల్ని వెంటాడింది. వాట్సన్‌ అవుటైన తర్వాత వచ్చిన మిగతా బ్యాట్స్‌మెన్లు షాట్ల ఎంపిక పొరపాటుతో పాటు కేకేఆర్‌ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేశారు. మా జట్టులో బ్యాట్స్‌మెన్లకు కొదువ లేదు.అందరు విమర్శించినట్టు మాకు అదనపు బ్యాట్స్‌మన్‌ అవసరం లేదు.  8 వ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చే బ్రావో వరకు పటిష్టంగానే ఉంది. కాకపోతే వచ్చే మ్యాచ్‌లో బ్యాటింగ్‌ ఆర్డర్‌ మార్చాల్సిన అవసరం ఉంది. సామ్‌ కరన్‌, రవీంద్ర జడేజా, డ్వేన్‌ బ్రావో లాంటి ఆల్‌రౌంర్లు ఉండి కూడా కీలక దశలో చేతులెత్తేసాం.'అంటూ చెప్పుకొచ్చాడు. (చదవండి : చేదనలో తడబడ్డ చెన్నై; కేకేఆర్‌ విజయం)

కేకేఆర్‌తో మ్యాచ్‌లో 13వ ఓవర్‌ వరకు కేవలం రెండు వికెట్లు కోల్పోయి పటిష్టంగా కనిపించిన చెన్నై .. వాట్సన్‌ 50 పరుగులు పూర్తి చేసిన వెంటనే అవుటవ్వడంతో మ్యాచ్‌ పూర్తిగా మారిపోయింది. 10వ ఓవర్‌ నుంచి 15వ ఓవర్‌ వరకు సీఎస్‌కే జట్టు కేవలం 20 పరుగులు మాత్రమే చేయడం ఆ జట్టు ఓటమికి ప్రధాన కారణంగా చెప్పవచ్చు. కాగా చెన్నె సూపర్‌ కింగ్స్‌ తన తర్వాతి మ్యాచ్‌ శనివారం(అక్టోబర్‌ 10న) ఆర్‌సీబీతో తలపడనుంది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top