చేదనలో తడబడ్డ చెన్నై; కేకేఆర్‌ విజయం

KKR Won The Match By 10 Runs Against CSK - Sakshi

అబుదాబి : ఐపీఎల్‌ 13వ సీజన్‌లో భాగంగా చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్‌ 10 పరుగుల తేడాతో విక్టరీ నమోదు చేసింది.  చెన్నై ఓపెనర్‌ షేన్‌ వాట్సన్‌ (40 బంతుల్లో 51; 6 ఫోర్లు, 1 సిక్స్‌) మినహా మిగతావారు విఫలం కావడంతో సీఎస్‌కే నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 157 పరుగులు మాత్రమే చేయగలిగింది. 168 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నైకి ఓపెనర్లు వాట్సన్‌, డుప్లెసిస్‌ మంచి ఆరంభాన్ని ఇచ్చారు. ఈ దశలో జట్టు స్కోరు 30 పరుగుల వద్దకు చేరుకోగానే డుప్లెసిస్‌ శివమ్‌ మావి బౌలింగ్‌లో కీపర్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. అనంతరం క్రీజులోకి వచ్చని అంబటి రాయుడు మంచి టచ్‌లో కనిపించాడు. 27 బంతుల్లో 30 పరుగులు చేసిన రాయుడు నాగర్‌కోటి బౌలింగ్‌లో వెనుదిరగడంతో 99 పరుగుల వద్ద చెన్నై రెండో వికెట్‌ కోల్పోయింది. కాగా  ఈ మ్యాచ్‌లో నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన ధోని ఏమాత్రం ఆకట్టుకోలేకపోయాడు. (చదవండి : కేకేఆర్‌ ఆలౌట్‌.. సీఎస్‌కే టార్గెట్‌ ఎంతంటే)

అయితే వాట్సన్‌ 40 బంతుల్లో అర్థ సెంచరీ పూర్తి చేసుకున్న వెంటనే నరైన్‌ బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు. దీంతో 101 పరగులకే మూడు వికెట్లు కోల్పోయింది. ఈ దశలో సామ్‌ కరాన్‌తో కలిసి ధోని ఇన్నింగ్స్‌ నిర్మించే ప్రయత్నంలో 16వ ఓవర్లో వరుణ్‌ చక్రవర్తి బౌలింగ్‌లో ధోని క్లీన్‌బౌల్డ్‌గా వెనుదిరిగాడు. ఆ తర్వాతి ఓవర్లోనే కరాన్‌ కూడా వెనుదిరగడంతో సీఎస్‌కే ఒత్తిడికి లోనైంది. ఇదే సమయంలో కేకేఆర్‌ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో క్రీజులో ఉన్న కేదార్‌ జాదవ్‌, రవీంద్ర జడేజాలు చెన్నైను గెలిపించలేకపోయారు. దీంతో చెన్నై విజయానికి 10 పరుగుల దూరంలో నిలిచిపోయింది. కేకేఆర్‌ బౌలర్లలో  శివమ్‌ మావి, వరుణ్‌ చక్రవర్తి, సునీల్‌ నరైన్‌, ఆండ్రీ రసెల్‌ తలా ఒక వికెట్‌ తీశారు.

అంతకముందు టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఏంచుకున్న కోల్‌కతా నైట్‌రైడర్స్‌ సునీల్‌ నరైన్‌ స్థానంలో రాహుల్‌ త్రిపాఠిని ఓపెనర్‌గా పంపించింది. ఈ సందర్భంగా త్రిపాఠి ఓపెనర్‌గా మంచి షాట్స్‌ ఆడుతూ తన విలువేంటో చూపించాడు. సహచరులంతా తక్కువ స్కోరుకే వెనుదిరిగినా తాను మాత్రం ఇన్నింగ్స్‌ ఆసాంతం మెరుపులు మెరిపించాడు. త్రిపాఠి 51 బంతుల్లో 81 పరుగులు సాధించగా.. ఇందులో 8ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి. మిగిలిన వారిలో ఎవరు చెప్పుకోదగ్గ ప్రదర్శన నమోదు చేయలేదు.  కాగా స్కోరు 37 పరుగులకు చేరగానే కేకేఆర్‌ తొలి వికెట్‌ కోల్పోయింది. శార్దూల్‌ ఠాకూర్‌ వేసిన నాలుగో ఓవర్‌ రెండో బంతికి శుబ్‌మన్‌ గిల్‌ క్యాచ్‌ అవుట్‌గా వెనుదిరిగాడు. ఈ దశలో క్రీజులోకి వచ్చిన నితీష్‌ రాణా సహకారంతో త్రిపాఠి మాత్రం బౌండరీలతో విరుచుకుపడ్డాడు. దీంతో కేకేఆర్‌ స్కోరుబోర్డు ఉరకలెత్తింది. ఈ దశలో 8వ ఓవర్లో బౌలింగ్‌కు వచ్చిన కరణ్‌ శర్మ తను వేసిన మొదటిబంతికే వికెట్‌ తీసుకున్నాడు. భారీ షాట్‌కు యత్నించిన నితీష్‌ రాణా రవీంద్ర జడేజాకు క్యాచ్‌ ఇచ్చి అవుట్‌గా వెనుదిరిగాడు.

కాగా కేకేఆర్‌ తొలి 10 ఓవర్లు ముగిసేసరికి రెండు వికెట్ల నష్టానికి 80 పరుగులు చేసింది. నాలుగో స్థానంలో వచ్చిన సునీల్ నరైన్‌ 17 పరుగులు చేసి ఔట్‌ అయ్యాడు. కాగా నరైన్‌ అవుటైన తర్వాత బ్యాటింగ్‌ ఆర్డర్‌లో ముందుగా వచ్చిన ఇయాన్‌ మోర్గాన్‌ పూర్తిగా నిరాశపరిచాడు.  కాగా రాహుల్‌ త్రిపాఠి 81 పరుగుల వద్ద బ్రేవో బౌలింగ్‌లో వెనుదిరిగాడు. తర్వాత వచ్చిన రసెల్‌, కమిన్స్‌, కార్తీక్‌ ఏ దశలోనూ ఆకట్టుకోలేకపోయారు. దీంతో నిర్ణీత ఓవర్లలో 20 ఓవర్లలో కేకేఆర్‌ 167 పరుగులకు ఆలౌట్‌ అయింది. కాగా చెన్నై బౌలర్లలో బ్రేవో 3, శార్దూల్‌ ఠాకూర్‌, కరణ్‌ శర్మ,శామ్‌ కర్జన్‌ తలా రెండు వికెట్లు తీశారు. ఈ విజయంతో కేకేఆర్‌ పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి ఎగబాకగా.. చెన్నై ఐదో స్థానానికి పడిపోయింది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top