
మైదానంలో అలరించిన భారత క్రీడాకారులు పతకాలు, ట్రోఫీలతో పాటు అభిమానుల మనసుల్ని గెలుస్తారు. అలాగే తమ మనసు గెలిచిన వారితో మనసారా ఒక్కటవుతారు. టోరీ్నల్లో లాగానే మొదట పరిచయంతో ప్రేమపెళ్లికి ‘క్వాలిఫై’ అవుతారు. తర్వాత ‘మెయిన్ రౌండ్’లో ప్రేమించుకుంటారు. ‘ఫైనల్’కు వచ్చేసరికి పెళ్లి చేసుకుంటారు. అయితే ఇక్కడితోనే ‘పెళ్లి’ టైటిల్‌కు శుభం కార్డు పడుతుందనుకుంటే తప్పులో కాలేసినట్లే! కొన్నాళ్లకు, కొన్నేళ్లకు కొన్ని క్రీడా జంటలకు ‘విడాకులు’తో అశుభం కార్డు పడుతోంది. అలా ఈ కోవలో ఒక్క‘టై’.. ‘బ్రేక్’ చేసుకున్న జంటల కథలు...
క్రీడాకారుల విజయాలు వార్తలవడం సహజం. విజయవంతమైన క్రేజీ స్టార్ల ప్రేమలు కూడా హాట్ న్యూస్‌లే! తర్వాత ఫారిన్ ట్రిప్పులు, చెట్టాపట్టాల్ అన్నీ కూడా మీడియా కంటపడకుండా ఉండవు. చివరకు పెళ్లి ముచ్చట ఇవన్నీ బాగానే ఉన్నా... కొందరి ‘ప్రేమ–పెళ్లి–విడాకుల’ తంతు పరిపాటిగా మారడమే క్రీడాకారుల దాంపత్య బంధాన్ని పలుచన చేస్తున్నాయి. తాజాగా వెటరన్ బ్యాడ్మింటన్ స్టార్‌ల జోడీ సైనా నెహా్వల్, పారుపల్లి కశ్యప్ తాము విడిపోతున్నట్లు ప్రకటించింది. గతంలో పాపులర్ షట్లర్‌లు గుత్తా జ్వాల, చేతన్ ఆనంద్‌లు బ్యాడ్మింటన్ కోర్టులో జోడీ కట్టి... తర్వాత పెళ్లి పీటలెక్కారు. కొన్నాళ్లకే కోర్టుకెక్కి విడాకులు తీసుకున్నారు. అయితే ఇటీవల ‘టై బ్రేక్’ జోడీల సంఖ్య ఎక్కువవుతోంది. వారి వివరాలివే...
హార్దిక్ పాండ్యానటాషా
భారత ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా సెర్బియన్ మోడల్ నటాషా స్టాంకోవిచ్ మనసుపడి మనువాడాడు. 2020లో కోవిడ్ సమయంలో ప్రపంచం మొత్తం లాక్‌డౌన్ అయిన సమయంలో తొలుత పెళ్లి చేసుకున్నారు. మళ్లీ 2023లో హిందూ, సెర్బియా మతాచారాల ప్రకారం మళ్లీ పెళ్లాడారు. కానీ ఇంతలా ఇష్టపడ్డ సెర్బియన్ నెచ్చెలితో పెళ్లి ముచ్చట కొన్నాళ్లకే ముగిసింది. 2024లో ఇద్దరు విడాకుల ప్రకటన చేశారు.
ధావన్ అయేషా
భారత క్రికెటర్ శిఖర్ ధావన్ సరిహద్దులు దాటిన ప్రేమ తదుపరి పెళ్లినాటి ప్రమాణాలు కూడా కొన్నేళ్ల తర్వాత గుదిబండగా మారడంతో చివరికి చెరోదారి చూసుకోవాల్సి వచి్చంది. మెల్‌బోర్న్‌లో స్థిరపడ్డ భారత సంతతికి చెందిన అయేషా ముఖర్జీతో మొదలైన పరిచయం కొన్నాళ్లకే ప్రణయానికి దారితీసింది. ధావన్ కంటే అయేషా ఏకంగా 12 ఏళ్లు పెద్ద వయసు్కరాలు. అయితే ఈ వయస్సు ప్రేమకి, పెళ్లికి అడ్డంకి కాలేదు. 2012లో వివాహబంధంలోకి అడుగుపెట్టిన ఈ జంట పెళ్లి తర్వాత మనస్పర్థలతో 2023లో విడిపోయింది.
చహల్ ధనశ్రీ
భారత క్రికెట్‌లో మణికట్టు స్పిన్నర్‌గా బక్కపలుచని యోధుడు యజువేంద్ర చహల్ కొన్నాళ్లు వెలుగు వెలిగాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో ఐపీఎల్‌లో తమ జట్లకు చిరస్మరణీయ విజయాలు అందించిన చహల్... సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ ధనశ్రీ వర్మతో ప్రేమలో పడ్డాడు. వీరిజంట నెట్టింట ‘మూడు రీల్స్... ఆరు జిగేల్స్’గా తెగ హల్‌చల్ చేసింది కొన్నాళ్లు! కానీ చిత్రంగా పెళ్లి మూణ్నాళ్ల ముచ్చటగానే చెదిరిపోయింది. ప్రేమ బాసలు, పెనవేసుకున్న ఊసులతో 2020లో మ్యారేజ్ చేసుకున్న చహల్–ధనశ్రీ వర్మ రెండేళ్లకే విడిపోయారు. 2022లో డివోర్స్ కార్డ్ వేశారు.
షమీ హసీన్ జహన్
భారత సీనియర్ సీమర్ మొహమ్మద్ షమీ ప్రేమ పెళ్లి ముచ్చట వివాదాలు, ఆరోపణలతో నాలుగేళ్లకే క్లీన్»ౌల్డయ్యింది. తనకు పరిచయమైన హసీన్ జహన్‌తో కొంతకాలం ప్రేమాయణం జరిపిన తర్వాత 2014లో ఇద్దరు పెళ్లితో ఒక్కటయ్యారు. అయితే హసీన్ రచ్చకెక్కి మరీ గృహహింస కేసులు పెట్టి చివరకు 2018లో విడిపోయారు.
సైనా కశ్యప్
సింధు మేనియా ముందువరకు సైనానే సూపర్‌స్టార్‌గా వెలుగొందింది. కామన్వెల్త్ క్రీడల్లో రెండుసార్లు చాంపియన్‌గా నిలిచింది. ఎన్నో సూపర్ సిరీస్ టైటిళ్లు గెలిచింది. ఒకప్పుడు క్రీడా వార్తల్లో టెన్నిస్‌లో సానియా మీర్జా, బ్యాడ్మింటన్‌లో సైనాల విజయాలే పతాక శీర్షికలయ్యేవి. 2012–లండన్ ఒలింపిక్స్‌లో సైనా కాంస్య పతకం గెలుచుకుంది అంతగా పాపులారిటీ సంపాదించుకున్న ఆమె... గోపీచంద్ అకాడమీలో శిక్షణ సందర్భంగా పారుపల్లి కశ్యప్‌ను ప్రేమించింది. వీరి ప్రేమాయణం 2018లో మూడుముళ్ల బంధంగా మారింది. ఏడడుగులు నడిచిన ఈ జంట ఏడేళ్లు పూర్తయ్యేసరికి తమ బంధానికి బైబై చెప్పింది.