రెజ్లింగ్ ఫెడరేషన్ బాధ్యతలు ఐఓఏకు అప్పగింత.. | Sports Ministry Requests IOA To Constitute Ad-Hoc Committee To Manage WFI Affairs, See Details Inside - Sakshi
Sakshi News home page

Wrestling Federation Of India: రెజ్లింగ్ ఫెడరేషన్ బాధ్యతలు ఐఓఏకు అప్పగింత..

Published Sun, Dec 24 2023 6:09 PM

Sports Ministry requests IOA to constitute ad hoc committee to manage WFI affairs - Sakshi

నూతనంగా ఎన్నికైన  రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా పాలక వర్గాన్ని భారత క్రీడా మంత్రిత్వ శాఖ రద్దు చేసిన సంగతి తెలిసిందే. కొత్త అధ్యక్షుడు సంజయ్‌ సింగ్‌  డబ్ల్యూఎఫ్‌ఐ నిబంధనలకు విరుద్ధంగా చేసిన ప్రకటనల వల్ల కేంద్ర క్రీడా శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. 

ఈ నేపథ్యంలో రెజ్లింగ్ ఫెడరేషన్‌ను చక్కదిద్దే బాధ్యతను ఇండియన్ ఒలంపిక్ అసోసియేషన్(ఐఓఏ)కు కేంద్రం అప్పగించింది. రెజ్లింగ్ ఫెడరేషన్ నిర్వహణకు తాత్కాలిక కమిటీ ఏర్పాటు చేయాలని ఐఓఏకు క్రీడా శాఖ లేఖ రాసింది. రెజ్లర్ల సెలక్షన్ , ఫెడరేషన్ నిర్వహణ బాధ్యతలను చూడాలని ఐఓఏను కేంద్ర ప్రభుత్వం కోరింది.

ఏంజరిగిందంటే?
అధ్యక్షునిగా ఎన్నికైన అనంతరం సంజయ్‌ సింగ్‌.. అండర్‌-16, అండర్‌-20 రెజ్లింగ్‌ జాతీయ పోటీలు ఈ నెలాఖరులోపు  ఉత్తరప్రదేశ్‌లోని గోండాలో గల నందినగర్‌లో జరుగుతాయని ప్రకటించాడు. పోటీల్లో పాల్గొనేందుకు రెజ్లర్లకు సమయం ఇవ్వకుండా ప్రకటించడంపై క్రీడాకారుల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. అంతేకాకుండా యునైటెడ్‌ వరల్డ్‌ రెజ్లింగ్ ఎగ్జిక్యూటివ్‌ కమిటీ ఎంపిక చేసిన ప్రదేశాల్లోనే సబ్‌ జూనియర్‌, జూనియర్‌, సీనియర్‌ రెజ్లింగ్ పోటీలను నిర్వహించాల్సి ఉంటుంది.

దీంతో నిబంధనలకు విరుద్దంగా ప్రకటన చేయడాన్ని సీరియస్‌గా తీసుకున్న కేంద్రం.. ప్యానెల్‌ మొత్తంపై వేటు వేసింది.  అదే విధంగా బ్రిజ్‌ భూషణ్‌ సన్నిహితుడైన సంజయ్‌ సింగ్‌ డబ్ల్యూఎఫ్‌ఐ ప్రెసిడింట్‌గా ఎంపిక కావడంపై రెజ్లర్ల నుంచి నిరసనలు వ్యక్తమయ్యాయి.  మహిళా రెజ్లర్‌ సాక్షి మాలిక్ ఆట నుంచి తప్పుకోగా..  బజరంగ్‌ పునియా తన పద్మ శ్రీ అవార్డును వెనక్కి ఇచ్చేశాడు. ఈ నేపథ్యంలో  క్రీడా శాఖ నిర్ణయం ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా మారింది.
చదవండి: Govt Suspends WFI: క్రీడా శాఖ సంచలన నిర్ణయం.. కొత్తగా ఎన్నికైన డబ్ల్యూఎఫ్‌ఐ ప్యానెల్‌పై వేటు

Advertisement
Advertisement