క్రీడా శాఖ సంచలన నిర్ణయం.. కొత్తగా ఎన్నికైన డబ్ల్యూఎఫ్‌ఐ ప్యానెల్‌పై వేటు | Sports Ministry Suspends Newly Elected Wrestling Federation Of India Led By Sanjay, See Details Inside - Sakshi
Sakshi News home page

Govt Suspends WFI: క్రీడా శాఖ సంచలన నిర్ణయం.. కొత్తగా ఎన్నికైన డబ్ల్యూఎఫ్‌ఐ ప్యానెల్‌పై వేటు

Published Sun, Dec 24 2023 11:43 AM | Last Updated on Sun, Dec 24 2023 1:53 PM

Sports Ministry Suspends Newly Elected Wrestling Federation of India Led By Sanjay - Sakshi

భారత క్రీడా మంత్రిత్వ శాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. కొత్తగా ఎన్నికైన భారత రెజ్లింగ్‌ సమాఖ్య పాలక వర్గాన్ని సస్పెండ్‌ చేసింది. డబ్ల్యూఎఫ్‌ఐ నూతన అధ్యక్షుడు సంజయ్‌ కుమార్‌ సింగ్‌ నిబంధనలకు విరుద్ధంగా చేసిన ప్రకటన వల్ల ఈ మేరకు వేటు వేసినట్లు తెలుస్తోంది.

కాగా ఇటీవలే భారత రెజ్లింగ్‌ సమాఖ్య ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఇందులో మాజీ అధ్యక్షుడు, లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొన్న బ్రిజ్‌భూషణ్‌ తన పట్టు నిరూపించుకున్నాడు.

బరిలో లేకపోయినా పట్టు నిరూపించుకున్న బ్రిజ్‌ భూషణ్‌
నేరుగా బరిలో నిలకపోయినా... 15 పదవుల్లో తన వర్గానికి   చెందిన 13 మందిని గెలిపించుకున్నాడు. ఈ క్రమంలో బ్రిజ్‌ భూషణ్‌ ప్రధాన అనుచరుడిగా పేరొందిన, ఉత్తరప్రదేశ్‌ రెజ్లింగ్‌ సంఘం ఉపాధ్యక్షుడైన సంజయ్‌ సింగ్‌ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు.

2010 కామన్వెల్త్‌ క్రీడల స్వర్ణ పతక విజేత అనిత షెరాన్‌పై 40–7 ఓట్ల తేడాతో గెలిచి నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాడు. అయితే, డబ్ల్యూఎఫ్‌ఐలో బ్రిజ్‌ భూషణ్‌ వర్గం ఎన్నికకావడాన్ని నిరసిస్తూ మహిళా రెజ్లర్‌ సాక్షి మాలిక్‌ ఆటకు స్వస్తి చెప్పగా.. బజరంగ్‌ పునియా తన పద్మ శ్రీ అవార్డును వెనక్కి ఇచ్చేశాడు.

రెజ్లర్ల నుంచి తీవ్ర నిరసన
మరోవైపు.. సాక్షికి మద్దతుగా బధిర రెజ్లర్‌ వీరేందర్‌ సింగ్‌ సైతం పద్మ శ్రీ పురస్కారాన్ని వెనక్కి ఇస్తానని తెలిపాడు. ఈ నేపథ్యంలో ఇప్పటికే భారత రెజ్లింగ్‌ సమాఖ్య ఎన్నికలపై చర్చ నడుస్తుండగా.. తాజాగా క్రీడా శాఖ నిర్ణయం హాట్‌ టాపిక్‌గా మారింది.

కాగా డబ్ల్యూఎఫ్‌ఐ నూతన అధ్యక్షుడు సంజయ్‌ సింగ్‌ మాట్లాడుతూ.. అండర్‌-16, అండర్‌-20 రెజ్లింగ్‌ జాతీయ పోటీలు ఉత్తరప్రదేశ్‌లోని గోండాలో గల నందినగర్‌లో జరుగుతాయని ప్రకటించాడు.

అయితే, ఈ క్రీడల్లో పాల్గొనే రెజ్లర్లకు ముందుగా సమాచారం ఇవ్వకుండానే ఇలాంటి ప్రకటన చేయడం డబ్ల్యూఎఫ్‌ఐ రాజ్యాంగానికి విరుద్ధం. ఈ నేపథ్యంలో నిబంధనలు ఉల్లంఘించిన కారణంగా కొత్తగా ఎన్నికైన డబ్ల్యూఎఫ్‌ఐపై నిషేధం విధిస్తూ క్రీడా శాఖా నిర్ణయం తీసుకుంది.

అందుకే వేటు
‘‘డబ్ల్యూఎఫ్‌ఐ రాజ్యాంగంలోని క్లాజ్‌ 3(e) ప్రకారం.. సీనియర్‌, జూనియర్‌, సబ్‌ జూనియర్‌ నేషనల్‌ చాంపియన్‌షిప్స్‌ ఎక్కడ నిర్వహించాలన్న అంశాన్ని ఎగ్జిక్యూటివ్‌ కమిటీ నిర్ణయిస్తుంది. 

అంతకంటే ముందు సమావేశంలోని ఎజెండాలను పరిశీలిస్తుంది. డబ్ల్యూఎఫ్‌ఐ రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 11 ప్రకారం.. మీటింగ్‌కు సంబంధించి కోరం కోసం ముందుగా నోటీసులు ఇవ్వాలి. ఇందుకు కనీసం 15 రోజుల నోటీస్‌ పీరియడ్‌ ఉంటుంది. మొత్తం ప్రతినిధుల్లో మూడొంతుల ఒకటి మేర కోరం ఉండాలి.

అత్యవసరంగా సమావేశం నిర్వహించాలనుకుంటే కనీసం ఏడు రోజుల ముందు నోటీస్‌ ఇవ్వాలి’’ . అయితే, ఈ నిబంధనలను సంజయ్‌ సింగ్‌ అతిక్రమించిన కారణంగా క్రీడా మంత్రిత్వ శాఖ సస్పెన్షన్‌ వేటు వేసినట్లు తెలుస్తోంది.

చదవండి: Virat Kohli: అక్కడున్నది కోహ్లి.. రాత్రికిరాత్రే వెళ్లలేదు.. పక్కా ప్లాన్‌తోనే!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement