T20 World Cup 2022: ట్రోల్‌ చేయడం కరెక్ట్‌ కాదు.. ఒకవేళ పుంజుకుంటే!

Sports Critics Target Cricket Fans Trolling Sri Lanka Lost Match Namibia - Sakshi

టి20 ప్రపంచకప్‌ 2022 ఆరంభమైన తొలిరోజునే సంచలనం నమోదైంది. శ్రీలంక క్వాలిఫయింగ్‌ మ్యాచ్‌లు ఆడుతున్నప్పటికి ఫేవరెట్‌గానే బరిలోకి దిగింది. అలాంటి లంక జట్టుకు పసికూన నమీబియా షాక్‌ ఇచ్చింది. ఫేలవ బ్యాటింగ్‌తో నిరాశపరిచిన లంక 55 పరుగుల తేడాతో నమీబియా చేతిలో ఓడింది. దీంతో లంక జట్టును టార్గెట్‌ చేస్తూ సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్‌ చేశారు. కొద్దిరోజుల క్రితం ఆసియా ఛాంపియన్లుగా అవతరించిన శ్రీలంక.. నెల రోజులు కూడా తిరగకముందే చెత్త ఆట తీరుతో మళ్లీ మొదటికే వచ్చిందంటూ కామెంట్స్‌ చేశారు.

ఆసియా కప్ లో లంకేయులు చేసిన 'నాగిని'డాన్సులకు సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ దారుణంగా ట్రోల్ చేశారు. 'ఇప్పుడు చేయండ్రా అబ్బాయిలు నాగిని డాన్సులు' అంటూ వాటికి కామెంట్స్ పెట్టారు.  మరికొందరు  లంక హెడ్ కోచ్ క్రిస్ సిల్వర్ వుడ్ ఫుల్ ఫ్రస్ట్రేషన్ లో ఉన్న ఫోటోను పెట్టి.. 'ఇవాళ  రాత్రి మీ అందరికీ బెల్ట్ ట్రీట్మెంట్ ఉంటది మీరు రండ్రా..'అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్టు మీమ్స్ చేశారు. 'ఆసియా  చాంపియన్లు ఇప్పటికే ఒక మ్యాచ్ ఓడారు. ఆ జట్టు తర్వాత నెదర్లాండ్స్, యూఏఈతో మ్యాచ్ లు ఆడాలి. ఆ రెండింటిలో ఏ ఒక్కటి ఓడినా  ఇక అంతే సంగతులు' అని కామెంట్స్ చేస్తున్నారు. 

అయితే క్రికెట్‌ ఫ్యాన్స్‌ లంక జట్టును ట్రోల్‌ చేయడంపై క్రీడా పండితులు తప్పుబట్టారు. ''ఒక్క మ్యాచ్‌ ఓడినంత మాత్రానా ట్రోల్‌ చేయడం కరెక్ట్‌ కాదు. మ్యాచ్‌ ఓటమి పాలైనప్పటికి తర్వాతి మ్యాచ్‌ల్లో ఫుంజుకుంటే మీరు చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటారా.. ఎప్పుడు ఒక జట్టును తక్కువ అంచనా వేయకూడదు.. రెండు మ్యాచ్‌ల్లో వరుసగా ఓడిపోతే అప్పుడు ట్రోల్‌ చేసినా ఒక అర్థముంటుంది. అంతేకానీ కేవలం ఒక్క మ్యాచ్‌ ఓడిపోయినందుకు ఇలా అవమానించడం తగదు'' అంటూ పేర్కొన్నారు.

నమీబియా చేతిలో లంక ఓడిపోయాక  సచిన్ టెండూల్కర్  ట్వీట్ చేస్తూ.. ''ఈరోజు క్రికెట్ ప్రపంచానికి నమీబియా  తన పేరును ఘనంగా చాటింది'' అని ట్వీట్ చేశాడు.  ఇదిలాఉండగా అనామక జట్టుగా బరిలోకి దిగి అగ్రశ్రేణి జట్టుగా ఉన్న టీమ్ ను ఓడించిన సందర్భాలలో నమీబియా కూడా చేరింది. ఇదివరకు ఈ జాబితాలో జింబాబ్వే (2007 టీ20 ప్రపంచకప్ లో ఆస్ట్రేలియాను ఓడించింది), నెదర్లాండ్స్ (2009 టీ20 వరల్డ్ కప్ లో ఇంగ్లాండ్  పై గెలిచింది), హాంకాంగ్ (2014 టీ20  ప్రపంచకప్ లో  బంగ్లాదేశ్ పై),  అఫ్గానిస్తాన్ (2016 టీ20 ప్రపంచకప్ లో వెస్టిండీస్ పై)  ఉన్నాయి. తాజాగా నమీబియా కూడా లంకను ఓడించి ఆ జాబితాలో చేరింది. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top