దుబాయ్‌కు వెళ్లేదెవరో? | South Africa vs New Zealand in Champions Trophy today | Sakshi
Sakshi News home page

దుబాయ్‌కు వెళ్లేదెవరో?

Mar 5 2025 3:04 AM | Updated on Mar 5 2025 3:05 AM

South Africa vs New Zealand in Champions Trophy today

నేడు చాంపియన్స్‌ ట్రోఫీలో రెండో సెమీఫైనల్

న్యూజిలాండ్‌తో దక్షిణాఫ్రికా ‘ఢీ’

గెలిచిన జట్టు ఆదివారం దుబాయ్‌లో భారత్‌తో అమీతుమీకి సిద్ధం

మధ్యాహ్నం గం.2:30 నుంచి స్టార్‌ స్పోర్ట్స్, స్పోర్ట్స్‌ 18, జియో హాట్‌స్టార్‌లలో ప్రత్యక్ష ప్రసారం 

లాహోర్‌: ఎనిమిదేళ్ల విరామం తర్వాత జరుగుతున్న చాంపియన్స్‌ ట్రోఫీ వన్డే టోర్నమెంట్‌లో భారత జట్టు ఫైనల్‌ తొలి బెర్త్‌ను ఖరారు చేసుకోగా... ఫైనల్‌ రెండో బెర్త్‌ కోసం దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్‌ జట్లు నేడు ముఖాముఖి పోరుకు సిద్ధమయ్యాయి. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ఆదివారం దుబాయ్‌లో జరిగే టైటిల్‌ పోరులో టీమిండియాతో ఆడుతుంది. ఐసీసీ టోర్నీల్లో దురదృష్టం వెంట పెట్టుకొని తిరిగే దక్షిణాఫ్రికా జట్టు ఈసారి ఎలాగైనా విజయం సాధించాలని చూస్తుంటే... పాకిస్తాన్‌ పిచ్‌లపై ఇటీవల ముక్కోణపు సిరీస్‌ గెలిచిన న్యూజిలాండ్‌ అదే జోరు కొనసాగించాలని భావిస్తోంది. 

బలాబలాల దృష్ట్యా ఇరు జట్లు సమ ఉజ్జీలే అయినా... నాణ్యమైన స్పిన్నర్లు అందుబాటులో ఉన్న న్యూజిలాండ్‌దే పైచేయిగా కనిపిస్తోంది. ఇరు జట్లు గతంలో ఒక్కోసారి ఈ టోర్నీలో విజేతగా నిలిచాయి. 1998లో దక్షిణాఫ్రికా, 2000లో న్యూజిలాండ్‌ ఈ ట్రోఫీని చేజిక్కించుకున్నాయి. అయితే అప్పట్లో ఈ టోర్నీ పేరు చాంపియన్స్‌ ట్రోఫీ అని కాకుండా... ‘ఐసీసీ నాకౌట్‌ ట్రోఫీ’ అని ఉండేది. ఐసీసీ టోర్నీల్లో ‘చోకర్స్‌’గా ముద్ర చెరిపేసుకోవాలని తెంబా బవుమా సారథ్యంలో దక్షిణాఫ్రికా జట్టు కృతనిశ్చయంతో ఉంది. 

మరోవైపు 2015, 2019 వన్డే ప్రపంచకప్‌లలో తుదిమెట్టుపై తడబడి రన్నరప్‌తో సరిపెట్టుకున్న న్యూజిలాండ్‌ ఈసారి ట్రోఫీ చేజిక్కించుకోవడమే లక్ష్యంగా అడుగులు వేస్తోంది. గ్రూప్‌ ‘బి’లో ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ గెలిచి... ఆసీస్‌తో పోరు వర్షం కారణంగా రద్దు కావడంతో దక్షిణాఫ్రికా 5 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచి సెమీఫైనల్‌కు అర్హత సాధించింది. మరోవైపు గ్రూప్‌ ‘ఎ’లో రెండు మ్యాచ్‌లు గెలిచి, ఒక దాంట్లో ఓడి 4 పాయింట్లతో కివీస్‌ సెమీస్‌కు చేరింది.  

సఫారీలకు సాధ్యమేనా? 
ఫార్మాట్‌తో సంబంధం లేకుండా ఐసీసీ నిర్వహిస్తున్న గత 7 ఈవెంట్లలో నాకౌట్‌కు చేరిన దక్షిణాఫ్రికా జట్టు... ఈసారి కప్పుకొట్టడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. 2023 పురుషుల వన్డే ప్రపంచకప్, 2024 పురుషుల టి20 ప్రపంచకప్, 2025 ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ (డబ్ల్యూటీసీ), 2024 పురుషుల అండర్‌–19 వరల్డ్‌కప్, 2024 టి20 ప్రపంచకప్, 2025 మహిళల అండర్‌–19 ప్రపంచకప్‌ ఇలా.. ఈ ఏడు టోర్నీల్లో సఫారీ టీమ్‌ నాకౌట్‌ దశకు చేరింది. గాయం కారణంగా గత మ్యాచ్‌కు అందుబాటులో లేకపోయిన దక్షిణాఫ్రికా కెప్టెన్‌ బవుమా ఈ మ్యాచ్‌లో ఆడనున్నాడు. డోర్జీ కూడా కోలుకున్నప్పటికీ అతడికి తుది జట్టులో చోటు దక్కడం అనుమానమే.

మార్క్‌రమ్, డసెన్, క్లాసెన్, మిల్లర్, రికెల్టన్‌ కలిసి కట్టుగా రాణించాలని  టీమ్‌ మేనేజ్‌మెంట్‌ ఆశిస్తోంది. పిచ్‌ బ్యాటింగ్‌కు అనుకూలించే సూచనలు ఉన్న నేపథ్యంలో స్టార్‌ ఆటగాళ్లలో ఒకరు ఇన్నింగ్స్‌ ఆసాంతం నిలవాల్సిన అవసరముంది. బౌలింగ్‌లో స్టార్‌ పేసర్లు కగిసో రబడ, లుంగి ఇన్‌గిడి కంటే... ఆల్‌రౌండర్‌ మార్కో యాన్సెన్, ముల్డర్‌ బాగా ప్రభావం చూపుతున్నారు. కేశవ్‌ మహరాజ్‌ స్పిన్‌ బౌలింగ్‌ బాధ్యతలు నిర్వర్తించనున్నాడు.  

ఆత్మవిశ్వాసంతో కివీస్‌... 
పాకిస్తాన్‌ వేదికగా ఇటీవల జరిగిన ముక్కోణపు వన్డే సిరీస్‌ సొంతం చేసుకున్న న్యూజిలాండ్‌ ఆత్మవిశ్వాసంతో ఉంది. లీగ్‌ దశలో భాగంగా భారత్‌ చేతిలో ఓడినప్పటికీ కివీస్‌ను తక్కువ అంచనా వేసేందుకు లేదు. విల్‌ యంగ్, రచిన్‌ రవీంద్ర, కేన్‌ విలియమ్సన్, డారిల్‌ మిషెల్, టామ్‌ లాథమ్, గ్లెన్‌ ఫిలిప్స్, బ్రేస్‌వెల్‌ రూపంలో న్యూజిలాండ్‌ బ్యాటింగ్‌ బలంగా ఉంది. బౌలింగ్‌ రూర్కే, హెన్రీ, జేమీసన్‌తో పాటు కెపె్టన్‌ సాంట్నర్‌ కీలకం కానున్నాడు.

7 ఐసీసీ టోర్నీల్లో దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్‌ మధ్య ఇప్పటి వరకు 11 మ్యాచ్‌లు జరగగా... అందులో న్యూజిలాండ్‌ 7 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. నాలుగింటిలో దక్షిణాఫ్రికా గెలిచింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement