‘గోపీచంద్‌ మరిన్ని విజయాలు అందించాలి’

Shuttlers Flick - An exclusive evening with Pullela Gopichand - Sakshi

మంత్రి కేటీఆర్‌ ఆకాంక్ష

‘షట్లర్స్‌ ఫ్లిక్‌’ పుస్తకావిష్కరణ

సాక్షి, హైదరాబాద్‌: భారత క్రీడారంగంలో ఆటగాళ్లుగా గుర్తింపు తెచ్చుకున్న వారిలో కొందరు మాత్రమే రిటైర్మెంట్‌ తర్వాత కూడా ఆట కోసమే శ్రమించారని... వారిలో పుల్లెల గోపీచంద్‌ది ప్రత్యేక స్థానమని తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు (కేటీఆర్‌) ప్రశంసించారు. బ్యాడ్మింటన్‌ పట్ల గోపీచంద్‌కు ఉన్న అంకితభావం నేడు ప్రపంచం గర్వించదగ్గ చాంపియన్లను తయారు చేసిందని ఆయన వ్యాఖ్యానించారు.

ప్లేయర్‌గా, కోచ్‌గా గోపీచంద్‌ కెరీర్‌లోని కొన్ని కీలక అంశాలు, విశేషాలతో రాసిన ‘షట్లర్స్‌ ఫ్లిక్‌: మేకింగ్‌ ఎవ్రీ మ్యాచ్‌ కౌంట్‌’ పుస్తకాన్ని శుక్రవారం కేటీఆర్‌ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... గోపీచంద్‌ శ్రమ, ప్రణాళిక కారణంగానే బ్యాడ్మింటన్‌ క్రీడకు హైదరాబాద్‌ ప్రధాన కేంద్రంగా మారిందని వ్యాఖ్యానించారు. స్వాతంత్య్రం తర్వాత భారత క్రీడాకారులు సాధించిన విజయాలన్నీ వ్యక్తిగత ప్రతిభతోనే వచ్చాయని, ప్రభుత్వ వ్యవస్థ ఎవరినీ తయారు చేయలేదని కేటీఆర్‌ అభిప్రాయపడ్డారు. స్వయంగా తమ ప్రభుత్వం కూడా క్రీడలను ప్రాధాన్యత అంశంగా గుర్తించలేదని, ఇకపై పరిస్థితి మారుతుం దని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.
 
గోపీచంద్‌ ఆలోచనలకు రచయిత్రి ప్రియా కుమార్‌ పుస్తక రూపం ఇచ్చారు. ఇది పూర్తిగా తన ఆటోబయోగ్రఫీ కాదని గోపీచంద్‌ స్పష్టం చేశారు. ‘ఇది జీవిత చరిత్రలాంటి పుస్తకం కాదు. ఆటగాడిగా, కోచ్‌గా కెరీర్‌లో విభిన్న రకాల అనుభవాలు ఎదుర్కొన్నాను. ఇందులో పలు సవాళ్లు కూడా ఉన్నాయి. వాటిని ఆయా సందర్భాలకు తగినట్లుగా వ్యవహరించి ఎలా అధిగమించానో, వాటిలో స్ఫూర్తిగా నిలిచే అంశాలు ఈతరం క్రీడాకారులకు పనికొస్తాయనే ఉద్దేశంతోనే ఈ పుస్తకం రాశాం. ఇది బ్యాడ్మింటన్‌కు సంబంధించింది మాత్రమే కాదు.

అన్ని రకాల క్రీడాంశాలకు కూడా ఈ పుస్తకంలో తగిన సమాధానాలు లభిస్తాయి. గత కొన్నేళ్లుగా భారత్‌లో బ్యాడ్మింటన్‌ బాగా అభివృద్ధి చెందింది. శిక్షకుడిగా నా వృత్తిలో పలువురు తల్లిదండ్రులు, విద్యార్థుల నుంచే ఎదురైన ప్రశ్నలకు కూడా వివరణ ఇచ్చే ప్రయత్నం చేశాను’ అని ఆయన వెల్లడించారు. రచయిత్రి ప్రియా కుమార్‌ మాట్లాడుతూ... ‘ఒక సాధారణ వ్యక్తి విజేతగా నిలిచేందుకు ఎంత గా కష్టపడ్డాడో, దాని నుంచి ఎలా స్ఫూర్తి పొంద వచ్చో అనే విషయాన్నే ఇందులో ప్రముఖంగా ప్రస్తావించాం. రచనా శైలి కూడా అంశాల వారీగా ఉంటుంది. అనేక అంశాలపై గోపీచంద్‌ ఆలోచనలను పుస్తకంగా మార్చేందుకు మూడేళ్లు పట్టింది’ అని పేర్కొంది. సైమన్‌ అండ్‌ షుస్టర్‌ పబ్లిషర్స్‌ ఈ ‘షట్లర్స్‌ ఫ్లిక్‌’ను ప్రచురించింది.   
 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top