బిష్ణోయ్‌ను నిందించని శ్రేయస్‌ | Shreyas Iyer Defends Ravi Bishnoi After Expensive Over As India Slip To Narrow T20I Loss Against England | Sakshi
Sakshi News home page

బిష్ణోయ్‌ను నిందించని శ్రేయస్‌

Jul 5 2026 1:07 PM | Updated on Jul 5 2026 3:11 PM

Shreyas Iyer Refuses To Blame Ravi Bishnoi For England T20I Defeat

ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టీ20లో కీలక సమయంలో ఖరీదైన ఓవర్ వేసి టీమిండియా ఓటమికి ప్రధాన కారకుడైన లెగ్ స్పిన్నర్ రవి బిష్ణోయ్‌ను కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ వెనుకేసుకొచ్చాడు. జట్టు ఓటమికి ఒక్కడినే బాధ్యుడిని చేయడం సరికాదని అభిప్రాయపడ్డాడు.

మ్యాచ్ అనంతరం శ్రేయస్ మాట్లాడుతూ.. మ్యాచ్ ఎక్కడ మా చేతుల్లో నుంచి జారిపోయిందో నాకు తెలుసు. కానీ ఒకే ఆటగాడిని చూపించి అతనినే నిందించాలనుకోవడం లేదు. 16వ ఓవర్ తర్వాత మ్యాచ్ మొమెంటం పూర్తిగా మారిపోయిందని అన్నాడు.

బిష్ణోయ్ వేసిన వరుస నోబాల్స్ గురించి ప్రశ్నించగా.. ఒక నోబాల్ వేసినా అతను మరింత బలంగా తిరిగి వస్తాడని నమ్ముతున్నాను. 17వ ఓవర్‌లో మ్యాచ్ మా చేతుల్లో నుంచి వెళ్లిపోయింది. అతను ఈ అనుభవం నుంచి నేర్చుకోవాల్సి ఉంటుంది.

ఈ పిచ్‌పై 190 పరుగులు చాలామంచి స్కోరు. ముఖ్యంగా చివరి ఓవర్‌లో తిలక్ వర్మ ఆడిన అజేయ 24 పరుగుల ఇన్నింగ్స్ అసాధారణం. అదే సమయంలో జేకబ్ బేతెల్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. అతనికి కూడా తగిన గుర్తింపు ఇవ్వాలని పేర్కొన్నాడు.

టీమిండియా తరఫున అరంగేట్రం చేసిన 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీపై కూడా శ్రేయస్‌ ప్రశంసలు కురిపించాడు. "అతనిలో ఏమాత్రం భయం కనిపించలేదు. గత కొన్ని నెలలుగా అద్భుతమైన క్రికెట్ ఆడుతున్నాడు. అరంగేట్రం ఒత్తిడిని ఏమాత్రం పట్టించుకోకుండా అవకాశాన్ని చక్కగా వినియోగించుకున్నాడు. అతని ఆత్మవిశ్వాసం చూడటానికి చాలా ఆనందంగా ఉంది" అని అన్నాడు.

కాగా, 191 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ 16 ఓవర్లు ముగిసే సమయానికి ఐదు వికెట్లు కోల్పోయి లక్ష్యానికి 49 పరుగుల దూరంలో ఉండింది. ఈ దశలో బౌలింగ్‌కు వచ్చిన రవి బిష్ణోయ్ వరుసగా రెండు నోబాల్స్ వేయగా, ఫ్రీ హిట్‌లను జేకబ్ బేతెల్ రెండు భారీ సిక్సర్లుగా మలిచాడు. 

అదే ఓవర్‌లో మరో సిక్స్, ఒక ఫోర్‌తో కలిపి మొత్తం 29 పరుగులు రావడంతో మ్యాచ్ పూర్తిగా ఇంగ్లండ్ ఆధీనంలోకి వెళ్లింది. చివరకు ఆతిథ్య జట్టు మరో ఓవర్ మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించింది. ఈ గెలుపుతో ఇంగ్లండ్‌ ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. తొలి టీ20 వర్షం కారణంగా రద్దైన విషయం తెలిసిందే.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement