
‘ది నేపాల్ ప్రీమియర్ లీగ్’ (NPL) సెకెండ్ సీజన్‌కు రంగం సిద్దమవుతోంది. ఈ మెగా ఈవెంట్ నవంబర్ 17 నుండి డిసెంబర్ 13 వరకు జరుగుతుంది. ఈ క్రమంలో డిఫెండింగ్ ఛాంపియన్స్ జనక్‌పూర్ బోల్ట్స్ కీలక నిర్ణయం తీసుకుంది. వెస్టిండీస్ క్రికెట్ లెజెండ్ శివనారాయణ్ చంద్రపాల్‌ను తమ జట్టు ప్రధాన కోచ్‌గా జనక్‌పూర్ నియమించింది.
ఈ విషయాన్ని జనక్‌పూర్ బోల్ట్స్ ఫ్రాంచైజీ సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. మొదటి సీజన్‌లో జనక్‌పూర్ హెడ్ కోచ్‌గా పనిచేసిన పుబుడు దస్నాయకే స్ధానాన్ని చాందర్‌పాల్ భర్తీ చేయనున్నాడు. అయితే తొలి సీజన్‌లోనే ఛాంపియన్‌గా నిలిపినప్పటికి.. దస్నాయకేను ఎందుకు తప్పించారో సదరు ఫ్రాంచైజీ వెల్లడించలేదు. చంద్రపాల్ కోచింగ్‌లో తమ జట్టు అద్భుతాలు సృష్టిస్తుందని జనక్‌పూర్ బోల్ట్స్ థీమా వ్యక్తం చేసింది.
విలక్షణమైన బ్యాటింగ్ శైలితో ప్రసిద్ధి గాంచిన చంద్రపాల్.. వరల్డ్ క్రికెట్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. శివనారాయణ్ అంతర్జాతీయ క్రికెట్‌లో 20,000 కంటే ఎక్కువ పరుగులు చేశాడు. టెస్ట్‌లలో 11,867, వన్డేలలో 8,778 పరుగులు చేశాడు. రెండు దశాబ్దాలకు పైగా విండీస్ క్రికెట్‌కు తన సేవలను అందించాడు.
అదేవిధంగా కోచ్‌గా కూడా చంద్రపాల్‌ను అనుభవం ఉంది. కరేబియన్ ప్రీమియర్ లీగ్ (CPL)లో జమైకా తలైవాస్‌తో కలిసి పనిచేశాడు. ఆ తర్వాత యూఎస్‌ఎ మహిళల జాతీయ జట్టుకు ప్రధాన కోచ్‌గా తన సేవలను అందించాడు. ఇప్పుడు మరోసారి తన అనుభవాన్ని పంచుకునేందుకు చంద్రపాల్ సిద్దమయ్యాడు.
చదవండి: ఇది అవుట్ అని మీకూ తెలుసు.. కానీ: నవ్వుతూనే ఇచ్చిపడేసిన బుమ్రా