Who Is Sheikh Rashid: భారత్‌ క్రికెట్‌లో మెరిసిన తెలుగు తేజం.. కీలక బాధ్యతల్లో..

Sheikh rashid Appointed Indian Under-19 Team - Sakshi

 ఐసీసీ అండర్‌–19 క్రికెట్‌ వరల్డ్‌ కప్‌–2022కు ఎంపిక

భారత్‌ టీం వైస్‌ కెప్టెన్‌గా పాతమల్లాయపాలెం కుర్రోడు

అధికారికంగా ప్రకటించిన బీసీసీఐ

హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్న గ్రామస్తులు

ప్రత్తిపాడు/గుంటూరు: అంతర్జాతీయ క్రికెట్‌లో తెలుగుతేజం మెరిసింది. వెస్టిండీస్‌లో జనవరి 14 నుంచి ఫిబ్రవరి 5వ తేదీ వరకు జరగనున్న ఐసీసీ అండర్‌–19 మెన్స్‌ క్రికెట్‌ వరల్డ్‌ కప్‌ 2022కు బీసీసీఐ భారత్‌ టీంను ప్రకటించింది. పదిహేడు మంది సభ్యులతో ప్రకటించిన భారత్‌ టీంలో ఆంధ్రా క్రికెట్‌ అసోసియేషన్‌ నుంచి వైస్‌ కెప్టెన్‌గా షేక్‌ రషీద్‌ ఎంపికయ్యాడు. రషీద్‌ మన జిల్లా వాసే.

ప్రత్తిపాడు మండలం పాతమల్లాయపాలెంకు చెందిన షేక్‌ బాలీషా, జ్యోతిలకు ఇద్దరు కుమారులు. పెద్దకుమారుడు రియాజ్‌ మెకానికల్‌ ఇంజినీరింగ్‌ చదువుతుండగా, రెండవ కుమారుడు రషీద్‌ ప్రస్తుతం నరసరావుపేటలోని రెడ్డి కళాశాలలో ఇంటర్‌ సెకండియర్‌ చదువుతున్నాడు. తండ్రి వృత్తిరీత్యా ప్రైవేటు ఉద్యోగి కావడం, కుమారుడి ప్రాక్టీస్‌ నిమిత్తం వీరు ప్రస్తుతం గుంటూరులోని హౌసింగ్‌ బోర్డు కాలనీలో నివాసం ఉంటున్నారు. 

పన్నెండేళ్ల వయస్సులోనే.. 
రషీద్‌కు చిన్నతనం నుంచే క్రికెట్‌పై అమితమైన ఆసక్తి ఉంది. స్వతహాగా బ్యాటింగ్‌ అంటే మంచి ఇష్టమున్న రషీద్‌ ఆ దిశగానే తన ప్రయత్నాలను మొదలుపెట్టాడు. పన్నెండేళ్ల వయస్సులోనే ఆంధ్ర క్రికెట్‌ అసోసియేషన్‌కు సెలక్ట్‌ అయ్యాడు. మంగళగిరిలో ప్రత్యేక కోచ్‌ల ఆధ్వర్యంలో శిక్షణ పొందుతున్నాడు. రషీద్‌కు తల్లిదండ్రుల నుంచి కూడా మంచి ప్రోత్సాహం ఉంది. కుమారుడి ప్రాక్టీసుకు ఇబ్బంది కలగకూడదన్న ఉద్దేశంతో పదేళ్ల క్రితం కుటుంబంతో సహా గుంటూరుకు వెళ్లిపోయారు. కుర్రాడి ఎంపిక పట్ల తల్లిదండ్రులతో పాటు పాతమల్లాయపాలెం గ్రామస్తులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు.

చదవండి: IND Vs SA: ఓవర్‌లోడ్ బ్యాగ్ మోసుకుని వెళ్లిన కోహ్లి.. దాంట్లో ఏముంది!

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top