
పాకిస్తాన్‌తో స్వదేశంలో జరగనున్న మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ కోసం 15 మంది సభ్యులతో కూడా తమ జట్టును వెస్టిండీస్ క్రికెట్ బోర్డు బుధవారం ప్రకటించింది. ఈ జట్టు కెప్టెన్‌గా షాయ్ హోప్ వ్యవహరించనున్నాడు.
అదేవిధంగా విధ్వంసకర ఆల్‌రౌండర్ రొమారియో షెపర్డ్ తిరిగి వన్డే జట్టులోకి వచ్చాడు. షెపర్డ్ ఇంతకుముందు ఇంగ్లండ్, ఐర్లాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లకు దూరమయ్యాడు.
మరోవైపు పాక్‌తో సిరీస్‌కు ఫాస్ట్ బౌలర్ అల్జారి జోసెఫ్, ఆల్‌రౌండర్ జాసన్ హోల్డర్‌కు వర్క్‌లోడ్ మెనెజ్‌మెంట్‌లో భాగంగా సెలక్టర్లు విశ్రాంతి ఇచ్చారు. ఇంతకుముందు టీ20 సిరీస్‌కు కూడా జోసెఫ్ దూరమయ్యాడు.
ఈ జట్టులో రోస్టన్ చేజ్, బ్రాండన్ కింగ్, షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్, లూయిస్ వంటి సీనియర్ ఆటగాళ్లు ఉన్నారు. కాగా ఈ మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ఆగస్టు 8 నుంచి 12 మధ్య జరగనుంది. మొత్తం మూడు మ్యాచ్‌లకు ట్రినిడాడ్‌లోని తరౌబాలోని బ్రియాన్ లారా స్టేడియం ఆతిథ్యమివ్వనుంది.
కాగా అంతకుముందు పాక్‌తో టీ20 సిరీస్‌ను 2-1 తేడాతో విండీస్ కోల్పోయింది. ఈ క్రమంలో వన్డే సిరీస్‌ను ఎలా అయినా సొంతం చేసుకోవాలని కరేబియన్ జట్టు పట్టుదలతో ఉంది.
పాక్‌తో వన్డే సిరీస్‌కు విండీస్ జట్టు
షాయ్ హోప్ (కెప్టెన్), జ్యువెల్ ఆండ్రూ, జెడియా బ్లేడ్స్, కీసీ కార్టీ, రోస్టన్ చేజ్, మాథ్యూ ఫోర్డ్, జస్టిన్ గ్రీవ్స్, అమీర్ జాంగూ, షమర్ జోసెఫ్, బ్రాండన్ కింగ్, ఎవిన్ లూయిస్, గుడకేష్ మోటీ, షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్, జేడెన్ సీల్స్ మరియు రొమారియో షెపర్డ్.