
కరీబియన్ ప్రీమియర్ లీగ్ 2025లో గయానా అమెజాన్ వారియర్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న ఆర్సీబీ బ్యాటర్ రొమారియో షెపర్డ్ చెలరేగిపోయాడు. సెయింట్స్ లూసియా కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 34 బంతుల్లో 7 భారీ సిక్సర్లు, 5 ఫోర్ల సాయంతో అజేయమైన 73 పరుగులు చేసి విధ్వంసం సృష్టించాడు. షెపర్డ్ ఆకాశమే హద్దుగా చెలరేగినా ఈ మ్యాచ్‌లో వారియర్స్ ఓడిపోవడం కొసమెరుపు.
బీభత్సం సృష్టించిన షెపర్డ్
అయితే ఈ మ్యాచ్‌లో షెపర్డ్ ఓ అద్భుతమైన ఫీట్ సాధించాడు. ఒకే బంతికి 3 సిక్సర్లు సహా 22 పరుగులు రాబట్టాడు. ఒషేన్ థామస్ వేసిన ఇన్నింగ్స్ 15వ ఓవర్ మూడో బంతికి ఇది జరిగింది.
After 12.1 overs - 78/5.
After 20 overs - 202/6.
ITS ROMARIO SHEPHERD SHOW IN CPL - 73*(34) - 5 FOURS & 7 SIXES 🥶🔥 pic.twitter.com/UI71kIkzX6— Johns. (@CricCrazyJohns) August 27, 2025
తొలుత నో బాల్ (ఒక పరుగు), ఆతర్వాత వైడ్ (మరో పరుగు), మళ్లీ నో బాల్ (1+6), మళ్లీ నో బాల్ (1+6), ఆతర్వాత మరో సిక్సర్.. ఇలా ఓ లీగల్ బంతిని ఐదు సార్లు బౌల్ చేయగా మొత్తంగా 22 పరగులు వచ్చాయి.
అంతర్జాతీయ క్రికెట్‌తో పాటు ఐపీఎల్ ఆడిన అనుభవం ఉన్న ఒషేన్ థామస్ లాంటి బౌలర్ ఇంత చెత్తగా బౌలింగ్ చేయడం చూసి అందరూ ఆశ్చర్యపోయారు. మొత్తంగా ఆ ఓవర్‌లో అతడు 10 బంతులు వేసి 33 పరుగులిచ్చాడు.
మ్యాచ్ విషయానికొస్తే.. షెపర్డ్ బీభత్సం ధాటికి తొలుత బ్యాటింగ్ చేసిన వారియర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 202 పరుగుల భారీ స్కోర్ చేసింది. 12.1 ఓవర్ల తర్వాత 78/5గా ఉన్న వారియర్స్ స్కోర్ షెపర్డ్ విధ్వంసం ధాటికి ఆతర్వాతి 47 బంతుల్లో ఏకంగా 124 పరుగులు చేసింది.
షెపర్డ్‌కు ఇఫ్తికార్ అహ్మద్ (27 బంతుల్లో 33; ఫోర్, 3 సిక్సర్లు), ప్రిటోరియస్ (6 బంతుల్లో 18 నాటౌట్; 2 ఫోర్లు, సిక్స్) సహకరించారు. అంతకుముందు బెన్ మెక్‌డెర్మాట్ (18 బంతుల్లో 30; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), షాయ్ హోప్ (27 బంతుల్లో 23; 2 ఫోర్లు) ఓ మోస్తరు స్కోర్లు చేశారు.
వారియర్స్ ఇన్నింగ్స్‌లో కెవ్లన్ ఆండర్సన్ 5, మొయిన్ అలీ 0, షిమ్రోన్ హెట్‌మైర్ 3 పరుగులు చేసి నిరాశపరిచారు. లూసియా కింగ్స్ బౌలర్లలో గాస్టన్ 2, పియెర్రీ, డేవిడ్ వీస్, ఒషేన్ థామస్ తలో వికెట్ తీశారు.
అనంతరం 203 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన లూసియా కింగ్స్.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అఖీమ్ అగస్టీ (35 బంతుల్లో 73; 6 ఫోర్లు, 4 సిక్సర్లు) చెలరేగడంతో మరో 11 బంతులు మిగిలుండగానే విజయతీరాలకు చేరింది. లూసియా కింగ్స్ గెలుపులో టిమ్ సీఫర్ట్ (24 బంతుల్లో 37), టిమ్ డేవిడ్ (15 బంతుల్లో 25) తలో చేయి వేశారు.
జాన్సన్ ఛార్లెస్ (13), రోస్టన్ ఛేజ్ (12), ఆరోన్ జోన్స్ (16) తక్కువ స్కోర్లకే ఔటైనా లూసియా కింగ్స్ సునాయాసంగా విజయం సాధించింది. వారియర్స్ బౌలర్లలో గుడకేశ్ మోటీ (4-0-32-2) ఒక్కడే కింగ్స్ బ్యాటర్లను కంట్రోల్ చేయగలిగాడు.