'నేను జోక్‌ చేశా.. అక్తర్‌ సీరియస్‌ అ‍య్యాడు'

Shahid Afridi Opens Secret Behind 2007 Ugly Spat Between Akhtar And Asif - Sakshi

కరాచీ: పాకిస్తాన్‌ క్రికెట్‌ అంటేనే అనిశ్చితికి మారుపేరు. ఆ జట్టులో ఆటగాళ్ల మూడ్‌ ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరికి అంతుచిక్కదు. అనవసర విషయాల్లో తలదూర్చి ఆటగాళ్లు తమ కెరీర్‌ను నాశనం చేసుకున్న సందర్బాలు చాలానే ఉన్నాయి. 2007 దక్షిణాఫ్రికా వేదికగా తొలి టీ20 ప్రపంచకప్‌ ఆరంభానికి ముందు పాకిస్తాన్‌ బౌలర్లు షోయబ్‌ అక్తర్‌, మహ్మద్‌ ఆసిఫ్‌ల గొడవ క్రికెట్‌ ప్రపంచాన్ని షాక్‌కు గురిచేసింది.

డ్రెస్సింగ్‌ రూమ్‌లో జరిగిన వాగ్వాదంలో.. కోపంతో అక్తర్‌ ఆసిఫ్‌పై బ్యాట్‌తో దాడికి దిగాడు.ఆ దెబ్బకు ఆపిఫ్‌ తొడకు బలమైన గాయం అయింది.ఈ గొడవ అప్పట్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఈ విషయం తెలుసుకున్న పీసీబీ అతన్ని జట్టు నుంచి తొలగించి టీ20 ప్రపంచకప్‌ ఆడకుండా సస్పెండ్‌ చేసింది. అయితే తర్వాత తిరిగి జట్టులోకి వచ్చిన అక్తర్‌​ ఆసిఫ్‌కు క్షమాపణ చెప్పడంతో వివాదం సద్దుమణిగింది.

తాజాగా 14 ఏళ్ల తర్వాత షాహిద్‌ అఫ్రిది గొడవకు సంబంధించిన సీక్రెట్‌ను రివీల్‌ చేశాడు. ''ఆరోజు ఆసిఫ్‌, నేను సరదాగా జోక్స్‌ వేసుకుంటూ మాట్లాడుకుంటున్నాం. ఇంతలో అక్కడికి వచ్చిన అక్తర్‌ తన గురించి మాట్లాడుతున్నారని భావించి మమ్మల్ని అడిగాడు. అయితే నీ గురించి మాట్లాడుకోవడానికి మాకు పని లేదా అని నేను జోక్‌ చేశా.. కానీ అక్తర్‌ దానిని సీరియస్‌గా తీసుకున్నాడు. దాంతో గొడవ ప్రారంభమైంది.. అలా మాటామాటా పెరిగి తను మాపై బ్యాట్‌తో దాడికి యత్నించాడు. నేను తప్పించుకున్నా.. ఆసిఫ్‌ మాత్రం గాయపడ్డాడు.. ఈ విషయంలో నేను అక్తర్‌ను తప్పుబట్టలేను.. ఎందుకంటే అతనికి మంచి మనుసు ఉంది. ఆవేశంలో అలా చేశాడు తప్ప వాస్తవానికి అతను చాలా మంచి వ్యక్తి'' అంటూ చెప్పుకొచ్చాడు.

అయితే అక్తర్‌ ఆటకు గుడ్‌బై చెప్పాకా తన ఆటోబయోగ్రఫీలో ఆసిఫ్‌తో గొడవను ప్రస్తావించాడు. ''ఆసిఫ్‌తో గొడవ జరగడానికి కారణం అఫ్రిదినే.. ఈ విషయం అతనికి కూడా తెలుసు.. కానీ ఆ సమయంలో నన్ను బ్లేమ్‌ చేస్తూ తాను తప్పించుకున్నాడు. వాస్తవానికి ఆరోజు జరిగిన గొడవలో అఫ్రిది, ఆసిఫ్‌లను బ్యాట్‌తో కొట్టేందుకు ప్రయత్నించాను. అఫ్రిది తప్పించుకోగా.. ఆసిఫ్‌ తొడకు మాత్రం గాయం అయింది. కానీ ఇంతకముందు ఏనాడు డ్రెస్సింగ్‌రూమ్‌లో అలా బిహేవ్‌ చేయలేదు'' అని రాసుకొచ్చాడు. 
చదవండి: సిగ్గుచేటు.. దేశం ఇలా ఉందంటే నీలాంటి వారి వల్లే

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top