సాత్విక్‌ ‘పాజిటివ్‌’ 

Satwiksairaj Tested Positive Of Coronavirus - Sakshi

కరోనా వైరస్‌ బారిన భారత డబుల్స్‌ స్టార్‌ షట్లర్‌

జాతీయ క్రీడా పురస్కారాల కార్యక్రమానికి దూరం కానున్న ఆంధ్రప్రదేశ్‌ ప్లేయర్‌

న్యూఢిల్లీ: సుదీర్ఘ విరామం తర్వాత హైదరాబాద్‌లో ఈనెలారంభంలో జాతీయ బ్యాడ్మింటన్‌ శిక్షణ శిబిరం మొదలైన వెంటనే కరోనా కలకలం చెలరేగింది. ఈ శిబిరానికి హాజరైన మహిళల డబుల్స్‌ స్టార్‌ సిక్కి రెడ్డి, ఫిజియోథెరపిస్ట్‌ కిరణ్‌ కరోనా వైరస్‌ బారిన పడ్డారు. వెంటనే మరోసారి నిర్వహించిన కోవిడ్‌–19 టెస్టుల్లో వీరిద్దరికి నెగెటివ్‌ ఫలితం వచ్చింది. తాజాగా పురుషుల డబుల్స్‌ ప్లేయర్‌ సాత్విక్‌ సాయిరాజ్‌ (ఆంధ్రప్రదేశ్‌)కు కూడా కరోనా సోకింది. అతనిలో కరోనాకు సంబంధించి ఎలాంటి లక్షణాలు లేవు. ఈ మహమ్మారి సోకడంతో ప్రస్తుతం అమలాపురంలోని తన ఇంట్లోనే స్వీయ నిర్బంధంలో ఉన్న సాత్విక్‌... ఈనెల 29న ఆన్‌లైన్‌లో జరిగే ప్రతిష్టాత్మక జాతీయ క్రీడా అవార్డుల ప్రదానోత్సవానికి దూరం కానున్నాడు.

డబుల్స్‌లో తన భాగస్వామి చిరాగ్‌ శెట్టితో పాటు ఈ ఏడాది ‘అర్జున’ అవార్డుకు సాత్విక్‌ ఎంపికయ్యాడు. ‘కొన్నిరోజుల క్రితమే యాంటిజెన్‌ పరీక్షకు హాజరయ్యా. ఆ తర్వాత చేసిన ఆర్‌టీ–పీసీఆర్‌ పరీక్షలోనూ కరోనా సోకినట్లు తేలింది. ఐదు రోజులుగా క్వారంటైన్‌లోనే ఉంటూ చికిత్స తీసుకుంటున్నా. జ్వరం, జలుబు, ఒళ్లునొప్పుల్లాంటి లక్షణాలేవీ లేవు. మరో మూడు రోజుల తర్వాత మళ్లీ కరోనా టెస్టు చేయించుకుంటా. అదృష్టవశాత్తు మా కుటుంబసభ్యులెవరికీ కరోనా పాజిటివ్‌ రాలేదు’ అని 20 ఏళ్ల సాత్విక్‌ వివరించాడు. సాత్విక్‌తో పాటు మరో ఇద్దరు అవార్డు విజేతలు కూడా కరోనా కారణంగా ఈ వేడుకలకు హాజరు కాలేకపోతున్నారని భారత స్పోర్ట్స్‌ అథారిటీ (సాయ్‌) అధికారులు పేర్కొన్నారు. అయితే వారి పేర్లను మాత్రం వెల్లడించలేదు. 

మొదటిసారిగా... 
మరోవైపు కోవిడ్‌–19 నేపథ్యంలో జాతీయ క్రీడా అవార్డుల ప్రదానోత్సవం నిర్ణీత సమయానికి జరుగుతుందో లేదో అనే సందేహాల్ని పటాపంచలు చేస్తూ కేంద్రం వినూత్న సంప్రదాయానికి తెరతీసింది. చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఈసారి వర్చువల్‌ (ఆన్‌లైన్‌) వేదికగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించనుంది. దేశ వ్యాప్తంగా ఉన్న ‘సాయ్‌’ కేంద్రాలు ఇందుకు వేదికలుగా మారనున్నాయి. రాష్ట్రపతి రాంనాథ్‌ కోవింద్‌ రాష్ట్రపతి భవన్‌ నుంచే వర్చువల్‌ పద్ధతిలో విజేతలకు అవార్డులను అందజేయనున్నారు. అవార్డులకు ఎంపికైన క్రీడాకారులంతా తమ నగరాల్లోని ‘సాయ్‌’ కేంద్రాల్లో జరిగే ఈ కార్యక్రమంలో పాల్గొని అవార్డులను స్వీకరించనున్నారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ ఏడాది 74 మంది జాతీయ అవార్డులకు ఎంపికవగా 65 మంది శనివారం ఈ అవార్డును పొందనున్నట్లు ‘సాయ్‌’ తెలిపింది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top