
వరల్డ్ చాంపియన్‌షిప్‌పై సాత్విక్–చిరాగ్ ఆత్మవిశ్వాసం
న్యూఢిల్లీ: బ్యాడ్మింటన్ పురుషుల డబుల్స్‌లో సంచలన జోడీగా ఘన విజయాలు అందుకున్న సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి గత కొంత కాలంగా అంచనాలకు అనుగుణంగా రాణించలేకపోతున్నారు. వరల్డ్ చాంపియన్‌షిప్‌లో కాంస్యం, థామస్ కప్‌లో స్వర్ణంతో పాటు ఆసియా క్రీడలు, కామన్వెల్త్ క్రీడల్లో పతకాలు గెలుచుకొని రెండేళ్ల క్రితమే వరల్డ్ నంబర్‌వన్ జంటగా నిలిచారు. అయితే గాయాలు తదితర కారణాలతో వెనుకబడిన వీరికి 2025లో కూడా కలిసి రాలేదు. ఏడాది కాలంగా సాత్విక్–చిరాగ్ ఒక్క టైటిల్ కూడా గెలవలేదు.
అయితే ప్రదర్శన మరీ పేలవంగా ఏమీ లేదు కానీ ట్రోఫీలు మాత్రం సాధించలేకపోతున్నారు. పారిస్ ఒలింపిక్స్‌లో క్వార్టర్ ఫైనల్లో వెనుదిరిగిన తర్వాత వరుసగా మూడు టోర్నీల్లో వారు సెమీఫైనల్ చేరారు. ఇటీవల కూడా సింగపూర్, చైనా ఓపెన్ టోర్నీల్లో కూడా సెమీఫైనల్ వరకు రాగలిగారు. తాము విఫలమవుతున్న విషయాన్ని వీరు కూడా అంగీకరించారు. ‘పారిస్ ఒలింపిక్స్ తర్వాత పరిస్థితి కొంత ఇబ్బందికరంగా మారింది. నేను గాయపడ్డాను. ట్రైనర్‌ను మార్చాల్సి వచ్చింది. అంత మళ్లీ కొత్తగా మొదలు పెట్టినట్లు అనిపించింది.
గాయాలు, వ్యక్తిగత సమస్యలతో లయ కోల్పోయాం. మొత్తంగా చూస్తే మెరుగ్గానే ఆడినా ఇంకా ఫలితాలు రావాల్సింది. అయితే త్వరలోనే అది జరుగుతుందని నమ్ముతున్నాం. వరుసగా టోర్నీలు ఆడితే అది సాధ్యమవుతుంది’ అని సాత్విక్ వ్యాఖ్యానించాడు. ఆల్ ఇంగ్లండ్ టోర్నీ తర్వాత చిరాగ్‌కు గాయం కావడంతో రెండు నెలలు ఆటకు దూరం కావాల్సి వచ్చింది. ఆ తర్వాత జరిగిన సింగపూర్ టోర్నీలో ఊహించిదానికంటే మెరుగైన ప్రదర్శనే చేసారు.
‘సింగపూర్ టోర్నీలో మేం ఒక గేమ్ గెలవడం కూడా గగనంగా అనిపించింది. తొలి రౌండ్ దాటలేం అనుకున్న స్థితిలో కూడా సెమీస్ చేరగలిగాం’ అని చిరాగ్ గుర్తు చేశాడు. అయితే తాము పూర్తి స్థాయిలో ఫిట్‌గా లేమని మాత్రం సాత్విక్– చిరాగ్ వెల్లడించారు. ‘గత ఏడాది కాలంలో మేం పూర్తి ఫిట్‌గా ఉండి ఆడిన మ్యాచ్‌లు లేవు. ఏదో చిన్న చిన్న సమస్యలతోనే ఆడుతూ పోయాం. గాయాలు మా ఆటలో జోరును నిలువరిస్తున్నాయి.
మేం 100 శాతం ఫిట్‌గా మారాల్సిన అవసరం ఉంది. అప్పుడే వరుస విజయాలు దక్కుతాయి’ అని ఈ భారత ద్వయం పేర్కొంది. ఈ నెల 25 నుంచి పారిస్‌లో వరల్డ్ చాంపియన్‌షిప్ జరగనున్న నేపథ్యంలో వీరిపై గెలుపు అంచనాలు ఉన్నాయి. తమ ఫిట్‌నెస్ మెరుగవుతోందని, పూర్తి స్థాయిలో కోలుకొని మళ్లీ సత్తా చాటుతామన్న డబుల్స్ జంట వరల్డ్ చాంపియన్‌షిప్‌లో అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వగలమని విశ్వాసం వ్యక్తం చేసింది.