సర్ఫరాజ్‌, ధ్రువ్‌ జురెల్‌కు జాక్‌ పాట్‌.. కేవలం మూడు మ్యాచ్‌లకే | Sakshi
Sakshi News home page

#BCCI: సర్ఫరాజ్‌, ధ్రువ్‌ జురెల్‌కు జాక్‌ పాట్‌.. కేవలం మూడు మ్యాచ్‌లకే

Published Tue, Mar 19 2024 8:06 AM

Sarfaraz Khan, Dhruv Jurel awarded with central contracts by BCCI - Sakshi

టెస్టు క్రికెట్‌ అరంగేట్రంలోనే సత్తాచాటిన టీమిండియా ఆటగాళ్లు సర్ఫరాజ్‌ ఖాన్‌, ధ్రువ్‌ జురెల్‌ జాక్‌ పాట్‌ తగిలింది. బీసీసీఐ సెంట్రల్‌ కాంట్రాక్ట్‌ జాబితాలో వీరిద్దరికి చోటు దక్కింది. వీరిద్దరికి గ్రేడ్‌-సీ కాంట్రాక్ట్‌ ఇస్తున్నట్లు బీసీసీఐ ఓ ప్రకటనలో పేర్కొంది. సోమవారం (మార్చి 18) జరిగిన  అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది.

కాగా బీసీసీఐ కాంట్రాక్టు పొందాలంటే ప్రస్తుత సీజన్ లో కనీసం మూడు టెస్టులు లేదా ఎనిమిది వన్డేలు లేదా పది టీ20లు ఆడాల్సి ఉంటుంది. అయితే ఈ ఇద్దరూ ఇంగ్లండ్ తో చెరో మూడు టెస్టులు ఆడిన కారణంగా నేరుగా సీ-గ్రేడు జాబితాలో బీసీసీఐ చేర్చింది. సీ-గ్రేడ్‌ కేటగీరీ కింద వీరు రూ. కోటి వార్షిక వేతనం అందుకోనున్నారు.

ఇక ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన సర్ఫరాజ్‌ అదరగొట్టాడు. ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ హాఫ్‌ సెంచరీలతో చెలరేగాడు. అతడితో పాటు యువ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ ధ్రువ్‌ జురెల్‌ సైతం సత్తాచాటాడు. రాంచీ టెస్టులో 90, 39 స్కోర్లతో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా ధ్రువ్‌ నిలిచాడు.

వీరిద్దరి అద్బుత ప్రదర్శన కారణంగానే కేవలం మూడు మ్యాచ్‌లకే బీసీసీఐ కాంట్రాక్ట్‌లు అప్పగించింది. కాగా 2023-24 సంవత్సరానికి గాను సెంట్రల్‌ కాంట్రాక్ట్‌ పొందిన ఆటగాళ్ల జాబితాను బీసీసీఐ  గత నెలలో ప్రకటించింది. ఈ జాబితాలో మొత్తం 30 మంది ఆటగాళ్లు చోటు దక్కించుకున్నారు. అనూహ్యంగా యువ క్రికెటర్లు శ్రేయస్‌ అయ్యర్‌, ఇషాన్‌ కిషన్‌కు ఈ జాబితాలో చోటు దక్కలేదు.
 

Advertisement
 
Advertisement