ఐసీసీ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మంత్‌’ రేసులో సామ్సన్, బుమ్రా | Samson and Bumrah in race for ICC Player of the Month | Sakshi
Sakshi News home page

ఐసీసీ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మంత్‌’ రేసులో సామ్సన్, బుమ్రా

Apr 7 2026 4:15 AM | Updated on Apr 7 2026 4:15 AM

Samson and Bumrah in race for ICC Player of the Month

దుబాయ్‌: టీమిండియా ఓపెనర్‌ సంజూ సామ్సన్, స్టార్‌ పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మంత్‌’ అవార్డుకు నామినేట్‌ అయ్యారు. గత నెలలో జరిగిన టి20 ప్రపంచకప్‌లో ప్రదర్శనకుగానూ ఐసీసీ వీరిద్దరి పేర్లను నామినేట్‌ చేసింది. వరల్డ్‌కప్‌ చివరి మూడు మ్యాచ్‌ల్లో అర్ధశతకాలతో భారత్‌ వరుసగా రెండోసారి చాంపియన్‌గా నిలవడంలో సామ్సన్‌ కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. 

వెస్టిండీస్‌తో కీలక మ్యాచ్‌లో 97 పరుగులు చేసిన సంజూ... సెమీఫైనల్లో ఇంగ్లండ్‌పై, ఫైనల్లో న్యూజిలాండ్‌పై 87 పరుగుల చొప్పున చేసి ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీస్‌’ అవార్డు సైతం గెలుచుకున్నాడు. ఇక ఈ టోర్నీలో 7 ఎకానమీతో 7 వికెట్లు పడగొట్టిన బుమ్రా జట్టుకు అవసరమైనప్పుడల్లా ‘బ్రేక్‌ త్రూ’ అందించాడు. ఈ ఇద్దరితో పాటు దక్షిణాఫ్రికా ప్లేయర్‌ కానర్‌ ఎస్టెర్హుజెయిన్‌ సైతం రేసులో ఉన్నాడు. 

2021 జనవరిలో ఐసీసీ ప్రవేశపెట్టిన ఈ అవార్డును ఇప్పటి వరకు పది మంది భారత క్రికెటర్లు (పంత్, అశ్విన్, భువనేశ్వర్, కోహ్లి, యశస్వి జైస్వాల్, సిరాజ్, అభిషేక్‌ శర్మ–ఒక్కోసారి... శ్రేయస్‌ అయ్యర్‌–2 సార్లు, బుమ్రా–2 సార్లు, శుబ్‌మన్‌ గిల్‌–4 సార్లు) గెల్చుకున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement