సాక్షి ప్రీమియర్‌ లీగ్‌ క్రికెట్‌ టోర్నీకి ఎంట్రీల ఆహ్వానం

Sakshi Premier League 2020-21 Entry Start

మీలో ప్రతిభ ఉందా...? మేము వెలుగులోకి తెస్తాం... మీలో ఉత్సాహం ఉందా? మేము అవకాశాలు కల్పిస్తాం... తెలుగు రాష్ట్రాల్లో ఔత్సాహిక క్రికెటర్లు సత్తా చాటుకోవడానికి సాక్షి మీడియా గ్రూప్‌ ఆధ్వర్యంలో సాక్షి ప్రీమియర్‌ లీగ్‌ (ఎస్‌పీఎల్‌) రెండో సీజన్‌కు రంగం సిద్ధమైంది. 2021 జనవరి మూడో వారంలో సాక్షి ప్రీమియర్‌ లీగ్‌ (ఎస్‌పీఎల్‌) క్రికెట్‌ టోర్నమెంట్‌ రెండో సీజన్‌ మొదలుకానుంది.

గత ఏడాది రెండు రాష్ట్రాల నుంచి మొత్తం 891 జట్లు బరిలోకి దిగాయి. ఆంధ్రప్రదేశ్‌ నుంచి సీనియర్‌ విభాగంలో ఎమరాల్డ్‌ డిగ్రీ కాలేజీ (తిరుపతి) విజేతగా... డాక్టర్‌ లంకపల్లి బుల్లయ్య కాలేజీ (విశాఖపట్నం) రన్నరప్‌గా నిలిచాయి. జూనియర్‌ విభాగంలో శివారెడ్డి ఐటీసీ (కడప) చాంపియన్‌గా... శాతవాహన జూనియర్‌ కాలేజీ (హరిపురం, శ్రీకాకుళం) రన్నరప్‌గా నిలిచాయి. తెలంగాణ నుంచి సీనియర్‌ విభాగంలో సర్దార్‌ పటేల్‌ డిగ్రీ కాలేజీ (సికింద్రాబాద్‌) విజేతగా... ఆదర్శ డిగ్రీ కాలేజీ (మహబూబ్‌నగర్‌) రన్నరప్‌గా నిలిచాయి. జూనియర్‌ విభాగంలో భవాన్స్‌ శ్రీ అరబిందో కాలేజీ చాంపియన్‌గా... ఎస్‌ఆర్‌ఆర్‌ కాలేజీ (మంచిర్యాల) రన్నరప్‌గా నిలిచాయి.

టోర్నీ ఫార్మాట్‌...
► ముందుగా జిల్లా స్థాయిలో నాకౌట్‌ పద్ధతిలో మ్యాచ్‌లు జరుగుతాయి. ఈ మ్యాచ్‌లను 10 ఓవర్లచొప్పున నిర్వహిస్తారు.  జిల్లా స్థాయి విజేత జట్లు ప్రాంతీయస్థాయి టోర్నీకి, ప్రాంతీయ స్థాయి టోర్నీ విజేత జట్లు రాష్ట్ర స్థాయి టోర్నీకి అర్హత సాధిస్తాయి. రాష్ట్రస్థాయి మ్యాచ్‌లను 20 ఓవర్ల చొప్పున నిర్వహిస్తారు. తెలంగాణలో ఉమ్మడి జిల్లాలే ప్రాతిపాదికగా ఎంట్రీలు స్వీకరిస్తారు.

ఎంట్రీ ఫీజు...
► ఈ టోర్నీలో పాల్గొనాలనుకునే జట్లు రూ. 1,500 ఎంట్రీ ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. ఎంట్రీ ఫీజును ఆన్‌లైన్‌లోనే చెల్లించాలి. ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ కోసం.... www.arenaone.in వెబ్‌సైట్‌లో లాగిన్‌ కావాలి. ఎంట్రీలను వచ్చే ఏడాది జనవరి 5వ తేదీలోగా పంపించాలి.

ఏ ఏ విభాగాల్లో...
► సాక్షి ప్రీమియర్‌ లీగ్‌ను రెండు కేటగిరీల్లో నిర్వహిస్తారు. అండర్‌–18 జూనియర్‌ స్థాయిలో (1–12–2002 తర్వాత జన్మించి ఉండాలి) ... అండర్‌–24 సీనియర్‌ స్థాయిలో (1–12–1996 తర్వాత జన్మించి ఉండాలి) వేర్వేరుగా నిర్వహిస్తారు. ఒక్కో కాలేజీ నుంచి గరిష్టంగా మూడు జట్లను పంపించే వెసులుబాటు ఉంది. మూడు జట్లు కూడా వేర్వేరుగా ఎంట్రీ ఫీజు చెల్లించాలి.

అమ్మాయిల కోసం కూడా...
ఈసారి సాక్షి ప్రీమియర్‌ లీగ్‌ టోర్నీలో మహిళా విభాగం మ్యాచ్‌లను కూడా నిర్వహించనున్నారు. మహిళా టోర్నీలో పాల్గొనేందుకు కనీస వయస్సు 12 ఏళ్లు. 1–12–2008 తర్వాత జన్మించిన అమ్మాయిలే అర్హులు. ఈ టోర్నీలో స్కూల్, కాలేజీ జట్లు పాల్గొనవచ్చు. మ్యాచ్‌లు రీజినల్‌ స్థాయిలో ప్రారంభమవుతాయి. రీజినల్‌ స్థాయి విజేత జట్లు రాష్ట్ర స్థాయి ఫైనల్స్‌ టోర్నీలో పాల్గొంటాయి. ఈ టోర్నీలో పాల్గొనేందుకు ఆసక్తి ఉన్న జట్లు ఆన్‌లైన్‌లో ఉచితంగా ఎంట్రీలు పంపించవచ్చు.

ఇతర వివరాలకు
99120 35299, 95055 14424, 96660 13544 ఫోన్‌ నంబర్లలో సంప్రదించాలి.

తెలంగాణలోని ఉమ్మడి జిల్లాలను మూడు జోన్‌లుగా విభజించారు
జోన్‌–1లో హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్,     మహబూబ్‌నగర్‌ జిల్లాలు ఉన్నాయి.
జోన్‌–2లో వరంగల్, ఖమ్మం, నల్లగొండ జిల్లాలు ఉన్నాయి.
జోన్‌–3లో నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్‌ జిల్లాలు ఉన్నాయి.

ముఖ్యమైన విషయం..
మ్యాచ్‌ సమయంలో ఆటగాళ్లు తమ కళాశాల గుర్తింపు కార్డు (ఒరిజినల్‌), వయసు ధ్రువీకరణకు సంబంధించి పదో తరగతి మార్కుల మెమో (ఒరిజినల్‌)ను నిర్వాహకులకు తప్పనిసరిగా చూపించాలి. మ్యాచ్‌ జరిగే సమయంలో బ్యాట్స్‌మెన్, వికెట్‌ కీపర్‌ తప్పనిసరిగా హెల్మెట్లు, లెగ్‌ ప్యాడ్‌లు, అండర్‌ గార్డ్స్, హ్యాండ్‌గ్లౌవ్స్, వైట్‌ డ్రెస్, వైట్‌ షూస్‌ ధరించాలి.  

గమనిక: అన్ని విషయాల్లో నిర్వాహకులదే తుది నిర్ణయం.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top