చరిత్ర సృష్టించిన సాయి సుదర్శన్‌.. ప్రపంచ రికార్డు | Sai Sudharsan Scripts History Becomes1st Player In The World To | Sakshi
Sakshi News home page

చరిత్ర సృష్టించిన సాయి సుదర్శన్‌.. ప్రపంచ రికార్డు

May 17 2026 1:15 PM | Updated on May 17 2026 1:24 PM

Sai Sudharsan Scripts History Becomes1st Player In The World To

గుజరాత్‌ టైటాన్స్‌ ఓపెనర్‌ సాయి సుదర్శన్‌ సరికొత్త చరిత్ర సృష్టించాడు. టీ20 ఫార్మాట్లో మూడు వేల పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. ఈ క్రమంలో ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్‌ షాన్‌ మార్ష్‌ పేరిట ఉన్న ఆల్‌టైమ్‌ రికార్డును సాయి బద్దలు కొట్టాడు.

ఐపీఎల్‌-2026లో భాగంగా కోల్‌కతా నైట్‌ రైడర్స్‌- గుజరాత్‌ టైటాన్స్‌ మధ్య శనివారం మ్యాచ్‌ జరిగిన సంగతి తెలిసిందే. ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా టాస్‌ గెలిచిన గుజరాత్‌ తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా నిర్ణీత 20 ఓవర్లలో కేవలం రెండు వికెట్లు నష్టపోయి 247 పరుగుల మేర భారీ స్కోరు సాధించింది.

మూడు అర్ధ శతకాలు
లక్ష్య ఛేదనలో గుజరాత్‌ ఓపెనర్లు సాయి సుదర్శన్‌, కెప్టెన్‌ శుబ్‌మన్‌ గిల్‌ మెరుగ్గా రాణించారు.  సాయి 28 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 53 పరుగులతో అజేయంగా నిలవగా.. గిల్‌ 49 బంతుల్లో 85 పరుగులు చేశాడు. మిగతావారిలో జోస్‌ బట్లర్‌ 35 బంతుల్లో 57 పరుగులు రాబట్టగలిగాడు.

అయితే, ఈ ముగ్గురి హాఫ్‌ సెంచరీలు గుజరాత్‌ను నిలబెట్టలేకపోయాయి. 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 218 పరుగులకే పరిమితమైన గుజరాత్‌.. 29 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్‌ సందర్భంగా సాయి సుదర్శన్‌ పొట్టి క్రికెట్‌లో మూడు వేల పరుగులు పూర్తి చేసుకున్నాడు.

అతి తక్కువ ఇన్నింగ్స్‌లోనే
ఈ క్రమంలో అత్యంత వేగంగా.. అంటే అతి తక్కువ ఇన్నింగ్స్‌లోనే టీ20 ఫార్మాట్లో ఈ మైలురాయిని చేరుకున్న క్రికెటర్‌ సాయి సుదర్శన్‌ చరిత్రకెక్కాడు. అంతకు ముందు ఆసీస్‌ స్టార్‌ షాన్‌ మార్ష్‌ 85 ఇన్నింగ్స్‌లో ఈ ఘనత సాధించగా.. సాయి సుదర్శన్‌ కేవలం 78 ఇన్నింగ్స్‌లోనే ఈ ఫీట్‌ అందుకోవడం విశేషం.

టీ20 ఫార్మాట్లో ఫాస్టెస్ట్‌ 3000 రన్స్‌ సాధించిన టాప్‌-5 క్రికెటర్లు
👉సాయి సుదర్శన్‌ (ఇండియా)- 78 ఇన్నింగ్స్‌లో
👉షాన్‌ మార్ష్‌ (ఆస్ట్రేలియా)- 85 ఇన్నింగ్స్‌లో
👉డిఆర్సీ షార్ట్‌ (ఆస్ట్రేలియా)- 86 ఇన్నింగ్స్‌లో
👉డెవాన్‌ కాన్వే (న్యూజిలాండ్‌)- 86 ఇన్నింగ్స్‌లో
👉క్రిస్‌ గేల్‌ (వెస్టిండీస్‌)- 87 ఇన్నింగ్స్‌లో

సాయి సుదర్శన్‌ టీ20 ఫార్మాట్‌ రికార్డు ఇదీ
ఐపీఎల్‌లో గుజరాత్‌ తరఫున ఇప్పటికి 53 మ్యాచ్‌లలో కలిపి సాయి సుదర్శన్‌ 2347 పరుగులు సాధించాడు. తమిళనాడు తరఫున దేశీ టీ20 టోర్నీలో 25 మ్యాచ్‌లలో 670 పరుగులు చేశాడు. ఇక టీమిండియా తరఫున ఒక మ్యాచ్‌ ఆడినప్పటికీ పరుగులేమీ రాబట్టలేకపోయాడు.

చదవండి: సెలక్టర్లు చెప్పినా నేను ద్రవిడ్‌ను జట్టు నుంచి తప్పించలేదు: గంగూలీ

Advertisement
 
Advertisement
Advertisement