
మాస్కో : వరల్డ్ రా పవర్ లిఫ్టింగ్ యూరోపియన్ చాంపియన్‌షిప్‌లో ఓ రష్యన్ పవర్ లిఫ్టర్ తీవ్రంగా గాయపడ్డాడు. రెండు వందలు, మూడు వందలు కాదు.. ఏకంగా 400 కిలోల బరువెత్తే ప్రయత్నంలో విఫలమై ప్రాణం మీదకు తెచ్చుకున్నాడు. మాస్కోలో వేదికగా జరిగిన ఈ వరల్డ్ రా పవర్ లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. డిఫెండింగ్ చాంపియన్ అలెగ్జాండర్ సెడిఖ్ స్క్వాట్‌లో అంత భారీ మొత్తాన్ని కాళ్లు వణుకుతుండగా అతికష్టమ్మీద భుజాల వరకు ఎత్తాడు. ఆపై బరువును తట్టుకోలేక కుప్పకూలాడు.
అదృష్టవశాత్తు బారెల్ వెనక్కి పడడంతో పెద్ద ప్రమాదం తప్పింది. అయితే ఈ ప్రమాదంలో సెడిఖ్ రెండు మోకాళ్లతో పాటు తొడ కండరాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించగా డాక్టర్లు దాదాపు 6 గంటల పాటు శ్రమించి విరిగిపోయిన రెండు కాళ్ల ఎముకలను, కండరాలను ఆపరేషన్ చేసి అతికించారు. ఈ ప్రమాదంతో అలెగ్జాండర్ రెండు నెలలపాటు మంచానికి పరిమితం కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. రష్యాలో 2019లో వరల్డ్ రా పవర్ లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లోనూ ఇలాంటి ఘటనే జరిగింది. 20 ఏళ్ల రడోస్కేవిచ్ మూడో ప్రయత్నంలో 250 కేజీల బరువెత్తబోయి గాయపడి కెరీర్‌కు స్వస్తిపలకాల్సి వచ్చింది.