IND Vs WI: కోహ్లి రికార్డు బద్దలు కొట్టిన రోహిత్‌ శర్మ.. తొలి భారత కెప్టెన్‌గా!

Rohit Sharma surpasses Virat Kohli to hit most sixes as India captain in T20Is - Sakshi

అంతర్జాతీయ టీ20ల్లో విరాట్‌ కోహ్లి అరుదైన రికార్డును భారత కెప్టెన్‌ రోహిత్‌ శర్మ బద్దలు కొట్టాడు. టీ20ల్లో అత్యధిక సిక్సర్లు బాదిన టీమిండియా కెప్టెన్‌గా రోహిత్‌ శర్మ రికార్డులకెక్కాడు. అంతకు ముందు ఈ అరుదైన ఫీట్‌ భారత మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి(59 సిక్స్‌లు) పేరిట ఉండేది. సెయింట్స్‌ కిట్స్‌ వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన మూడో టీ20లో రోహిత్‌ శర్మ ఈ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. టీమిండియా ఇన్నింగ్స్‌ సెకెండ్‌ ఓవర్‌ వేసిన జోసఫ్‌ బౌలింగ్‌లో సిక్స్‌ కొట్టిన రోహిత్‌(60 సిక్స్‌లు) ఈ ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు.

ఈ అరుదైన రికార్డు సాధించిన జాబితాలో రోహిత్‌ శర్మ 60 సిక్స్‌లతో అగ్రస్థానంలో ఉండగా.. కోహ్లి(59), దోని(34) వరుసగా రెండు మూడు స్థానాల్లో కొనసాగుతున్నారు. ఇక ఈ మ్యాచ్‌లో 11 పరుగుల వద్ద వెన్ను నొప్పి కారణంగా రోహిత్‌  రిటైర్డ్‌హర్ట్‌గా వెనుదిరిగాడు. ఇక మూడో టీ20లో వెస్టిండీస్‌పై భారత్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో టీమిండియా 2-1తో అధిక్యంలో ఉంది.

కాగా భారత విజయంలో ఓపెనర్‌ సూర్యకుమార్‌ యాదవ్‌  కీలక పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్‌లో సూర్య 44 బంతుల్లో  76 పరుగులు చేశాడు.అతడి ఇన్నింగ్స్‌లో 8 ఫోర్లు 4 సిక్స్‌లు ఉన్నాయి. సూర్యకుమార్‌ యాదవ్‌ అద్భుత ఇన్నింగ్స్‌ ఫలితంగా 165 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి 19 ఓవర్లలోనే ఛేదించింది. భారత బ్యాటర్లలో సూర్యతో పాటు పంత్‌(33)పరుగులతో రాణించాడు.

ఇక అంతకుముందు బ్యాటింగ్ చేసిన విండీస్‌ ఓపెనర్‌ కైల్‌ మైర్స్‌((50 బంతుల్లో 73; 8 ఫోర్లు, 4 సిక్స్‌లు) చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. భారత బౌలర్లలో భువనేశ్వర్‌ కుమార్‌ రెండు వికెట్లు,హార్దిక్‌ పాండ్యా, అర్షదీప్‌ సింగ్‌ తలా వికెట్‌ సాధించారు.  ఇక ఇరుజట్ల మధ్య నాలుగో టి20 శనివారం(ఆగస్టు 6న) జరగనుంది. 
చదవండి: India T20I Chasing Record: లక్ష్య ఛేదనలో టీమిండియా కొత్త రికార్డు..

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top