BCCI New President: గంగూలీకి బైబై! బీసీసీఐ 36వ అధ్యక్షుడిగా రోజర్‌ బిన్నీ

Roger Binny Appointed As BCCI President Succeed Sourav Ganguly - Sakshi

BCCI New President: భారత క్రికెట్‌ నియంత్రణ మండలి 36వ అధ్యక్షుడిగా టీమిండియా మాజీ ఆల్‌రౌండర్‌ రోజర్‌ బిన్నీ ఎంపికయ్యారు. భారత జట్టు మాజీ కెప్టెన్‌ సౌరవ్‌ గంగూలీ స్థానంలో బీసీసీఐ బాస్‌గా పగ్గాలు చేపట్టారు. ముంబైలోని తాజ్‌ హోటల్‌లో మంగళవారం జరిగిన సర్వసభ్య సమావేశం తర్వాత బోర్డు ఈ మేరకు ప్రకటన వెలువరించింది. కాగా ఈ సమావేశంలో సౌరవ్‌ గంగూలీ సహా బీసీసీఐ కార్యదర్శి జై షా, ఉపాధ్యక్షుడు రాజీవ్‌ శుక్లా, కోశాధికారి అరుణ్‌ ధుమాల్‌ తదితరులు పాల్గొన్నారు.

ఇక బీసీసీఐ అధ్యక్షుడిగా కొనసాగాలని గంగూలీ భావించినప్పటికీ విముఖత వ్యక్తం కావడంతో నామినేషన్‌ వేయలేదన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ పదవి కోసం నామినేషన్‌ దాఖలు చేసిన ఏకైక వ్యక్తిగా ఉన్న 67 ఏళ్ల రోజర్‌ బిన్నీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

ఆ ఘనత బిన్నీకే దక్కింది!
భారత క్రికెట్‌ జట్టుకు ప్రాతినిథ్యం వహించిన తొలి ఆంగ్లో ఇండియన్‌ రోజర్‌ బిన్నీ. ఆయన స్వస్థలం కర్ణాటకలోని బెంగళూరు. 1983 ప్రపంచకప్‌ గెలిచిన జట్టులో రోజర్‌ బిన్నీ సభ్యుడిగా ఉన్నారు.

ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో మొట్టమొదటిసారి భారత్‌ విశ్వవిజేతగా నిలవడంలో ఈ రైట్‌ ఆర్మ్‌ మీడియం పేసర్‌ది కీలక పాత్ర. ఆ ఎడిషన్‌లో 18 వికెట్లు తీసి వెలుగులోకి వచ్చారు. కాగా భారత్‌ తరఫున 27 టెస్టులాడి 47 వికెట్లు తీసిన రోజర్ బిన్నీ.. 72 వన్డేల్లో 77 వికెట్లు కూల్చారు. దేశవాళీ క్రికెట్‌లో కర్ణాటకు ప్రాతినిథ్యం వహించిన రోజర్‌ బిన్నీ.. ఆ రాష్ట్ర బోర్డు ప్రెసిడెంట్‌గా కూడా పనిచేశారు.

చదవండి: అధ్యక్షుడిగా రోజర్‌ బిన్నీనే ఎందుకు?.. ఈ ఆసక్తికర విషయాలు తెలుసా?

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top