పంత్‌ తొందరపడ్డావు.. రెండు రన్స్‌తో ఆగిపోవాల్సింది

Rishabh Pant Run Out After Terrible Mixup With Virat Kohli In 3rd T20  - Sakshi

అహ్మదాబాద్‌: ఇంగ్లండ్‌తో  మంగళవారం జరిగిన మూడో టీ20లో టీమిండియా వికెట్‌కీపర్‌ రిషబ్ పంత్ రనౌట్‌గా వెనుదిరిగిన సంగతి తెలిసిందే. సామ్‌ కరస్‌ వేసిన ఇన్నింగ్స్ 12వ ఓవర్ తొలి బంతిని పంత్‌ కవర్స్ దిశగా హిట్ చేసి సింగిల్ పూర్తి చేశాడు. ఆ తర్వాత కోహ్లి వేగంగా స్పందించడంతో అతి కష్టంగా రెండో పరుగును కూడా పూర్తి చేశాడు. ఈ దశలో ఫీల్డర్ మార్క్ వుడ్ బంతిని త్రో వేయగా.. దానిని అందుకున్న బట్లర్‌ వెనుకనుంచి విసరడంతో వికెట్లను తాకకుండా పక్కకు వెళ్లిపోయింది. ఇక్కడే పంత్‌ తొందరపడ్డాడు. రెండు పరుగులు చాలు అనుకొని ఉంటే పరిస్థితి వేరుగా ఉండేది.


నాన్‌ స్రైకింగ్‌ ఎండ్‌లో ఉన్న కోహ్లి పిలుపు అందుకొని ఏం ఆలోచించకుండా పంత్‌ క్రీజు దాటి సగం దూరం వచ్చేశాడు. అప్పటికే కోహ్లి అవతలి ఎండ్‌కు చేరుకోగా.. పంత్‌ మాత్రం వేగంగా చేరుకోలేకపోయాడు. రనౌట్‌ చేసే అవకాశం ఉండడంతో బట్లర్‌ వేగంగా స్పందించి సామ్‌ కరన్‌వైపు బంతిని త్రో వేయగా.. అతను క్షణం ఆలస్యం చేయకుండా వికెట్లు గిరాటేశాడు. దీంతో పంత్‌ డైవ్‌ చేసినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. వాస్తవానికి 24 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన దశలో క్రీజులోకి వచ్చిన పంత్‌ కోహ్లితో కలిసి మంచి ఇన్నింగ్స్‌ ఆడాడు. ఇద్దరి మధ్య 40 పరుగులకు పైగా భాగస్వామ్యం నమోదైంది. కోహ్లి కాల్‌తో మూడో పరుగు కోసం పంత్‌ పరిగెత్తకపోయి ఉంటే టీమిండియా ఆట మరో విధంగా ఉండేది. అయితే పంత్‌ రనౌట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. కెప్టెన్‌ కోహ్లి (46 బంతుల్లో 77 నాటౌట్‌; 8 ఫోర్లు, 4 సిక్సర్లు) వరుసగా రెండో అర్ధ సెంచరీ సాధించగా, మిగతా బ్యాట్స్‌మెన్‌ ప్రభావం చూపలేకపోయారు. ఇంగ్లండ్‌ బౌలర్లలో మార్క్‌ వుడ్‌కు 3 వికెట్లు దక్కాయి. అనంతరం ఇంగ్లండ్‌ 18.2 ఓవర్లలో 2 వికెట్లకు 158 పరుగులు చేసింది. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ బట్లర్‌ (52 బంతుల్లో 83 నాటౌట్‌; 5 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరిపించగా... బెయిర్‌స్టో (28 బంతుల్లో 40 నాటౌట్‌; 5 ఫోర్లు) అండగా నిలిచాడు. వీరిద్దరు మూడో వికెట్‌కు 77 పరుగులు జోడించారు. నాలుగో మ్యాచ్‌ రేపు జరుగుతుంది.  
చదవండి:
పంత్‌ కళ్లు చెదిరే సిక్స్‌‌.. ఈసారి ఆర్చర్‌ వంతు

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Author:
కె. రామచంద్రమూర్తి



 

Read also in:
Back to Top