పొట్టి క్రికెట్‌లో ఇటీవలికాలంలో 'రిటైర్డ్ ఔట్' అనే పదం తరుచూ వినిపిస్తుంది. రిటైర్డ్ ఔట్ అంటే ఆటగాడు ఇన్నింగ్స్ మధ్యలో గాయం కాని, అనారోగ్యానికి కాని గురి కాకుండానే పెవిలియన్‌కు చేరడం. సాధారణంగా ఎవరైనా ఆటగాడు గాయం లేదా అనారోగ్యానికి గురైతే రిటైర్డ్ హర్ట్ లేదా రిటైర్డ్ నాటౌట్‌గా పెవిలియన్‌కు చేరతారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రత్యర్థి కెప్టెన్ అనుమతిస్తే, ఆ ఆటగాడు తిరిగి బ్యాటింగ్ కొనసాగించవచ్చు.
కానీ, రిటైర్డ్ ఔట్ విషయంలో అలా కాదు. ఒక్కసారి ఆటగాడు ఈ కారణంగా క్రీజ్ వదిలితే తిరిగి బ్యాటింగ్‌కు దిగటానికి వీలుండదు. పొట్టి ఫార్మాట్లో కీలక సమయాల్లో బ్యాటర్లు నిదానంగా ఆడుతున్నప్పుడు రిటైర్డ్ ఔట్ అస్త్రాన్ని ప్రయోగిస్తుంటారు. వూహ్యాల్లో భాగంగా ఇలా జరుగుతుంటుంది.
అంతర్జాతీయ క్రికెట్‌లో రిటైర్డ్ ఔట్‌లు చాలా తక్కువగా నమోదైనప్పటికీ.. పొట్టి క్రికెట్‌లో, ముఖ్యంగా ఇటీవలికాలంలో ఈ తరహా ఔట్‌లు ఎక్కువుతున్నాయి. ప్రస్తుతం జరుగుతున్న మహిళల ఐపీఎల్ (WPL) 2026 ఎడిషన్‌లో రెండు రోజుల వ్యవధిలో ఇద్దర్లు బ్యాటర్లు రిటైర్డె్ ఔట్‌గా వెనుదిరిగారు.
గుజరాత్ జెయింట్స్ తరఫున అరంగేట్రం ప్లేయర్ ఆయుశ్ సోని, యూపీ వారియర్జ్ తరఫున హర్లీన్ డియోల్ గంటల వ్యవధిలో రిటైర్డ్ ఔట్‌గా పెవిలియన్‌కు చేరారు. ఈ ఇద్దరు నిదానంగా ఆడుతున్నారన్న కారణంగా వారి జట్టు మేనేజ్‌మెంట్ ఇలా చేసింది. రిటైర్డ్ ఔట్‌పై భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నప్పటికీ.. పొట్టి క్రికెట్‌లో ఇది చాలా ఉపయోగపడుతుంది.
ఎవరైనా బ్యాటర్ పరుగులు చేయడానికి ఇబ్బంది పడుతుంటే ఈ అస్త్రాన్ని ప్రయోగించి అతన్ని తప్పించి మరొకరికి అవకాశం ఇవ్వవచ్చు. మహిళల ఐపీఎల్‌లో రిటైర్డ్ ఔటైన తొలి ప్లేయర్ ఆయుశ్ సోని అయితే.. ఐపీఎల్‌లో ఈ తరహాలో ఔటైన తొలి ఆటగాడిగా రవిచంద్రన్ అశ్విన్ రికార్డుల్లోకెక్కాడు.
యాష్ 2022 ఎడిషన్‌లో లక్నోతో జరిగిన మ్యాచ్‌లో నిదానంగా ఆడుతున్నందుకు మేనేజ్‌మెంట్ అతన్ని రిటైర్డ్ ఔట్‌గా పెవిలియన్‌కు పిలిపించింది. ఇలాంటి ఉదంతాలే ఐపీఎల్‌లో మరో మూడు సందర్భాల్లో చోటు చేసుకున్నాయి.
2023 ఎడిషన్‌లో గుజరాత్ టైటాన్స్ బ్యాటర్ సాయి సుదర్శన్, అదే ఎడిషన్‌లో పంజాబ్ ఆటగాడు అథర్వ తైడే, 2025 ఎడిషన్‌లో ముంబై ఇండియన్స్ ఆటగాడు తిలక్ వర్మ రిటైర్డ్ ఔట్‌గా వెనుదిరిగారు. ఐపీఎల్‌లో రిటైర్డ్ ఔట్‌గా వెనుదిరిగిన ఆటగాళ్లు కేవలం నలుగురే అయినప్పటికీ.. ప్రపంచవాప్తంగా జరిగే వేర్వేరు లీగ్‌ల్లో ఈ సంఖ్య చాలా ఎక్కువగా ఉంది.
అంతర్జాతీయ క్రికెట్‌లోనూ పలువురు ఆటగాళ్లు ఈ తరహాలో ఔటయ్యారు. శ్రీలంకకు చెందిన మర్వన్ ఆటపట్టు, మహేళ జయవర్దనే (2001), భూటాన్‌కు చెందిన సోనం టోబ్‌గే (2019), నమీబియాకు చెందిన నికోలాస్ డావిన్ (2014) రిటైర్డ్ ఔట్‌గా పెవిలియన్‌కు చేరారు.
వీరిలో ఆటపట్టు, జయవర్దనే టెస్ట్ ఫార్మాట్‌లో, అదీ ఒకే మ్యాచ్‌లో (బంగ్లాదేశ్‌పై) రిటైర్డ్ ఔట్ కావడం విశేషం. ఆటపట్టు డబుల్ సెంచరీ పూర్తి చేశాక, జయర్దనే 150 పరుగులు పూర్తి చేశాక రిటైర్డ్ ఔటయ్యారు.
అంతర్జాతీయ టీ20ల్లో రిటైర్డ్ ఔటైన తొలి ఆటగాడు టోబ్‌గే అయితే.. టీ20 ప్రపంచకప్‌లో ఈ తరహా ఔటైన తొలి ఆటగాడిగా నికోలాస్ డావిన్ రికార్డుల్లోకెక్కాడు.


