Ajinkya Rahane: ఏమైపోయావు; రెండేళ్ల క్రితం హీరో.. ఇప్పుడు జీరో

Reasons Why BGT 2020-21 Hero Ajinkya Rahane Not Playing IND Vs AUS Series - Sakshi

Ajinkya Rahane.. 2020-21లో టీమిండియా ఆస్ట్రేలియా గడ్డపై సృష్టించిన చరిత్ర ఎవరు మరిచిపోలేరు. అజింక్యా రహానే సారధ్యంలో యువకులతో నిండిన జట్టు నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-1 తేడాతో నెగ్గి అతిగొప్ప విజయాన్ని నమోదు చేసింది. అప్పటి రెగ్యులర్‌ కెప్టెన్‌ కోహ్లి గైర్హాజరీ.. సీనియర్లు లేకపోవడంతో అసలు జట్టు ఏ మేరకు పోరాడుతుందోనన్న సందేహం కూడా తలెత్తింది.

కానీ అజింక్యా రహానే కెప్టెన్‌గా జట్టును ముందుండి నడిపించి టీమిండియాకు చారిత్రక విజయం కట్టబెట్టాడు. తొలి టెస్టులో టీమిండియా ఘోర పరాజయం తర్వాత మెల్‌బోర్న్‌లో భారత్‌ గెలవడం.. ఆపై సిడ్నీ వేదికగా జరిగిన మూడో టెస్టులో టీమిండియా కుర్రాళ్ల అసమాన పోరాటంతో మ్యాచ్‌ను డ్రా చేసుకోవడం.. గబ్బా వేదికగా జరిగిన చివరి టెస్టులో చారిత్రక విజయం సాధించడంతో పాటు సిరీస్‌ను కైవసం చేసుకుంది. దీంతో రహానే పేరు మార్మోగిపోయింది. భవిష్యత్తు కెప్టెన్‌ దొరికేశాడంటూ ఆకాశానికెత్తారు.

కట్‌చేస్తే.. మళ్లీ రెండేళ్ల తర్వాత ఆస్ట్రేలియా భారత పర్యటనకు వచ్చింది.  అదే బోర్డర్‌-గావస్కర్‌ ట్రోఫీ. కానీ రెండేళ్ల క్రితం చరిత్ర సృష్టించిన జట్టును నడిపించిన రహానే ఇప్పుడు జట్టులో లేడు. ఫామ్‌ కోల్పోయి జట్టుకు దూరమైన రహానే ప్రస్తుతం రంజీ క్రికెట్‌లో బిజీగా ఉన్నాడు. మంచి ఇన్నింగ్స్‌లతో ఆకట్టుకున్నప్పటికి రహానేకు మళ్లీ జాతీయ జట్టు నుంచి పిలుపు రాలేదు. దీని వెనుక ఒక కారణం ఉంది. శుబ్‌మన్‌ గిల్‌, సూర్యకుమార్‌ యాదవ్‌, శ్రేయాస్‌ అయ్యర్‌ లాంటి యంగ్‌ టాలెంటెడ్‌ ప్లేయర్స్‌ ప్రస్తుతం అన్ని ఫార్మాట్లలో కీలకంగా ఎదిగే ప్రయత్నంలో ఉన్నారు.

కొన్నేళ్లపాటు పుజారాతో పాటు అజింక్యా రహానేకు టీమిండియా టెస్టు జట్టులో కచ్చితంగా స్థానం ఉండేది. మధ్యలో పుజారా, రహానేలు ఇద్దరు ఫామ్‌ కోల్పోయి జట్టులో స్థానం కోల్పోయారు. పుజారా కౌంటీల్లో ఆడి వరుస శతకాలతో అలరించి జట్టులోకి రీఎంట్రీ ఇచ్చాడు. ఇటీవలే బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లోనూ పుజారా కీలక ఇన్నింగ్స్‌లతో ఆకట్టకున్నాడు. కానీ రహానే పరిస్థితి కాస్త రివర్స్‌గా ఉంది. బ్యాటింగ్‌లో కొన్ని మంచి ప్రదర్శనలు చేసినప్పటికి పుజారాల స్థిరమైన ఇన్నింగ్స్‌లు ఆడడంలో చతికిలపడ్డాడు. 

రెండేళ్ల క్రితం రహానే సారధ్యంలో ఆస్ట్రేలియా గడ్డపై టీమిండియా టెస్టు సిరీస్‌ విజయం అందుకోగానే పొగడ్తలతో ముంచెత్తారు. ఇక రహానే స్థానానికి ఢోకా లేదని అంతా భావించారు. కానీ కాలం ఎప్పుడు ఒకేలా ఉండదని మరోసారి నిరూపితమైంది. రెండేళ్ల క్రితం ఆసీస్‌ గడ్డపై హీరోగా నిలిచిన రహానే రెండేళ్ల తర్వాత జీరోగా మిగిలిపోయాడు. ఫామ్‌లో లేక జట్టులో చోటు కోల్పోయిన రహానేను తలుచుకున్న టీమిండియా అభిమానులు.. ''రెండేళ్ల క్రితం ఆసీస్‌ గడ్డపై కెప్టెన్‌గా చరిత్ర సృష్టించి హీరో అయ్యావు.. ఇప్పుడు మాత్రం జీరో అయ్యావు.. ఏమైపోయావు రహానే'' అంటూ తెగ బాధపడుతున్నారు.

ద్రవిడ్‌, వీవీఎస్‌ లక్ష్మణ్‌ల తర్వాత పుజారా, రహానేల ద్వయానికి మంచి పేరొచ్చింది. టెస్టు స్పెషలిస్ట్‌గా పుజారా ముద్ర వేయించుకున్నప్పటికి.. రహానే మాత్రం కెరీర్‌ ఆరంభంలో పరిమిత ఓవర్ల క్రికెట్‌ ఆడాడు. ఆ తర్వాత రహానే కూడా క్రమంగా టెస్టులకే పరిమితమయ్యాడు. మిడిలార్డర్‌లో కోహ్లి, పుజారాలతో కలిసి ఎన్నో విలువైన భాగస్వామ్యాలు నిర్మించిన రహానే పలు మ్యాచ్‌ల్లో టీమిండియా గెలవడంలో కీలకపాత్ర పోషించాడు. 34 ఏళ్ల వయసున్న రహానే ఇక జట్టులోకి రావడం కష్టమే అనిపిస్తుంది. అయితే బ్యాటింగ్‌లో అదరగొట్టి మునుపటి ఫామ్‌ను అందుకున్నా మహా అయితే మరో రెండేళ్లు మాత్రం ఆడగలడేమో. ఇక టీమిండియా తరపున రహానే 82 టెస్టుల్లో 4931 పరుగులు, 90 వన్డేల్లో 2962 పరుగులు సాధించాడు.

చదవండి: 'ఓరి మీ వేశాలో.. కాస్త ఎక్కువైనట్టుంది!'

అలా సెలెక్టర్‌ అయ్యాడో లేదో రిటైర్మెంట్‌ ఇచ్చాడు

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top