నాదల్‌ జోరు

Rafael Nadal enters quarterfinals of Australian Open Tennis - Sakshi

ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో 13వసారి క్వార్టర్‌ ఫైనల్‌ చేరిన స్పెయిన్‌ స్టార్‌

ప్రిక్వార్టర్‌ ఫైనల్లో 17వ ర్యాంకర్‌ ఫాగ్‌నినిపై అలవోక విజయం

మహిళల సింగిల్స్‌లో ఐదో సీడ్‌ స్వితోలినాకు చుక్కెదురు

మెల్‌బోర్న్‌: పురుషుల టెన్నిస్‌లో అత్యధిక గ్రాండ్‌స్లామ్‌ టైటిల్స్‌ గెలిచిన ప్లేయర్‌గా రికార్డు నెలకొల్పే దిశగా రాఫెల్‌ నాదల్‌ దూసుకెళ్తున్నాడు. ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో ఈ స్పెయిన్‌ టెన్నిస్‌ స్టార్‌ 13వసారి క్వార్టర్‌ ఫైనల్లోకి ప్రవేశించాడు. సోమవారం జరిగిన ఏకపక్ష ప్రిక్వార్టర్‌ ఫైనల్లో రెండో ర్యాంకర్‌ నాదల్‌ 6–3, 6–4, 6–2తో ప్రపంచ 17వ ర్యాంకర్‌ ఫాబియో ఫాగ్‌నిని (ఇటలీ)పై గెలుపొందాడు. 2015 యూఎస్‌ ఓపెన్‌లో నాదల్‌ను ఓడించి సంచలనం సృష్టించిన ఫాగ్‌నిని ఈసారి మాత్రం చేతులెత్తేశాడు.

2 గంటల 16 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో ఏదశలోనూ ఫాగ్‌నినికి అవకాశం ఇవ్వని నాదల్‌ ఆరు ఏస్‌లు సంధించి, ఆరు బ్రేక్‌ పాయింట్లు సాధించాడు. క్వార్టర్‌ ఫైనల్లో ఐదో సీడ్‌ సిట్సిపాస్‌ (గ్రీస్‌)తో నాదల్‌ ఆడతాడు. ప్రిక్వార్టర్‌ ఫైనల్లో సిట్సిపాస్‌కు తన ప్రత్యర్థి, తొమ్మిదో సీడ్‌ బెరెటిని (ఇటలీ) నుంచి వాకోవర్‌ లభించింది. రష్యా యువ స్టార్‌ ఆటగాళ్లు మెద్వెదేవ్, రుబ్లెవ్‌ కూడా క్వార్టర్‌ ఫైనల్‌ బెర్త్‌లు ఖరారు చేసుకున్నారు. ప్రిక్వార్టర్‌ ఫైనల్లో నాలుగో సీడ్‌ మెద్వెదేవ్‌ 6–4, 6–2, 6–3తో మెక్‌డొనాల్డ్‌ (అమెరికా)పై నెగ్గగా... ఏడో సీడ్‌ రుబ్లెవ్‌ 6–2, 7–6 (7/3)తో కాస్పెర్‌ రూడ్‌ (నార్వే)ను ఓడించాడు. రెండు సెట్‌లు ముగిశాక గాయం కారణంగా రూడ్‌ మ్యాచ్‌ నుంచి వైదొలిగాడు.

యాష్లే బార్టీ దూకుడు...
మహిళల సింగిల్స్‌ విభాగంలో టాప్‌ సీడ్, ప్రపంచ నంబర్‌వన్‌ యాష్లే బార్టీ (ఆస్ట్రేలియా) క్వార్టర్‌ ఫైనల్‌ చేరగా... ఐదో సీడ్‌ ఎలీనా స్వితోలినా (ఉక్రెయిన్‌)కు అమెరికా యువతార జెస్సికా పగూలా షాక్‌ ఇచ్చింది. బార్టీ 6–3, 6–4తో షెల్బీ రోజర్స్‌ (అమెరికా)పై గెలుపొందగా... జెస్సికా పగూలా 6–4, 3–6, 6–3తో స్వితోలినాను బోల్తా కొట్టించి కెరీర్‌లో తొలిసారి ఓ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలో క్వార్టర్‌ ఫైనల్‌ చేరింది. ఇతర ప్రిక్వార్టర్‌ ఫైనల్స్‌లో కరోలినా ముకోవా (చెక్‌ రిపబ్లిక్‌) 7–6 (7/5), 7–5తో ఎలీజ్‌ మెర్‌టెన్స్‌ (బెల్జియం)పై, జెన్నిఫర్‌ బ్రేడీ (అమెరికా) 6–1, 7–5తో డొనా వెకిచ్‌ (క్రొయేషియా)పై నెగ్గారు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top