ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో నాదల్‌ దూకుడు | Rafael Nadal beats Cameron Norrie to reach fourth round | Sakshi
Sakshi News home page

ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో నాదల్‌ దూకుడు

Feb 14 2021 5:21 AM | Updated on Feb 14 2021 10:14 AM

Rafael Nadal beats Cameron Norrie to reach fourth round - Sakshi

మెల్‌బోర్న్‌: కెరీర్‌లో 21వ గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ లక్ష్యంగా ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో బరిలోకి దిగిన స్పెయిన్‌ టెన్నిస్‌ స్టార్, ప్రపంచ రెండో ర్యాంకర్‌ రాఫెల్‌ నాదల్‌ ఆ దిశగా మరో అడుగు ముందుకేశాడు. పురుషుల సింగిల్స్‌ మూడో రౌండ్‌ మ్యాచ్‌లో నాదల్‌ 7–5, 6–2, 7–5తో కామెరూన్‌ నోరి (బ్రిటన్‌)పై వరుస సెట్‌లలో గెలిచి ప్రిక్వార్టర్‌ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. ఇప్పటి వరకు 16 సార్లు ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో ఆడిన నాదల్‌ 14 సార్లు కనీసం ప్రిక్వార్టర్‌ ఫైనల్‌ చేరడం విశేషం.

నోరితో 2 గంటల 14 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో నాదల్‌ ఏడు ఏస్‌లు సంధించి కేవలం ఒక డబుల్‌ ఫాల్ట్‌ చేశాడు. ఐదుసార్లు ప్రత్యర్థి సర్వీస్‌ను బ్రేక్‌ చేసిన నాదల్‌ తన సర్వీస్‌ను ఒకసారి మాత్రమే కోల్పోయాడు. ప్రిక్వార్టర్‌ ఫైనల్లో 16వ ర్యాంకర్‌ ఫాబియో ఫాగ్‌నిని (ఇటలీ)తో నాదల్‌ ఆడతాడు. ముఖాముఖి పోరులో నాదల్‌ 12–4తో ఆధిక్యంలో ఉన్నాడు. గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ ల్లో మాత్రం వీరిద్దరు రెండుసార్లు తలపడ్డారు. ఒక్కోసారి గెలిచారు. మూడో రౌండ్‌లో ఫాగ్‌నిని 6–4, 6–3, 6–4తో అలెక్స్‌ డిమినార్‌ (ఆస్ట్రేలియా)పై గెలిచాడు.  

మెద్వెదేవ్‌ ఎట్టకేలకు...
పురుషుల సింగిల్స్‌లో నాలుగో సీడ్‌ మెద్వెదేవ్‌ (రష్యా), ఐదో సీడ్‌ సిట్సిపాస్‌ (గ్రీస్‌), ఏడో సీడ్‌ రుబ్లెవ్‌ (రష్యా), తొమ్మిదో సీడ్‌ బెరెటిని (ఇటలీ) కూడా ప్రిక్వార్టర్‌ ఫైనల్లోకి ప్రవేశించారు. మూడో రౌండ్‌ మ్యాచ్‌లో మెద్వెదేవ్‌ 6–3, 6–3, 4–6, 3–6, 6–0తో ఫిలిప్‌ క్రాయినోవిచ్‌ (సెర్బియా)ను ఓడించాడు. తద్వారా గ్రాండ్‌స్లామ్‌ టోర్నీల్లో ఐదు సెట్‌లపాటు జరిగిన మ్యాచ్‌ల్లో తన ఖాతాలో తొలి విజయాన్ని జమ చేసుకున్నాడు. గతంలో మెద్వెదేవ్‌ ఆరుసార్లు ఐదు సెట్‌లపాటు జరిగిన మ్యాచ్‌ల్లో ఓటమి చవిచూశాడు. సిట్సిపాస్‌ 6–4, 6–1, 6–1తో మికెల్‌ వైమెర్‌ (స్వీడన్‌)పై, రుబ్లెవ్‌ 7–5, 6–2, 6–3తో ఫెలిసియానో లోపెజ్‌ (స్పెయిన్‌)పై, బెరెటిని 7–6 (7/1), 7–6 (7/5), 7–6 (7/5)తో ఖచనోవ్‌ (రష్యా)పై గెలిచారు.  

యాష్లే బార్టీ జోరు
మహిళల సింగిల్స్‌ విభాగంలో ప్రపంచ నంబర్‌వన్, టాప్‌ సీడ్‌ యాష్లే బార్టీ (ఆస్ట్రేలియా), ఐదో సీడ్‌ స్వితోలినా (ఉక్రెయిన్‌) ప్రిక్వార్టర్‌ ఫైనల్‌ చేరగా... ఆరో సీడ్‌ కరోలినా ప్లిస్కోవా (చెక్‌ రిపబ్లిక్‌), 11వ సీడ్‌ బెలిండా బెన్సిచ్‌ (స్విట్జర్లాండ్‌) మూడో రౌండ్‌లోనే ఇంటిదారి పట్టారు. యాష్లే బార్టీ 6–2, 6–4తో అలెగ్జాండ్రోవా (రష్యా)పై, స్వితోలినా 6–4, 6–0తో పుతింత్‌సెవా (కజకిస్తాన్‌)పై నెగ్గారు. ప్లిస్కోవా 5–7, 5–7తో కరోలినా ముకోవా (చెక్‌ రిపబ్లిక్‌) చేతిలో... బెన్సిచ్‌ 2–6, 1–6తో ఎలీజ్‌ మెర్‌టెన్స్‌ (బెల్జియం) చేతిలో ఓటమి పాలయ్యారు. ముకోవాతో గంటా 54 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో ప్రపంచ మాజీ నంబర్‌వన్‌ ప్లిస్కోవా ఏకంగా పది డబుల్‌ ఫాల్ట్‌లు, 40 అనవసర తప్పిదాలు చేసింది.  

ముగిసిన భారత్‌ పోరు
ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో భారత క్రీడాకారుల పోరాటం ముగిసింది. మిక్స్‌డ్‌ డబుల్స్‌లో రోహన్‌ బోపన్న (భారత్‌)–యింగ్‌యింగ్‌ దువాన్‌ (చైనా) జంట తొలి రౌండ్‌లోనే ఇంటిముఖం పట్టింది. 63 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో బోపన్న–యింగ్‌యింగ్‌ ద్వయం 4–6, 4–6తో బెథానీ మాటెక్‌ సాండ్స్‌ (అమెరికా)–జేమీ ముర్రే (బ్రిటన్‌) జోడీ చేతిలో ఓడిపోయింది. దాంతో ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో బరిలోకి దిగిన భారత ఆటగాళ్లందరూ తొలి రౌండ్‌ను దాటకుండానే వెనుదిరిగారు. పురుషుల సింగిల్స్‌లో సుమీత్‌ నాగల్‌... పురుషుల డబుల్స్‌లో రోహన్‌ బోపన్న, దివిజ్‌ శరణ్, మహిళల డబుల్స్‌లో అంకిత రైనా జోడీలు తొలి రౌండ్‌లోనే నిష్క్రమించాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement