భారత చెస్ సంచలనం, 20 ఏళ్ల యువ గ్రాండ్‌మాస్టర్ ఆర్ ప్రజ్ఞానంద అంతర్జాతీయ వేదికపై మరోసారి సత్తాచాటాడు. ప్రతిష్టాత్మక నార్వే చెస్ (Norway Chess) టోర్నమెంట్ విజేతగా ప్రజ్ఞానంద నిలిచాడు. చివరి రౌండ్‌లో జర్మనీ క్రీడాకారుడు విన్సెంట్ కీమర్‌ను మట్టికరిపించి ఛాంపియన్‌షిప్ కిరీటాన్ని కైవసం చేసుకున్నాడు. తద్వారా నార్వే చెస్ టైటిల్‌ను గెలుచుకున్న మొట్టమొదటి భారతీయుడిగా ప్రజ్ఞానంద చరిత్ర సృష్టించాడు.
అద్భుతమైన కమ్‌బ్యాక్
ప్రజ్ఞానంద సాధించిన ఈ విజయం చాలా ప్రత్యేకమైనది. టోర్నీ ఆరంభంలో అతడు తడబడ్డాడు. దీంతో అతడి కథ ముగిసిందని అంతా భావించారు. కానీ టోర్నీ చివరి దశలో అతడు పుంజుకున్న తీరు నిజంగా ఒక అద్భుతమనే చెప్పాలి.
పదో రౌండ్ ప్రారంభానికి ముందు 15 పాయింట్లతో ప్రజ్ఞానంద ముందు వరుసలో నిలిచాడు. చివరి రౌండ్ ఆరంభానికి ముందు టైటిల్ కోసం ప్రజ్ఞానంద, వెస్లీ సో (అమెరికా), అలీరెజా ఫిరౌజ్జా (ఫ్రాన్స్) మధ్య పోటీ నెలకొంది. చివరి రౌండ్‌లో వెస్లీ సో, అలీరెజా ఫిరౌజ్జాపై 'అర్మగెడాన్' టై బ్రేకర్ మ్యాచ్‌లో విజయం సాధించి తన టైటిల్ ఆశలను సజీవంగా ఉంచుకున్నాడు.

కానీ ప్రజ్ఞానంద మెయిన్ క్లాసికల్ మ్యాచ్‌లో విన్సెంట్ కీమర్‌ను ఓడించడంతో.. ఈ తమిళనాడు కుర్రాడుకి వెస్లీ సో కంటే ఎక్కువ పాయింట్లు వచ్చాయి. దీంతో 18 పాయింట్లతో వెస్లీ(17)ను వెనక్కి నెట్టి ప్రజ్ఞానంద నార్వే చెస్ ఛాంపియన్‌గా అవతరించాడు. కాగా ఏడుసార్లు నార్వే చెస్ టోర్నీ విజేతగా నిలిచిన ప్రపంచ నంబర్ 1 మాగ్నస్ కార్ల్‌సన్‌ను ప్రజ్ఞానంద రెండుసార్లు ఓడించడం గమనార్హం.
🇮🇳 PRAGG WINS NORWAY CHESS 2026
From last place in round 6, and 4 back-to-back wins, he finishes first 🤯🤯#NorwayChess pic.twitter.com/J0XbX91NQ4— Norway Chess (@NorwayChess) June 5, 2026
ప్రముఖల అభినందనలు
నార్వే చెస్ టోర్నమెంట్ విజేతగా నిలిచిన గ్రాండ్ మాస్టర్ ప్రజ్ఞానందకు ఉపరాష్ట్రపతి సి. పి. రాధాకృష్ణన్, ప్రధాని నరేంద్ర మోదీ, తమిళనాడు ముఖ్యమంత్రి జోసఫ్ విజయ్ తదితరులు అభినందనలు తెలిపారు. భవిష్యత్తులోనూ మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.


