
భారత వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ నిన్న (ఆగస్ట్ 27) ఐపీఎల్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇదివరకే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన అతడు.. భారత క్రికెట్‌తో తన బంధాన్ని పూర్తిగా తెంచుకున్నాడు. ఐపీఎల్ రిటైర్మెంట్ తర్వాత అశ్విన్ ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.
ఇంగ్లండ్ వేదికగా జరిగే హండ్రెడ్ లీగ్‌లో ఆడేందుకు ప్రణాళికలు సిద్దం చేసుకున్నాడని సమాచారం. అలాగే ఆస్ట్రేలియా, వెస్టిండీస్, దక్షిణాఫ్రికా దేశాల్లో జరిగే టీ20 లీగ్‌ల్లో కూడా పాల్గొనాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. ఈ మేరకు పలు ఫ్రాంచైజీలతో సంప్రదింపులు జరుగుతున్నాయట.
బీసీసీఐ నియమాల ప్రకారం.. భారత ఆటగాళ్లు అంతర్జాతీయ క్రికెట్‌తో పాటు ఐపీఎల్‌కు కూడా రిటైర్మెంట్ ప్రకటిస్తేనే విదేశీ లీగ్‌ల్లో ఆడే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం అశ్విన్‌కు భారత క్రికెట్‌తో కాని, ఐపీఎల్‌తో కాని సంబంధాలు లేవు. కాబట్టి యాష్‌కు విదేశీ లీగ్‌ల్లో ఆడేందుకు లైన్ క్లియర్ అయ్యింది. విదేశీ లీగ్‌ల్లో పాల్గొనాలనుకునే విషయాన్ని అశ్విన్ తన ఐపీఎల్ రిటైర్మెంట్ సందేశంలో పరోక్షంగా ప్రస్తావించాడు.
37 ఏళ్ల ఆశ్విన్ 2009లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఐపీఎల్ అరంగేట్రం చేసి, 2025లో అదే ఫ్రాంచైజీ తరఫున తన చివరి మ్యాచ్ ఆడాడు. ఐపీఎల్ కెరీర్‌లో మొత్తం 221 మ్యాచ్‌లు ఆడి 187 వికెట్లు తీశాడు. సీఎస్‌కేతో రెండు టైటిళ్లు సాధించాడు. పంజాబ్, ఢిల్లీ, రాజస్థాన్ వంటి జట్లకు సేవలందించారు. కొన్ని మ్యాచ్‌ల్లో పంజాబ్‌కు కెప్టెన్‌గానూ వ్యవహరించాడు. 16 సంవత్సరాల పాటు ఐపీఎల్‌లో తన మాయాజాలాన్ని ప్రదర్శించిన అశ్విన్.. త్వరలో విదేశీ లీగ్‌ల్లో కూడా సత్తా చాటేందుకు రెడీ అయ్యాడు.