ఎవరితోనూ, ఎలాంటి విభేదాలు లేవు: పీవీ సింధు

PV Sindhu Denies Reports Of Rift With Family - Sakshi

అసత్య కథనాలను కొట్టిపడేసిన పీవీ సింధు

సాక్షి, హైదరాబాద్‌: తన గురించి ప్రసారమవుతున్న కథనాలపై బ్యాడ్మింటన్‌ వరల్డ్‌ చాంపియన్‌ పూసర్ల వెంకట (పీవీ) సింధు స్పందించారు. తన తల్లిదండ్రుల అంగీకారంతోనే లండన్‌కు వెళ్లానని, అదే విధంగా కోచ్‌ పుల్లెల గోపీచంద్‌తో తనకు ఎలాంటి భేదాభిప్రాయాలు లేవని స్పష్టం చేశారు. అసత్య కథనాలు ప్రచారం చేయడం మానుకోవాలని, లేనిపక్షంలో చట్టపరమైన చర్యలకు సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు. కాగా పీవీ సింధు ప్రస్తుతం లండన్‌లో ఉన్న సంగతి తెలిసిందే. ఫిట్‌నెస్‌పై మరింతగా దృష్టి సారించిన ఆమె, జీఎస్‌ఎస్‌ఐ(గటోరెడ్‌ స్పోర్ట్స్‌ సైన్స్‌ ఇన్‌స్టిట్యూట్‌)తో కలిసి పనిచేస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను ఇటీవల సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. (చదవండి: 2021లోనే కోర్టులోకి...)

ఈ నేపథ్యంలో సింధు నేషనల్‌ క్యాంపును వీడి యూకేకు వెళ్లారని, కుటుంబంతో తలెత్తిన విభేదాల కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నారంటూ ఓ జాతీయ మీడియా కథనం ప్రచురించింది. ఈ వార్తలను తీవ్రంగా ఖండించిన సింధు, మంగళవారం ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా రూమర్లకు చెక్‌ పెట్టారు. ‘‘న్యూట్రిషియన్‌, రికవరీ నీడ్స్‌ కోసం కొన్ని రోజుల క్రితం నేను లండన్‌కు వచ్చాను. నా తల్లిదండ్రుల అనుమతితోనే ఇక్కడకు వచ్చాను. కుటుంబంతో నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. నా మంచి కోసం ఎన్నెన్నో త్యాగాలు చేసి, నన్ను ఈ స్థాయికి తీసుకువచ్చిన వాళ్లతో నాకు సమస్యలు ఎందుకు వస్తాయి. నా కుటుంబంతో నాకు మంచి అనుబంధం ఉంది. వాళ్ల సపోర్టు నాకు ఉంది. రోజూ నా కుటుంబ సభ్యులతో ఫోన్‌లో మాట్లాడుతూనే ఉన్నాను. అంతేకాదు నా కోచ్‌ మిస్టర్‌ గోపీచంద్‌ లేదా అకాడమీలోని సౌకర్యాల విషయంలో కూడా ఎలాంటి ఇబ్బంది లేదు’’ అని స్పష్టం చేశారు. అదే విధంగా వాస్తవాలు తెలుసుకోకుండా అసత్యాలు ప్రచారం చేస్తే, ఉపేక్షించే ప్రసక్తే లేదని హెచ్చరించారు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top