సింధు నిరీక్షణకు తెర | PV Sindhu Clinch Syed Modi International 2022 Womens Single Title | Sakshi
Sakshi News home page

సయ్యద్‌ మోదీ ఓపెన్‌ 2022: ఉమెన్స్‌ సింగిల్స్‌ విజేత పీవీ సింధు

Jan 23 2022 3:51 PM | Updated on Jan 24 2022 5:42 AM

PV Sindhu Clinch Syed Modi International 2022 Womens Single Title - Sakshi

లక్నో: రెండు సంవత్సరాల ఐదు నెలల నిరీక్షణకు తెర దించుతూ భారత స్టార్‌ షట్లర్‌ పూసర్ల వెంకట (పీవీ) సింధు మరో అంతర్జాతీయ టైటిల్‌ను సొంతం చేసుకుంది. ఆదివారం ముగిసిన సయ్యద్‌ మోదీ ఓపెన్‌ సూపర్‌–300 టోర్నీలో టాప్‌ సీడ్‌ సింధు మహిళల సింగిల్స్‌ విభాగంలో విజేతగా నిలిచింది. భారత్‌కే చెందిన మాళవిక బన్సోద్‌తో 35 నిమిషాలపాటు జరిగిన ఫైనల్లో సింధు 21–13, 21–16తో గెలిచింది.

2019 ఆగస్టులో ప్రపంచ చాంపియన్‌షిప్‌లో టైటిల్‌ సాధించిన తర్వాత సింధు గెలిచిన మరో అంతర్జాతీయ టైటిల్‌ ఇదే కావడం విశేషం. చాంపియన్‌గా నిలిచిన సింధుకు 11,250 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 8 లక్షల 55 వేలు), 7000 ర్యాంకింగ్‌ పాయింట్లు లభించాయి. సయ్యద్‌ మోదీ ఓపెన్‌లో సింధు విజేతగా నిలువడం ఇది రెండోసారి. 2017లోనూ సింధు ఈ టోర్నీలో చాంపియన్‌గా నిలిచింది.  

రన్నరప్‌ గాయత్రి జోడీ
మహిళల డబుల్స్‌ విభాగంలో పుల్లెల గాయత్రి–త్రిషా జాలీ (భారత్‌) జంట రన్నరప్‌గా నిలిచింది. ఫైనల్లో గాయత్రి–త్రిషా ద్వయం 12–21, 13–21తో అనా చింగ్‌ యిక్‌ చియోంగ్‌–తియో మె జింగ్‌ (మలేసియా) జోడీ చేతిలో ఓడిపోయింది. పురుషుల డబుల్స్‌ ఫైనల్లో పంజాల విష్ణువర్ధన్‌ గౌడ్‌–గారగ కృష్ణ ప్రసాద్‌ (భారత్‌) ద్వయం 18–21, 15–21తో మాన్‌ వె చోంగ్‌–కయ్‌ వున్‌ తీ (మలేసియా) జంట చేతిలో ఓటమి చవిచూసి రన్నరప్‌ ట్రోఫీతో సరిపెట్టుకుంది. మిక్స్‌డ్‌ డబుల్స్‌ ఫైనల్లో ఇషాన్‌ భట్నాగర్‌–తనీషా క్రాస్టో (భారత్‌) జంట 21–16, 21–12తో హేమ నాగేంద్ర బాబు–గురజాడ శ్రీవేద్య (భారత్‌) జోడీపై నెగ్గి టైటిల్‌ దక్కించుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement