IPL 2026: పంజాబ్‌ ‘కింగ్స్‌’ అయ్యేనా? | Punjab Kings Will Become Champion For IPL 2026 | Sakshi
Sakshi News home page

IPL 2026: పంజాబ్‌ ‘కింగ్స్‌’ అయ్యేనా?

Mar 21 2026 3:00 PM | Updated on Mar 21 2026 3:23 PM

Punjab Kings Will Become Champion For IPL 2026

ఐపీఎల్‌ చరిత్రలో ఒక్కసారి కూడా టైటిల్‌ గెలవలేకపోవడం పంజాబ్‌ కింగ్స్‌ నిలకడలేని ఫామ్‌ను ఎత్తి చూపుతోంది. ఐపీఎల్‌ ప్రారంభ సీజన్‌ ప్లేఆఫ్స్‌కు చేరిన పంజాబ్‌ కింగ్స్‌ (అప్పటి కింగ్స్‌ ఎలెవెన్‌ పంజాబ్‌) మళ్లీ 2014 ఐపీఎల్‌ సీజన్‌లో ఫైనల్‌ ఆడింది.  ఆ సీజన్‌లో కేకేఆర్‌ చేతిలో ఓడిన పంజాబ్‌ రన్నరప్‌కే పరిమితమైంది.  ఆ తర్వాత మళ్లీ 11 ఏళ్లకు కానీ ఆ జట్టు ఫైనల్లో అడుగుపెట్టలేకపోయింది. అప్పుడు కేకేఆర్‌ అడ్డు తగిలితే ఈసారి ఆర్సీబీ పంజాబ్‌ను అడ్డుకుంది. అయితే, గత సంవత్సరం జట్టును సమూలంగా ప్రక్షాళించడం పంజాబ్‌కు కలిసి వచ్చింది. ముఖ్యంగా శ్రేయాస్‌ అయ్యర్‌ను భారీ ధరకు దక్కించుకుంది. 

అంతేకాదు అతడికి జట్టు పగ్గాలు అప్పగించింది. తనపై వెచ్చించిన మొత్తానికి, ఫ్రాంచైజీ యాజమాన్యం ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా శ్రేయాస్‌ అయ్యర్‌ జట్టును నిరుడు తుదిపోరుకు తీసుకొచ్చాడు. ఈనేపథ్యంలో ప్రధాన ఆటగాళ్లను రిటైన్‌ చేసుకున్న పంజాబ్‌ రన్నరప్‌గా నిలిచిన ఆత్మవిశ్వాసంతో ఈ సీజన్‌కు సై అంటోంది. శ్రేయాస్‌ అయ్యర్‌ సారథ్యంలో పంజాబ్‌ ఈసారైనా ‘కింగ్స్‌’ అవుతుందా? అనేది చూడాలి.

అయితే పంజాబ్‌కు విదేశీ ఆల్‌రౌండర్లు ప్రధాన బలం. మార్కస్‌ స్టొయినిస్‌, మార్కో యాన్సెన్‌, అజ్మతుల్లా ఒమర్జాయ్‌, మిచెల్‌ ఒవెన్‌, కూపర్‌ కానొలీ బంతిని ఎంత బలంగా బాది భారీ షాట్లు సాధించగలరో..అదే బంతితో ప్రత్యర్థి బ్యాటర్లను ముప్పు తిప్పలు పెట్టగలరు. పైగా ప్రపంచ వ్యాప్తంగా పలు అంతర్జాతీయ ఫ్రాంచైజీ లీగ్‌లలో ఆడుతున్న అపార అనుభవం ఆ ఐదుగురు ఆల్‌రౌండర్ల సొంతం. 

ప్రియాన్ష్‌ ఆర్యా, ప్రభ్‌సిమ్రన్‌ సింగ్‌ దూకుడైన బ్యాటింగ్‌తో స్కోరుబోర్డును పరుగులు పెట్టించగలరు. నిరుడు 400కుపైగా రన్స్‌ చేసిన ఆర్యా రెండో బెస్ట్‌ స్ట్రయిక్‌ రేట్‌ బ్యాటర్‌గా నిలిచాడు. ఓపెనర్లు ఇచ్చిన శుభారంభాలను కొనసాగించేందుకు శ్రేయాస్‌ ఎలాగూ ఉంటాడు. అర్ష్‌దీప్‌, ఫెర్గూసన్‌, యాన్సెన్‌, చాహల్‌తో పేస్‌, స్పిన్‌ బౌలింగ్‌లో వైవిధ్యం పంజాబ్‌కు కలిసి వచ్చే అంశం. పటిష్టమైన రిజర్వ్‌ బెంచ్‌ అదనపు బలం.

పెద్దగా అనుభవంలేని భారత ఆటగాళ్లు జట్టులో ఉండడం పంజాబ్‌ కింగ్స్‌ బలహీనత. కెప్టెన్‌ అయ్యర్‌ మినహా ప్రియాన్ష్‌, శశాంక్‌ సింగ్‌, వధేరా, హర్‌ప్రీత్‌ బ్రార్‌, ముషీర్‌ ఖాన్‌, వైశాఖ్‌లకు అత్యున్నత స్థాయి ఐపీఎల్‌ మ్యాచ్‌లు ఆడింది తక్కువ. వీరందరిలో ప్రతిభకు కొదవ లేకపోయినా నిలకడగా రాణించలేకపోవడం, ఒత్తిడి సమయాల్లో ఆడిన అనుభవం పెద్దగా లేకపోవడం కీలక సమయాల్లో జట్టును దెబ్బతీస్తోంది. అలాగే చాహల్‌ మినహా పేరు కలిగిన మరో స్పిన్నర్‌ లేకపోవడం లోటు.

పంజాబ్‌ కింగ్స్‌ జట్టు:
స్వదేశీ ఆటగాళ్లు: శ్రేయాస్‌ (కెప్టెన్‌), ప్రియాన్ష్‌ ఆర్యా, ప్రభ్‌ సిమ్రన్‌ సింగ్‌ (కీపర్‌), నేహల్‌ వధేరా, శశాంక్‌ సింగ్‌, విజయ్‌ కుమార్‌ వైశాఖ్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌, యజువేంద్ర చాహల్‌, హర్‌ప్రీత్‌ బ్రార్‌, సూర్యాన్ష్‌ షెగ్డే, విష్ణు వినోద్‌ (కీపర్‌), యశ్‌ ఠాకూర్‌, ముషీర్‌ ఖాన్‌, హర్నూర్‌ సింగ్‌, పైలా అవినాశ్‌, ప్రవీణ్‌ దూబే, విశాల్‌ నిషాద్‌.

విదేశీ ఆటగాళ్లు: స్టొయినిస్‌, అజ్మతుల్లా ఒమర్జాయ్‌, జేవియర్‌ బార్ట్‌లెట్‌, మిచెల్‌ ఒవెన్‌, ఫెర్గూసన్‌, కూపర్‌ కానొలీ, బెన్‌ డ్వార్షూయిస్‌.

చదవండి: జ‌ట్ల‌కు వార్నింగ్‌.. కేకేఆర్ బ్యాట‌ర్ విధ్వంస‌క‌ర సెంచ‌రీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement