ఫీల్డ్‌ అంపైర్ల బుద్ధి మందగించిందా?

Punjab Fans Criticizing Umpiring Standards Against Delhi Match - Sakshi

దుబాయ్‌: కరోనా దెబ్బతో ఇళ్లకే పరిమితమై ఎంటర్‌టైన్‌మెంట్‌కు మొహం వాచిపోయిన జనాలను ఖుషీ చేయడానికి క్యాష్‌ రిచ్‌ క్రికెట్‌ టోర్నీ ఐపీఎల్‌ ప్రారంభమైంది. చెన్నై, ముంబై మధ్య తొలి మ్యాచ్‌ మామూలుగా సాగిపోయినా, ఢిల్లీ-పంజాబ్‌ మధ్య ఆదివారం జరిగిన రెండో మ్యాచ్‌ మాత్రం అసలైన మజా అందించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన ఢిల్లీ జట్టు 157 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించగా.. మయాంక్‌ అగర్వాల్‌ పోరాట పటిమతో పంజాబ్‌ గెలుపు దిశగా పయనించింది. అయితే, అనూహ్యంగా అగర్వాల్‌ ఔటవడంతో... మ్యాచ్‌ టైగా ముగిసింది. చివరి వరకూ లక్ష్యం చేతులు మారుతూ వచ్చిన ఈ మ్యాచ్‌లో సూపర్‌ ఓవర్‌ ద్వారా ఫలితం తేలింది. 

అయితే, అంపైర్ల తప్పుడు నిర్ణయంతో తమకు అన్యాయం జరిగిందని పంజాబ్‌ అభిమానులు సోషల్‌ మీడియాలో తిట్టిపోస్తున్నారు. టెక్నాలజీ జోక్యం ఎక్కువ కావడంతో అంపైర్ల బుద్ధి మందగించిందని చురకలు వేస్తున్నారు. పంజాబ్‌ యజమాని ప్రీతి జింటా కూడా అంపైర్లను విమర్శిస్తూ ట్వీట్‌ చేశారు. విషమేంటంటే.. 157 పరుగుల లక్ష్య ఛేదనలో మయాంక్‌ అగర్వాల్‌ అద్భుత ఇన్నింగ్స్‌తో పంజాబ్‌ గెలుపు దిశగా సాగుతోంది. బ్యాట్‌తో మెరిసిన ఢిల్లీ ఆటగాడు స్టొయినిస్‌ ఇన్నింగ్స్‌ 19 వ ఓవర్‌ బౌలింగ్‌ చేశాడు. స్ట్రైకింగ్‌లో ఉన్న మయాంక్‌ షాట్‌ కొట్టడంతో రెండు పరుగులొచ్చాయి. అయితే, ఓవర్‌ పూర్తవగానే.. పంజాబ్‌ ఇన్నింగ్స్‌కు అంపైర్లు ఒక పరుగు కోత విధించారు. 
(చదవండి: పంజాబ్‌ సూపర్‌ ఫ్లాప్‌...)

నాన్‌ స్ట్రైకింగ్‌లో ఉన్న క్రిస్‌ జోర్డాన్‌ తొలి పరుగు తీసే క్రమంలో షార్ట్‌ రన్‌ చేశాడంటూ చెప్పారు. దాంతో చివరి ఓవర్‌లో 13 పరుగులు చేయాల్సిన పరిస్థితి. 13 పరుగులు కావాల్సిన తరుణంలో 12 పరుగులు చేసిన తర్వాత మయాంక్‌ క్యాచ్‌ ఔట్‌గా వెనుదిరగడంతో ఒక్కసారిగా ఉత్కంఠ. ఇక చివరి బంతికి జోర్డాన్‌ ఔట్‌ కావడంతో మ్యాచ్‌ టై గా ముగిసింది. సూపర్‌లో ఓవర్‌లో పంజాబ్‌ రెండు పరుగులే చేయడంతో ఢిల్లీ మూడు పరుగుల లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించి విజయం సాధించింది. టీవీ రీప్లేలో మాత్రం జోర్డాన్‌ పరుగును పూర్తి చేసినట్టే కనిపించింది.
(చదవండి: ఒక షార్ట్‌ రన్‌ నన్ను తీవ్రంగా దెబ్బతీసింది)

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top