స్టోయినిస్‌.. నీ ఆట అమోఘం: మయాంక్‌

Mayank lauds Marcus Stoinis - Sakshi

దుబాయ్‌: ఐపీఎల్‌-13వ సీజన్‌లో కింగ్స్‌ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ కష్టాల్లో పడ్డ సమయంలో ఆల్‌రౌండర్‌ స్టోయినిస్‌ మెరుపులు మెరిపించాడు. 20 బంతుల్లో  సిక్స్‌లు, ఫోర్లు మోత మోగించి హాఫ్‌ సెంచరీ సాధించాడు. కనీసం వంద పరుగులైనా చేస్తుందా అనే దిశ నుంచి స్కోరు బోర్డును 150 పరుగులకు పైగా తీసుకెళ్లాడు. దాంతో మ్యాచ్‌ హోరాహోరీ అయ్యింది. స్టోయినిస్‌ బ్యాటింగ్‌ వృథా కాకుండా ఢిల్లీ ‘సూపర్‌’ విజయాన్ని అందుకుంది.  చివరకు మ్యాచ్‌ టై కావడంతో సూపర్‌ ఓవర్‌ అనివార్యమైంది. ఈ సూపర్‌ ఓవర్‌లో ఢిల్లీ సునాయాసంగా గెలిచి శుభారంభం చేసింది. (చదవండి: స్టోయినిస్‌ చెలరేగిపోయాడు..)

ఢిల్లీ నిర్దేశించిన 158 పరుగుల ఛేదనలో  కింగ్స్‌ చివరి వరకూ పోరాడింది. ఆదిలో వికెట్లు కోల్పోయినా మయాంక్‌ అగర్వాల్‌ సొగసైన ఇన్నింగ్స్‌తో విజయం అంచుల వరకూ వెళ్లింది. కానీ ఒక పరుగు తీయాల్సిన సమయంలో మయాంక్‌ భారీ షాట్‌ ఆడి వికెట్‌ సమర్పించుకున్నాడు. చివరి బంతికి జోర్డాన్‌ కూడా ఔట్‌ కావడంతో మ్యాచ్‌ టై అయ్యింది. ఈ రెండు వికెట్లను కూడా స్టోయినిస్‌ సాధించి మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా నిలిచాడు. ఆల్‌రౌండర్‌ అనే పదానికి అర్థం చెబుతూ మ్యాచ్‌ను మలుపుతిప్పేశాడు.

మ్యాచ్‌ తర్వాత మయాంక్‌ అగర్వాల్‌ మాట్లాడుతూ..  స్టోయినిస్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు. స్టోయినిస్‌ బ్యాటింగ్‌ అమోఘం అంటూ కొనియాడాడు. అటు బంతితోనూ మెరిసిన స్టోయినిస్‌ ఆల్‌రౌండర్‌ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడని ప్రశంసించాడు. మ్యాచ్‌ను తమ నుంచి లాగేసుకున్నాడన్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌ విజయం క్రెడిట్‌ అంతా కూడా స్టోయినిస్‌కే దక్కుతుందన్నాడు. అతను కడవరకూ పోరాడిన విధానం నిజంగానే అద్భుతమన్నాడు. ఈ మ్యాచ్‌లో మేము చేసిన ఒకే ఒక్క చిన్నపొరపాటుతో ఫలితం తారుమారైందన్నాడు. తాము కష్టాల్లో పడి తేరుకుని కడవరకూ రావడం సానుకూల థృక్పధానికి నిదర్శనమన్నాడు. తమ బౌలింగ్‌ కూడా బాగుందన్నాడు. కొత్త బాల్‌తో తమ పేసర్లు అద్భుతంగా రాణించారన్నాడు. కాకపోతే ముగింపు సరిగా లేకపోవడం తమను తీవ్రంగా బాధిస్తుందన్నాడు. ఇది తొలి గేమ్‌ కావడంతో తదుపరి మ్యాచ్‌లకు పూర్తిస్థాయిలో సన్నద్ధమవుతామన్నాడు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top