కింగ్స్‌ పంజాబ్‌ ‘హ్యాట్రిక్‌’

Kings Punjab Beat Delhi Capitals By 5 Wickets - Sakshi

ఢిల్లీ క్యాపిటల్స్‌పై ప్రతీకారం

దుబాయ్‌:  ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కింగ్స్‌ పంజాబ్‌ ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఢిల్లీ నిర్దేశించిన 165 పరుగుల టార్గెట్‌ను కింగ్స్‌ పంజాబ్‌ 19 ఓవర్‌లో ఐదు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఫలితంగా హ్యాట్రిక్‌ విజయాన్ని ఖాతాలో వేసుకుంది. వరుస ఓటములతో ఢీలా పడ్డ కింగ్స్‌ పంజాబ్‌.. ఆపై వరుసగా మూడో విజయాన్ని సాధించడంతో రేసులోకి వచ్చేసింది. ఆర్సీబీతో 8 వికెట్ల తేడాతో విజయం సాధించిన తర్వాత ముంబై ఇండియన్స్‌పై సూపర్‌ ఓవర్‌ గెలుపును అందుకుంది. ఆపై తాజా మ్యాచ్‌లో కూడా కింగ్స్‌ పంజాబ్‌ ఆకట్టుకుని ఢిల్లీపై పైచేయి సాధించింది. దాంతో ఈ సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై సూపర్‌ ఓవర్‌లో ఓడిన దానికి కింగ్స్‌ పంజాబ్‌ ఘనమైన ప్రతీకారం తీర్చుకుంది.  ఇది కింగ్స్‌కు నాల్గో విజయం కాగా, ఢిల్లీకి మూడో ఓటమి.

లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో కేఎల్‌ రాహుల్‌(15) తొలి వికెట్‌గా ఔటయ్యాడు. అనంతరం గేల్‌ బ్యాట్‌ను ఝుళిపించాడు.  క్రిస్‌ గేల్‌(29;13 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) ధాటిగా బ్యాటింగ్‌ చేసి కింగ్స్‌ పంజాబ్‌ స్కోరును పరుగులు పెట్టించాడు. గేల్‌ రెండో వికెట్‌గా ఔటైన కాసేపటికి మయాంక్‌ అగర్వాల్‌(5) రనౌట్‌ అయ్యాడు. నికోలస్‌ పూరన్‌తో సమన్వయం లోపించడంతో మయాంక్‌ రనౌట్‌గా నిష్క్రమించాడు. కాగా, పూరన్‌(53; 28 బంతుల్లో 6 ఫోర్లు, 3సిక్స్‌లు) దుమ్ములేపడంతో కింగ్స్‌ పంజాబ్‌ రన్‌రేట్‌ ఎక్కడా తగ్గలేదు. అతనికి జతగా మ్యాక్స్‌వెల్‌(32; 24 బంతుల్లో 3 ఫోర్లు) మంచి సహకారం అందించాడు. ఈ జోడి నాల్గో వికెట్‌కు 69 పరుగులు జోడించడంతో కింగ్స్‌ పంజాబ్‌ గాడిలో పడింది. జట్టు స్కోరు 125 పరుగుల వద్ద ఉండగా పూరన్‌ ఔట్‌ కాగా, 147 పరుగుల వద్ద ఉండగా మ్యాక్స్‌వెల్‌ నిష్క్రమించాడు. చివర్లో దీపక్‌ హుడా(15 నాటౌట్‌; 22 బంతుల్లో 1 ఫోర్‌), నీషమ్‌(10 నాటౌట్‌; 8 బంతుల్లో 1 సిక్స్‌)లు లక్ష్యాన్ని పూర్తిచేసి కింగ్స్‌కు విజయాన్ని అందించారు. ఢిల్లీ బౌలర్లలో రబడా రెండు వికెట్లు సాధించగా, అక్షర్‌ పటేల్‌, రవిచంద్రన్‌ అశ్విన్‌లకు తలో  వికెట్‌ లభించింది. (ఐదో ప్లేయర్‌గా గబ్బర్‌..)

అంతకుముందు  ఢిల్లీ నిర్ణీత ఓవర్లలో  ఐదు వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది.  ఓపెనర్‌ శిఖర్‌ మరోసారి తన మాస్టర్‌ క్లాస్‌ ఇన్నింగ్స్‌తో మెరిశాడు. క్లాస్‌ టచ్‌ అంటే ఇలా ఉంటుందంటూ వరుసగా రెండో సెంచరీని సాధించాడు. సీఎస్‌కేతో గత మ్యాచ్‌లో సెంచరీ సాధించి ఢిల్లీ విజయంలో కీలక పాత్ర పోషించిన ధావన్‌.. పంజాబ్‌తో మ్యాచ్‌లో మరొకసారి చెలరేగిపోయాడు. 61 బంతుల్లో  12 ఫోర్లు, 3 సిక్స్‌లతో 106 పరుగులు సాధించి అజేయంగా నిలిచాడు. ఓ వైపు ఢిల్లీ టాపార్డర్‌ వికెట్లను చేజార్చుకున్నా ధావన్‌ మాత్రం బాధ్యతాయుతంగా ఆడాడు.   ఈ క్రమంలోనే శతకాన్ని ఖాతాలో వేసుకున్నాడు. ఇది శిఖర్‌కు ఓవరాల్‌ ఐపీఎల్‌లో రెండో సెంచరీ కాగా, అది కూడా వరుసగా సాధించడం విశేషం. ఫలితంగా ఐపీఎల్‌ చరిత్రలో వరుసగా రెండో సెంచరీలు సాధించిన తొలి ఆటగాడుగా ధావన్‌ రికార్డు నెలకొల్పాడు.

టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ఢిల్లీ ఆదిలోనే పృథ్వీ షా(7) వికెట్‌ను కోల్పోయింది.  నీషమ్‌ బౌలింగ్‌లో పృథ్వీ షా క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. ఆ తరుణంలో శిఖర్‌కు కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ జత కలిశాడు. వీరిద్దరూ 48 పరుగులు జత చేసిన తర్వాత అయ్యర్‌(14) రెండో వికెట్‌గా పెవిలియన్‌ చేరాడు. మురుగన్‌ అశ్విన్‌ బౌలింగ్‌లో రాహుల్‌కు క్యాచ్‌ ఇచ్చి అయ్యర్‌ ఔటయ్యాడు. ఆపై రిషభ్‌ పంత్‌(14) కూడా నిరాశపరిచాడు. కానీ ధావన్‌ మాత్రం అత్యంత నిలకడగా ఆడాడు. 57 బంతుల్లో12 ఫోర్లు, 3 సిక్సర్లతో సెంచరీని సాధించాడు.  హిట్టర్లు స్టోయినిస్‌(9), హెట్‌మెయిర్‌(10; 6 బంతుల్లో 1 సిక్స్‌)ల నుంచి ఆశించిన మెరుపులు రాకపోవడంతో ఢిల్లీ నిర్ణీత ఓవర్లలో  ఐదు వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. కింగ్స్‌ పంజాబ్‌ బౌలర్లలో  షమీ రెండు వికెట్లు సాధించగా, నీషమ్‌, మురుగన్‌ అశ్విన్‌, మ్యాక్స్‌వెల్‌లు తలో వికెట్‌ తీశారు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top