
PC: PCB
చావు దెబ్బలు తింటున్నా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) తీరు మారలేదు. ఇప్పటికే ఐపీఎల్-2025 (IPL 2025)కు పోటీగా పాకిస్తాన్ సూపర్ లీగ్ (PSL-2025) షెడ్యూల్‌ను ఖరారు చేసి చేతులు కాల్చుకున్న పీసీబీ.. మరోసారి అదే సాహసానికి సిద్ధపడింది. కాగా మార్చి 22న ఐపీఎల్ తాజా ఎడిషన్ మొదలుకాగా.. ఎన్నడూ లేని విధంగా పాక్ బోర్డు కూడా పోటీకి దిగింది. ఏప్రిల్ 11న తమ టీ20 లీగ్‌ను ఆరంభించింది.
వాయిదా పడిన రెండు లీగ్‌లు
ఈ క్రమంలో క్యాష్ రిచ్ లీగ్‌కు ఎప్పటిలాగే ప్రేక్షకాదరణ దండిగానే లభించగా.. పీఎస్‌ఎల్‌ను మాత్రం ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. ఇలాంటి తరుణంలో పహల్గామ్ ఉగ్రదాడికి బదులుగా భారత్ ఆపరేషన్ సిందూర్‌తో పాక్‌లోని ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేయగా.. పాక్ ఆర్మీ అందుకు ప్రతిదాడికి దిగింది.
దీంతో గట్టిగా బదులిచ్చిన భారత్ రావల్పిండి, కరాచీ, లాహోర్‌లను టార్గెట్ చేయగా.. పీఎస్‌ఎల్ మ్యాచ్‌కు ముందే రావల్పిండి స్టేడియంలో క్షిపణి దాడి జరిగింది.
పునఃప్రారంభంలోనూ పోటీ
ఈ పరిణామాల నేపథ్యంలో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతల కారణంగా ఇటు ఐపీఎల్‌తో పాటు.. అటు పీఎస్‌ఎల్‌ను కూడా వాయిదా వేశారు. అయితే, కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన తర్వాత.. ఈ రెండు లీగ్‌లు మళ్లీ మొదలుకానున్నాయి. అయితే, పునఃప్రారంభంలో కూడా పీసీబీ భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI)తో పోటీకి దిగింది
రామని తేల్చి చెప్పిన ఆటగాళ్లు
ఈ సీజన్‌లో మిగతా ఐపీఎల్ మ్యాచ్‌లను మే 17 నుంచి అని బీసీసీఐ ప్రకటించిన మరుసటి రోజే పోటీగా.. పాక్ క్రికెట్ బోర్డు (పీసీబీ) కూడా మే 17 నుంచి పీఎస్‌ఎల్ తిరిగి ఆరంభం అంటూ ఆర్భాటానికి పోయింది. కానీ ఇక్కడ ఆసలు సవాల్ విదేశీ ప్లేయర్ల నుంచి ఎదురవుతోంది. భారత ఆర్మీ దాడులతో బెంబేలెత్తిన పలువురు విదేశీ ఆటగాళ్లు ఇక పాక్‌కు వచ్చే సమస్యే లేదని తెలిసింది.
ముఖ్యంగా కేన్ విలియమ్సన్ సహా ఇతర న్యూజిలాండ్ ఆటగాళ్లు పాకిస్తాన్‌కు ససేమిరా అంటున్నట్లు సమాచారం. డారిల్ మిచెల్ అయితే మళ్లీ తాను పాక్‌లో అడుగుబెట్టబోనని తేల్చిచెప్పినట్లు వార్తలు వచ్చాయి.
ఈ నేపథ్యంలో కివీస్ ప్లేయర్లు మాత్రమే ఇంగ్లండ్ సహా ఇతర విదేశీ ప్లేయర్లు పీఎస్‌ఎల్ కోసం వెనక్కి వచ్చే అవకాశమైతే లేదు. కాగా 25న జరిగే ఫైనల్‌తో ఈ సీజన్ పీఎస్‌ఎల్ ముగుస్తుంది. అయితే పలువురు స్టార్ క్రికెటర్లు తిరిగి రానే రామని తేల్చేయడంతో వారి స్థానాల్ని వెంటనే భర్తీ చేసుకొని ఆయా ఫ్రాంచైజీలన్నీ పునఃప్రారంభానికి సిద్ధంగా ఉండాలని పీసీబీ సూచించింది.