
మహారాష్ట్ర - ముంబై మధ్య జరిగిన రంజీ ట్రోఫీ వార్మప్ మ్యాచ్‌లో స్టార్ ప్లేయర్లు పృథ్వీ షా, ముషీర్ ఖాన్‌లు గొడవపడిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో అద్భుతమైన సెంచరీ చేసిన పృథ్వీ షా(181).. ముషీర్ ఖాన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. ముషీర్ వికెట్ తీసిన తర్వాత "థాంక్యూ" అని కాస్త వ్యంగ్యంగా అన్నాడు.
వెంటనే తన సహనాన్ని కోల్పోయిన పృథ్వీషా మైదానంలోనే ముషీర్ పైపైకి దూసుకెళ్లాడు. ముషీర్ కాలర్ పట్టుకునేందుకు షా ప్రయత్నించాడు. అంపైర్లు, ఆటగాళ్లు జోక్యం చేసుకోవడంతో గొడవ సద్దమణిగింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలైంది.
అయితే ఈ సంఘటనపై ముంబై క్రికెట్ అసోసియేషన్, మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ సీరియస్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. రెండు క్రికెట్ అసోసియేషన్‌లు విచారణకు సిద్దమయ్యాయి. ఈ విషయాన్ని ఏంసీఎ కార్యదర్శి అభయ్ హడప్ ధ్రువీకరించారు. బీసీసీఐ మాజీ ఛీప్ సెలక్టర్, భారత క్రికెట్ దిగ్గజం దిలీప్ వెంగ్‌సర్కార్ ఇద్దరు క్రికెటర్లతో మాట్లాడనున్నారు.
గురువారం ముంబై క్రికెట్ అసోసియేషన్ సెలక్షన్ కమిటీ సమావేశం జరగనుంది. వార్మాప్ మ్యాచ్‌లో ఏమి జరిగిందో ముంబై కెప్టెన్, కోచ్ , ముషీర్‌ను అడిగి తెలుసుకుంటాము. ఈ మీటింగ్‌లో మాకు ఆ సంఘటనకు సంబంధించి పూర్తి నివేదిక అందుతోంది.
మా సలహాదారుడు, భారత మాజీ కెప్టెన్ దిలీప్ వెంగ్‌సర్కార్ ఆటగాళ్లతో మాట్లాడుతారు అని అభయ్ హడప్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. మరోవైపు మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ కమలేష్ పిసల్ సైతం స్పందించారు.
ఈ సంఘటనపై రిపోర్ట్ కోసం ఎదురు చూస్తున్నాము. మేము పృథ్వీ షా, ముషీర్ ఖాన్‌తో మాట్లాడుతాము. ఆటగాళ్లలో క్రమశిక్షణ చాలా ముఖ్యం. క్రమశిక్షణ నియమావళిని ఉల్లంఘించినట్లు రుజువైతే పృథ్వీషా కచ్చితంగా చర్యలు తీసుకుంటాము అని కమలేష్ పిసల్ వెల్లడించారు.
కాగా ముంబై క్రికెట్ అసోసియేషన్‌తో విబేధాల కారణంగా పృథ్వీ షా తన మకాంను మహారాష్ట్రకు మార్చాడు. రాబోయే రంజీ సీజన్‌లో మహారాష్ట్ర తరపున షా ఆడనున్నాడు. ఒకవేళ అతడిపై మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ చర్యలు తీసుకుంటే ఒకట్రెండు మ్యాచ్‌లకు దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి.
చదవండి: అభిషేక్ గొప్ప ప్లేయరేమి కాదు.. 3 బంతుల్లో ఔట్ చేస్తా! పాక్ బౌలర్ ఓవరాక్షన్