Ranji Trophy 2022: క్రికెట్‌లో ఇలాంటి అద్భుతాలు అరుదుగా.. 134 ఏళ్ల రికార్డు బద్దలు కొట్టిన పృథ్వీ షా

Prithvi Shaw Rare PartnerShip Yashasvi Jaiswal Breaks 134 Year Record - Sakshi

ఐర్లాండ్‌తో టి20 సిరీస్‌కు తనను ఎంపిక చేయలేదనే కోపమో.. లేక యాదృశ్చికంగా జరిగిందో తెలియదు కానీ  పృథ్వీ షా విషయంలో ఒక ఆసక్తికర ఘటన జరిగింది. రంజీ చరిత్రలోనే అరుదైన ఫీట్‌ నమోదు అయింది. సాధారణంగానే పృథ్వీ షా వేగానికి పెట్టింది పేరు. ఇటీవలి కాలంలో పృథ్వీ షా ఓపెనర్‌గా వస్తూనే దూకుడు కనబరుస్తున్నాడు. నాన్‌స్ట్రైక్‌ ఎండ్‌లోనే మరో బ్యాటర్‌ను ఉంచి తాను మాత్రం​ బౌండరీలు, సిక్సర్ల వర్షం కురిపించాడు. ఈ తరహా ఆటను పృథ్వీ షా నుంచి ఐపీఎల్‌లో చాలాసార్లు చూశాం. తాజాగా అదే తరహా దూకుడును ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో చూపెట్టాడు పృథ్వీ షా.

విషయంలోకి వెళితే.. రంజీ ట్రోపీ 2022 సీజన్‌లో భాగంగా ముంబై, ఉత్తర్‌ ప్రదేశ్‌ మధ్య సెమీ ఫైనల్‌ మ్యాచ్‌ జరుగుతుంది. తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్‌ ఆరంభించిన ముంబై.. కెప్టెన్‌ పృథ్వీ షా, యశస్వి జైశ్వాల్‌లు ఓపెనర్లుగా వచ్చారు. మ్యాచ్‌లో పృథ్వీ 71 బంతుల్లో 12 ఫోర్ల సాయంతో 64 పరుగులు చేసి ఔటయ్యాడు. ఇక్కడ విశేషమేమిటంటే పృథ్వీ షా 64 పరుగులు చేసి ఔటైనప్పుడు జట్టు స్కోరు 66. మరో ఓపెనర్‌ జైశ్వాల్‌ స్కోరు (0). దీనిని చూస్తే ఈ పాటికే మీకు అర్థమయి ఉండాలి. అవునండీ తొలి వికెట్‌ పడే సమయానికి జట్టు 66 పరుగులు చేయగా.. అందులో పృథ్వీ షావి 64 పరుగులు కాగా.. మరో రెండు పరుగులు ఎక్స్‌ట్రాల రూపంలో వచ్చాయి.

తొలి వికెట్‌కు జైశ్వాల్‌తో 66 పరుగులు జోడించగా.. అందులో 96.96 శాతం పరుగులు పృథ్వీ షావే. తొలి వికెట్‌కు 50 ప్లస్‌ స్కోరు చేయడంలో ఒక్క బ్యాటర్‌దే స్కోరు మొత్తం ఉండడం ఫస్ట్‌క్లాస్‌ చరిత్రలో ఇది రెండోసారి మాత్రమే. ఇంతకముందు 1888లో ఆస్ట్రేలియా క్రికెట్‌లో జరిగింది. నార్త్‌, ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఓపెనర్‌ పెర్సీ మెక్‌డోనెల్‌ అలెక్స్‌ బ్యానర్‌మెన్‌తో కలిసి తొలి వికెట్‌కు 86 పరుగులు జోడించాడు. అందులో పెర్సీ మెక్‌డోనెల్‌వి 95.34 శాతం పరుగులు. తాజాగా 134 ఏళ్ల అనంతరం పృథ్వీ షా-జైశ్వాల్‌ జోడి ఆ రికార్డును బద్దలు కొట్టింది. పృథ్వీ షా ఔటయ్యే సమయానికి 52 బంతులు ఆడిన జైశ్వాల్‌ ఒక్క పరుగు చేయలేదు. ఆ తర్వాత 55వ బంతికి బౌండరీ కొట్టి పరుగుల ఖాతా తెరిచాడు. ఎట్టకేలకు పరుగు తీయడంతో జైశ్వాల్‌ బ్యాట్‌ పైకి లేపగా.. ప్రత్యర్థి ఆటగాళ్లు చప్పట్లతో అభినందించడం కొసమెరుపు. 

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. ముంబై పట్టు బిగించింది. ఆట ముగిసే సరికి ముంబై తమ రెండో ఇన్నింగ్స్‌లో వికెట్‌ నష్టానికి 133 పరుగులు చేసి ఓవరాల్‌గా 346 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. పృథ్వీ షా (71 బంతుల్లో 64; 12 ఫోర్లు) దూకుడుగా ఆడగా, యశస్వి జైస్వాల్‌ (35 నాటౌట్‌), అర్మాన్‌ జాఫర్‌ (32 నాటౌట్‌) క్రీజ్‌లో ఉన్నారు. అంతకు ముందు 25/2తో ఆట కొనసాగించిన యూపీ తమ తొలి ఇన్నింగ్స్‌లో 180 పరుగులకే ఆలౌటైంది. శివమ్‌ మావి (55 బంతుల్లో 48; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) టాప్‌స్కోరర్‌గా నిలిచాడు. ముంబైకి 213 పరుగుల భారీ ఆధిక్యం లభించింది.

చదవండి: IND vs IRE T20 Series: పృథ్వీ షా చేసిన నేరం.. 'పనికిరాని ఆటగాడిగా కనిపిస్తున్నాడా?'

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top