IND vs IRE T20 Series: పృథ్వీ షా చేసిన నేరం.. 'పనికిరాని ఆటగాడిగా కనిపిస్తున్నాడా?'

Fans Slams BCCI Why Prithvi Shaw Not-Selected For Ireland T20 Series - Sakshi

పృథ్వీ షా.. ఈ యువ క్రికెటర్‌ను తన కెరీర్‌ ఆరంభంలో సచిన్‌ టెండూల్కర్‌తో పోల్చిన దాఖలాలు ఉన్నాయి. ఇలా పోల్చడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. పృథ్వీ షా బ్యాటింగ్‌ టెక్నిక్‌లో ఎలాంటి లోపాలు కనిపించలేదు. పృథ్వీ షా ఆడే కొన్నిషాట్లు సచిన్‌ను పోలి ఉంటాయి. అందుకే రానున్న కాలంలో టీమిండియా తరపున మరో మేటి క్రికెటర్‌ అయ్యే అవకాశాలు పృథ్వీ షాలో మెండుగా ఉన్నాయంటూ ఆకాశానికెత్తేశారు. కట్‌చేస్తే ప్రస్తుతం అతను జట్టులోకి రావడానికే తెగ కష్టపడాల్సి వస్తుంది.


తాజాగా ఐర్లాండ్‌తో ఈ నెల 26, 28 తేదీల్లో జరిగే రెండు టి20 మ్యాచ్‌ల కోసం 17 మంది సభ్యుల భారత జట్టును బీసీసీఐ బుధవారం ప్రకటించిన సంగతి తెలిసిందే.ఐపీఎల్‌లో గుజరాత్‌ టైటాన్స్‌ను విజేతగా నిలిపిన హార్దిక్‌ పాండ్యాకు తొలిసారి భారత జట్టు సారథ్య బాధ్యతలు దక్కడం విశేషం. ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ తరఫున రాణించిన రాహుల్‌ త్రిపాఠి మొదటిసారి టీమిండియాకు ఎంపిక కాగా... సామ్సన్, సూర్యకుమార్‌ పునరాగమనం చేశారు. ప్రస్తుతం దక్షిణాఫ్రికాతో జరుగుతున్న టి20 సిరీస్‌లో కెప్టెన్‌గా ఉన్న పంత్, బ్యాటర్‌ శ్రేయస్‌ అయ్యర్‌లు టెస్టు జట్టులో సభ్యులు కావడంతో వారిని ఎంపిక చేయలేదు.

అయితే ఢిల్లీ క్యాపిటల్స్‌ ఓపెనర్‌ పృథ్వీ షాను ఎంపికచేయకపోవడంపై భారత అభిమానుల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పృథ్వీ షా ప్రదర్శన మెరుగ్గా లేకపోయినప్పటికి తీసివేసే విధంగా లేదు. ప్రస్తుతం రంజీ ట్రోఫీలో ముంబై కెప్టెన్‌గా ఉన్న పృథ్వీ షా జట్టును విజయవంతంగా నడిపిస్తున్నాడు. అతని సారధ్యంలో ఇప్పటికే సెమీస్‌ చేరిన ముంబై మరోసారి కప్‌ గెలవాలని ఉవ్విళ్లూరుతుంది.


రంజీలో భాగంగా ఉత్తరాఖండ్‌తో జరిగిన క్వార్టర్‌ ఫైనల్లో పృథ్వీ షా  తొలి ఇన్నింగ్స్‌లో 21, రెండో ఇన్నింగ్స్‌లో 72 పరుగులు చేశాడు. అంతకముందు ఐపీఎల్‌ 2022 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిధ్యం వహించిన పృథ్వీ షా 10 మ్యాచ్‌ల్లో  283 పరుగులు చేశాడు. పవర్ ప్లే లో డేవిడ్ వార్నర్ తో కలిసి ధాటిగా ఆడిన పృథ్వీ పలుమార్లు ఢిల్లీ భారీ స్కోరు చేయడంలో సహకరించాడు.  టీమిండియా తరపున పృథ్వీ షా ఇప్పటివరకు 5 టెస్టులాడి 339 పరుగులు, 6 వన్డేల్లో 189 పరుగులు చేశాడు.


ఇక ఐర్లాండ్‌తో సిరీస్‌కు పృథ్వీ షాను జట్టులోకి తీసుకోకపోవడంపై  టీమిండియా అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేశారు.పృథ్వీషా ను ప్రతి సిరీస్ లో పక్కనబెట్టడం అతడి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుందని సెలక్టర్లపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ట్విటర్ వేదికగా పలువురు స్పందిస్తూ..'ఐర్లాండ్ టూర్ లో పృథ్వీ షాను ఎందుకు తీసుకోలేదు.. మరి అంత పనికిరాని ఆటగాడిగా కనిపిస్తున్నాడా?'.. 'షా చేసిన తప్పేంటి..? బాగా ఆడటమేనా చెప్పండి..?'..'బాధపడకు షా.. సూర్యుడు తూర్పున ఉదయించక మానడు.. నువ్వు టీమిండియాలోకి రాకుండా ఎవరూ అడ్డుకోలేరు'..'ఇదేం జట్టు ఎంపిక..? షాను ఎంపిక చేయరా..' అని బీసీసీఐకి ప్రశ్నల వర్షం కురిపించారు.

చదవండి: టీమిండియాలో నో ఛాన్స్‌.. రాహుల్ తెవాటియా ట్వీట్‌ వైరల్‌..!

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top