రొనాల్డో కల నెరవేరేనా! | Portugal legend Cristiano Ronaldo in pursuit of a sixth World Cup | Sakshi
Sakshi News home page

రొనాల్డో కల నెరవేరేనా!

Jun 6 2026 3:53 AM | Updated on Jun 6 2026 3:53 AM

Portugal legend Cristiano Ronaldo in pursuit of a sixth World Cup

మరో 5 రోజుల్లో ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌

ఆరోసారి ప్రపంచకప్‌ వేటలో పోర్చుగల్‌ దిగ్గజం

యూరో టైటిల్‌... నేషన్స్‌ కప్‌ టైటిల్‌... చాంపియన్స్‌ లీగ్‌ టైటిల్‌... ఇంకా వివిధ దేశాల్లోని అంతర్జాతీయ ప్రొఫెషనల్‌ లీగ్‌లలో ముఖ్యమైన టైటిల్స్‌ అన్నింటిని పోర్చుగల్‌ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో సాధించాడు. అయితే ప్రపంచకప్‌ టైటిల్‌ మాత్రం ఈ స్టార్‌ ప్లేయర్‌కు అందని ద్రాక్షగానే ఉంది. ఆఖరి ప్రయత్నంగా 41 ఏళ్ల రొనాల్డో మరోసారి తన ప్రపంచకప్‌ కలను సాకారం చేసుకునేందుకు బరిలోకి దిగనున్నాడు.  

మరో ఐదు రోజుల్లో ప్రారంభంకానున్న ప్రపంచకప్‌ ఫుట్‌బాల్‌ టోర్నీ టాప్‌–5 ఫేవరెట్స్‌లో పోర్చుగల్‌ జట్టు కూడా ఉంది. 1966లో తొలిసారి ప్రపంచకప్‌లో ఆడిన పోర్చుగల్‌ జట్టు మూడో స్థానాన్ని సంపాదించి తమ అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేసింది. ఆ తర్వాత ఏడుసార్లు ఈ విశ్వ సమరంలో బరిలోకి దిగిన పోర్చుగల్‌ జట్టు 2006లో నాలుగో స్థానాన్ని సాధించింది. మూడుసార్లు (1986, 2002, 2014) లీగ్‌ దశలో నిష్క్రమించింది. రెండుసార్లు ప్రిక్వార్టర్స్‌లో (2010), ఒకసారి క్వార్టర్‌ ఫైనల్లో (2022) వెనుదిరిగింది. 

వరుసగా ఆరో ప్రపంచకప్‌లో ఆడనున్న రొనాల్డో గత ఐదు ప్రపంచకప్‌లలో కనీసం ఒక గోల్‌ అయినా చేశాడు. ఈసారి కూడా రొనాల్డో ఖాతాలో గోల్‌ చేరితే ఆరు ప్రపంచకప్‌లలో గోల్స్‌ చేసిన ఏకైక ప్లేయర్‌గా ప్రపంచ రికార్డు నెలకొల్పుతాడు. ఇప్పటి వరకు ప్రపంచకప్‌ టోర్నీల్లో 15 గోల్స్‌ చేసిన రొనాల్డో... మరో రెండు గోల్స్‌ సాధిస్తే ప్రపంచకప్‌ చరిత్రలో అత్యధిక గోల్స్‌ చేసిన ప్లేయర్‌గా మరో రికార్డు సృష్టిస్తాడు. ప్రపంచకప్‌లో అత్యధిక గోల్స్‌ చేసిన రికార్డు మిరోస్లావ్‌ క్లోజ్‌ (జర్మనీ; 16 గోల్స్‌) పేరిట ఉంది.  

తాజా ప్రపంచకప్‌లో గ్రూప్‌ ‘కె’లో ఉన్న పోర్చుగల్‌ తమ తొలి లీగ్‌ మ్యాచ్‌ను జూన్‌ 17న డీఆర్‌ కాంగో జట్టుతో... రెండో మ్యాచ్‌ను జూన్‌ 23న ఉజ్బెకిస్తాన్‌తో... మూడో మ్యాచ్‌ను జూన్‌ 27న కొలంబియాతో ఆడుతుంది. కొలంబియాను మినహాయిస్తే కాంగో, ఉజ్బెకిస్తాన్‌ జట్టుపై పోర్చుగల్‌ గెలుపు లాంఛనమే అనుకోవాలి. లీగ్‌ దశ దాటాక నాకౌట్‌ దశ నుంచి రొనాల్డో సారథ్యంలోని పోర్చుగల్‌ జట్టుకు ప్రతి మ్యాచ్‌ కీలకమవుతుంది. 

రొనాల్డోతో సహా సీనియర్లు బ్రూనో ఫెర్నాండెజ్, బెర్నార్డో సిల్వా, విటిన్హా తదితరులు సమష్టిగా రాణించడంపైనే పోర్చుగల్‌ విజయావకాశాలు ఆధారపడి ఉంటాయి. నాకౌట్‌ దశలోని రెండు మ్యాచ్‌ల్లో పోర్చుగల్‌ గెలిస్తే ఆ జట్టుకు క్వార్టర్‌ ఫైనల్లో డిఫెండింగ్‌ చాంపియన్‌ అర్జెంటీనా ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. 

– సాక్షి క్రీడా విభాగం

Advertisement
 
Advertisement
Advertisement